Begin typing your search above and press return to search.

సీపీఐ - సీపీఎంలతో బాబు అట - పవన్ సాయం!

By:  Tupaki Desk   |   18 March 2019 4:38 AM GMT
సీపీఐ - సీపీఎంలతో బాబు అట - పవన్ సాయం!
X
తనది చంద్రబాబు నాయుడు రాజకీయానికి తందానా అనే ఆటే అని పవన్ కల్యాణ్ పూర్తి స్పష్టతను ఇస్తూ ఉన్నాడు. ఇందులో పవన్ ఏమీ దాపరికంతో వ్యవహరించడం లేదు. చంద్రబాబు నాయుడు ఎలా చెబితే అలా.. అన్నట్టుగా ఉంది పవన్ రాజకీయం. డైరెక్టుగా తెలుగుదేశం పార్టీలోకి కొంతమంది చేరితే వారి పచ్చ ముసుగులు తొలగిపోతాయని - అది జగన్ కు లాభించే అంశం అవుతుందని అనే వారు.. జనసేనలోకి చేరారు!

తెలుగుదేశం పార్టీలోకి చేరే విషయంలో చర్చలు జరిపి - ఆ మేరకు లీకులు ఇచ్చి.. తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఒక పోలీసు అధికారి జనసేనలోకి చేరారు. తద్వారా తెలుగుదేశం పార్టీకి జనసేన బ్రాంచ్ ఆఫీస్ అనే పరిస్థితి నెలకొని ఉంది. ఒక మరోవైపు అభ్యర్థిత్వాల విషయంలో కూడా జనసేన- టీడీపీల ఒడంబడిక కొనసాగుతూ ఉందని.. ఒకరికి ఒకరు సహకరించుకునే రాజకీయాలే నడిపిస్తూ ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్ గా మారింది.

పవన్ కల్యాణ్ పోటీ గాజువాక నుంచి చేయాలని అనుకుంటూ ఉండటంతో..అక్కడ పవన్ కోసం చంద్రబాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా తప్పిస్తున్నారనే ప్రచారమూ సాగుతోంది. ఇలా ఏ మాత్రం దాచడానికి అవకాశం లేకుండా జనసేన - టీడీపీ బంధం బయటపడుతూ ఉంది.

అది పవన్ కల్యాణ్ ఇష్టం. తెలుగుదేశం పార్టీకి సహకరించాలని అనుకుంటున్నాడు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ డైరెక్టుగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాడు. ఇప్పుడు ఇన్ డైరెక్టుగా చేస్తూ ఉన్నాడు అంతే తేడా. అప్పుడు ఓట్లు చీలకుండా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేశాడు. ఇప్పుడు ఓట్లను చీల్చి తెలుగుదేశానికి సాయం చేస్తున్నాడు అదీ కథ.

పవన్ సంగతలా ఉంటే.. పవన్ తో చేతులు కలిపి ఇప్పుడు చంద్రబాబు రాజకీయంలో పావులు అయిపోతున్నాయి కమ్యూనిస్టు పార్టీలు. పవన్ కల్యాణ్ సీట్ల కేటాయింపు విషయంలో వ్యవహారించిన తీరు కూడా దీన్ని స్పష్టం చేస్తోంది. కమ్యూనిస్టు పార్టీలకు ఆఖరి నిమిషం వరకూ పవన్ సీట్లను కేటాయించ లేదు. కేటాయించే సీట్లు ఎన్ని అయినా. వాటిని ముందుగా కేటాయించి ఉంటే ఎర్ర పార్టీల వారు తమప్రచారాన్ని చేసుకునే వాళ్లు. అయితే పవన్ వారికి ఆ అవకాశం ఇవ్వలేదు.

ఏ సీట్లు ఇస్తారు. ఎన్ని సీట్లు ఇస్తారు.. అనే అంశంపై ఏ మాత్రం స్పష్టత ఇవ్వకుండా చివరకు నామినేషన్లకు ముందు రోజు అర్ధరాత్రికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు పవన్ సీట్లను కేటాయించారు. అయితే అది కూడా నామమాత్రంగా. కమ్యూనిస్టు పార్టీలు అడిగింది అరవై సీట్లు అయితే - ఇచ్చింది పద్నాలుగు! ఇంతకన్నా కామెడీ ఏమిటంటే.. అసలు ఊసులో లేని బీఎస్పీకి పవన్ ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లను కేటాయించడం.

బీఎస్పీ ఏమీ తెలుగు వారికి పార్టీ కాదు - జాతీయ భావాలున్న పార్టీ కాదు.ఒక విధానం ఉన్న పార్టీ కాదు. ఎక్కడో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక ప్రాంతీయ పార్టీ. అలాంటి పార్టీకి ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లను కేటాయించిన పవన్ కమ్యూనిస్టు పార్టీలకు మాత్రం పద్నాలుగు సీట్లు ఇచ్చారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీల వారు పవన్ కోసం ఎన్ని రోజుల నుంచి కష్టపడుతూ ఉన్నారో తెలిసిన సంగతే. ప్రతి నియోజకవర్గంలోనూ వీరికి క్యాడర్ ఉంది - పార్టీ నిర్మాణం ఉంది.

అలాంటి పార్టీలకు ఏ మాత్రం ప్రాధాన్యతను ఇవ్వకుండా..చంద్రబాబు నాయుడు రాజకీయానికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. పవన్ కల్యాణ్ బీఎస్పీకి ఎక్కువ సీట్లను కేటాయించారు. బీఎస్పీ ఎలాగూ పోటీని ఇవ్వలేదు. ఆ పార్టీ అంటే ఎవరికీ తెలియదు కూడా. అందుకే ఆ పార్టీకి అన్ని సీట్లు ఇచ్చి.. తెలుగుదేశం పార్టీకి పవన్ మేలు చేస్తున్నాడని - అదే కమ్యూనిస్టు పార్టీలకు సీట్లను కేటాయిస్తే వారు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉండటంతో.. పవన్ వారికి పరిమిత సీట్లను కేటాయించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.