Begin typing your search above and press return to search.

ఇండియన్ టేలెంట్ పై బాబు చిన్నచూపు

By:  Tupaki Desk   |   16 July 2016 6:51 AM GMT
ఇండియన్ టేలెంట్ పై బాబు చిన్నచూపు
X
మేకిన్ ఇండియా అంటూ ప్రధాని మోడీ స్వదేశీ తయారీపై శ్రద్ధ పెడుతున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం విదేశీ సంస్థల వెంట పరుగులు తీస్తున్నారు. పరుగులు తీయడమే కాదు.. మనవాళ్లకు ఏమీ చేతకాదు అంటూ చిన్న చూపు కూడా చూస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తన విదేశీ పర్యటనలను అంతా విమర్శిస్తున్నారని... కానీ.. విదేశాలకు వెళ్లి ఒప్పందాలు కుదుర్చుకుని అమరావతిని నిర్మించకుండా మనవాళ్లకే అప్పగిస్తే మరో మురికివాడను కడతారని ఆయన అన్నారు. ‘సింగపూర్ వెళితే సింగపూర్ కడతానంటున్నానని, ఆస్తానా వెళితే ఆస్తానాల కడతానంటున్నానని ఒకటి రెండు పేపర్లలో రాస్తున్నారు. ఇంకో మురికివాడ కడితే చాలనుకుంటే నేను ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. మన వాళ్లతో కూర్చుంటే వాళ్లు ఇంకో స్లమ్ కడతారు. భావితరాలకు మనం మరో స్లమ్ సిటీని అప్పగిస్తాం. ఉత్తమ అంతర్జాతీయ నగరం కట్టాలనే ఉద్దేశంతోనే రష్యా వెళ్లాను’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్నాయి.

హైదరాబాద్ ఎయిర్‌ పోర్టు కట్టేటప్పుడు ఐదారు ఎయిర్‌ పోర్టులు చూసి వాటి ప్రకారం కట్టాలని జీఎంఆర్‌ కి చెప్పానని.. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు అమెరికా వెళ్లి ఆ దేశం నాలుగు వైపులా 15 రోజులు తిరిగానన్నారు. హైటెక్ సిటీ కట్టాలనుకున్నప్పుడు ఎల్ అండ్ టీతో 20 సార్లు డిజైన్ మార్పించానని అందుకే అది మాన్యుమెంట్‌ గా నిలిచిందన్నారు. అమరావతి డిజైన్‌ పై పోటీ నిర్వహిస్తే ఒక ఆర్కిటెక్ట్ వచ్చాడని ఆయన వల్ల పూర్తిగా పని కాలేదని - సంతృప్తికరంగా లేకపోవడంతో ఇంకా ఉత్తమ నమూనాల కోసం అందరితోనూ మాట్లాడుతున్నామని చెప్పారు. ఇంతవరకూ ఆర్కిటెక్ట్‌ లు ఒక భవనాన్ని కట్టారు తప్ప ఒక నగరాన్ని కట్టలేదన్నారు. అమరావతిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉండడం వల్లే రష్యా - కజకిస్తాన్‌ లో పర్యటించానని తెలిపారు.

కజకిస్థాన్ రాజధాని అస్తానా అనుభవాలు మనకు అందించేందుకు వారు అంగీకరించారని.. అక్కడా నిర్మాణంలో కొన్ని తప్పులు చేశారని.. అలాంటివి ఇక్కడ ఏర్పడకుండా సలహాలిస్తామని చెప్పారని తెలిపారు. ఇందుకు వారి తరఫున ఐదుగురితో ఒక కమిటీ - మన తరఫున ఐదుగురితో ఒక కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. రష్యా రక్షణ రంగ పరికరాలను భారీగా మన దేశానికి ఎగుమతి చేయనుందని ఇందుకోసం ఇక్కడ యూనిట్‌ ను నెలకొల్పాల్సివుందన్నారు. మన రాష్ట్రంలో యూనిట్‌ లు పెట్టాలని అడిగామని ఏపీని డిఫెన్స్ ఏరోస్పేస్ హబ్‌ గా తయారు చేయడమే తన లక్ష్యమన్నారు. భారీగా పెట్టుబడులు సాధించడం, ఉత్తమ టెక్నాలజీని తీసుకురావడం, ఇక్కడి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా విదేశీ పర్యటనలు చేస్తున్నానని తెలిపారు. ఇదంతా ఎలా ఉన్నా మనవాళ్లు కడితే స్లమ్ సిటీ కడతారని చంద్రబాబు అనడంపై అప్పుడే దుమారం రేగుతోంది.