Begin typing your search above and press return to search.

బాబు కేబినెట్ భేటీలో ఏం జరిగింది..?

By:  Tupaki Desk   |   17 Nov 2015 4:36 AM GMT
బాబు కేబినెట్ భేటీలో ఏం జరిగింది..?
X
సోమవారం సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహాన్ని మంత్రులు.. ఉన్నతాధికారులు చవి చూడాల్సి వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు పలుమార్లు మంత్రుల మీదా.. అధికారుల మీదా బాబు గుస్సా అయ్యారు. కేబినెట్ సమావేశంలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన పలు అంశాల విషయంలో బాబు ఒకింత అసహనానికి గురి కావటం గమనార్హం.

విశాఖ మన్యం జిల్లాల్లోని బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన ప్రభుత్వం అనుమతులు ఇవ్వటం.. దానిపై గిరిజనులు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేయటం తెలిసిందే. ఈ మధ్యనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి.. బాక్సైట్ తవ్వకాలపై తన ఫీడ్ బ్యాక్ ఇచ్చి వెళ్లిన నేపథ్యంలో బాక్సైట్ పై ప్రముఖంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ఎవరు అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నించిన చంద్రబాబు.. ఈ విషయంపై మీకు సమాచారం ఉందా అని అటవీశాఖామంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డితో పాటు.. మరో మంత్రి గంటా శ్రీనివాసరావును ప్రశ్నించగా.. తమకు ముందుగా తెలీదని చెప్పటంతో బాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. గిరిజనలు వ్యతిరేకిస్తున్న ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారని అధికారుల్ని అడిగితే.. కేంద్రం నుంచి అన్ని రకాల అనుమతులు వచ్చాయని.. వీటికి కొనసాగింపుగా జీవో ఇవ్వాల్సిన నేపథ్యంలో రోటీన్ లో భాగంగానే ఇచ్చామని.. అసలు ఇది జీవో కాదని.. అటవీ ముఖ్య సంరక్షణాధికారి ఇచ్చిన ఆదేశాలు మాత్రమేనని అధికారులు వివరించగా బాబుకు విపరీతమైన కోపం వచ్చినట్లు చెబుతున్నారు.

ప్రభుత్వంపై ప్రభావం పడే ఇలాంటి అంశాలపై.. తమకు సమాచారం ఇవ్వకుండా అధికారులు ఎలా నిర్ణయాలు తీసుకుంటారని ప్రశ్నించటంతో పాటు.. భవిష్యత్తులో ఇలాంటివి చోటు చేసుకోకూడదని చెప్పినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బాక్సైట్ తవ్వకాల్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. గిరిజనుల మనోభావాల్నిదెబ్బ తీసే ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకూడదని విస్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్ని రద్దు చేయాలన్న వాదన వచ్చినప్పటికీ.. పనులు ఆపి వేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆదేశాలు కూడా ఆగిపోయినట్లేనని అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. భారీగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి మంత్రులు దేవినేని ఉమ.. చినరాజప్పపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. వరదల సమయంలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించాల్సింది పోయి.. ఊరికే ఉండిపోవటం ఏమిటని ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. ఒక ప్రకృతి విపత్తు శాఖ కార్యదర్శి ఢిల్లీ పర్యటనలో ఉన్నట్లు తెలుసుకొని మరింత సీరియస్ అయినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఓపక్క ఏ మాత్రం బాగోని సందర్భంలో దగ్గరుండి పనులు చూసుకోవాల్సింది పోయి.. ఢిల్లీకి వెళ్లటం ఏమిటని అధికారుల్ని మందలించినట్లు చెబుతున్నారు. మొత్తంగా సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గ సమావేశం హాట్ హాట్ గా జరిగినట్లుగా తెలుస్తోంది.

ఇక.. క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాల విషయానికి వస్తే..

= బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి జారీ చేసిన ఆదేశాలు నిలిపివేయటం

= చేనేత కార్మికులకు రూ.110.95కోట్ల మేర రుణమాఫీ చేయాలని నిర్ణయం. 25,567 మంది చేనేత కార్మికులకు లబ్థి చేకూరనుంది.

= రాష్ట్రంలో 4 లక్షల కుటుంబాలకు కొత్తగా విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వాలన్న నిర్ణయం

= ప్రస్తుతం అన్ని కేటగిరీల విద్యుత్ వినియోగదారులకు యూనిట్ కు 6 పైసలుగా ఉన్న ఎలక్ట్రిసిటీ డ్యూటీ విధానంలో మార్పు. వేర్వేరు కేటగిరిలకు విభిన్నంగా సుంకం విధింపు.

= రానున్న ఐదేళ్లలో 4500 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తికి సుజలాన్.. యాక్సిస్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవటానికి వీలుగా మంత్రివర్గ ఆమోదం

= సంక్రాంతికి చందన్న కానుక.

= కొత్తగా 11.37 లక్షల రేషన్ కార్డుల జారీకి నిర్ణయం

= వచ్చే మార్చి లోపు 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు

= విశాఖ.. విజయవాడల్లో మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు త్వరలో మొదలు పెట్టటం

= రాష్ట్రంలో హెల్త్ కేర్ ఏటీఎంలు.. ఏఎన్ ఎంల ద్వారా నిర్వహణ

= రాష్ట్రంలో ఉత్తరాంధ్ర.. రాయలసీమ జిల్లాల్లో ఈ ఏడాది చివరికి.. వచ్చే ఏడాది 50 వేల చొప్పున వ్యవసాయ బోర్లు.. విద్యుత్ కనెక్షన్ల మంజూరు

= వైద్య పరికరాల ఉత్పత్తి పార్కు ఏర్పాటు