Begin typing your search above and press return to search.

సర్దుకుపోవడమా.. విడిపోవడమా?

By:  Tupaki Desk   |   4 Feb 2018 7:14 AM GMT
సర్దుకుపోవడమా.. విడిపోవడమా?
X
విజ‌య‌వాడ‌లోని చంద్ర‌బాబు నివాసంలో టీడీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం ప్రారంభ‌మైంది. స‌మావేశానికి టీడీపీ ఎంపీలతో పాటు కేంద్రమంత్రులు అశోక్ గ‌జ‌ప‌తిరాజు - సుజ‌నా చౌద‌రి హాజరయ్యారు. ఈ భేటీలో ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు క‌ళావెంక‌ట్రావుతో పాటు ఆర్ధిక మంత్రి య‌న‌మ‌ల పాల్గొన్నారు. బ‌డ్జెట్ లో కేంద్రం కేటాయింపులు - బీజేపీతో బంధంపై స‌మావేశంలో చర్చిస్తున్నారు. అయితే... రాజకీయంగా చంద్రబాబుకు ఇప్పడున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన తీవ్ర నిర్ణయాలేమీ తీసుకోలేకపోవచ్చని తెలుస్తోంది. కేవలం బీజేపీ పెద్దలను బెదిరించేందుకు మాత్రమే హడావుడి చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. అందులో భాగంగానే సమావేశానికి వచ్చిన ఎంపీలంతా కీలకం నిర్ణయం వెలువడనుందంటూ చెప్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కాగా పార్లమెంటరీ పార్టీ భేటీకి ముందు ఎంపీ టీజీ వెంక‌టేష్ మాట్లాడుతూ... త‌మ పార్టీకి రాష్ర్ట ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని, ఇవాళ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. మరో ఎంపీ దివాకరరెడ్డి... బ‌డ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి పంగ‌నామాలు పెట్టారని - బీజేపీతో బంధంపై వెన‌క్కి త‌గ్గేది లేద‌ని అటో ఇటో తేల్చుకుంటామ‌ని అన్నారు. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో బీజేపీని నిల‌దీస్తామ‌ని, దీనిపై సీఎంకు అన్ని విష‌యాలు వివ‌రిస్తామ‌ని చెప్పారు. బీజేపీతో బంధంపై నిర్ణ‌యం తీసుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని ఎంపీ ముర‌ళీ మోహ‌న్ అన్నారు. అణిగిమ‌ణిగి ఉంటే బీజేపీ లెక్క చేయ‌డం లేదని, ఆపార్టీతో తెగ‌తెంపులే బెట‌ర్ అని ఆయ‌న అన్నారు.

కాగా ఎంపీలంతా ఇలా బీజేపీతో తెగతెంపులే అన్నట్లుగా మాట్లాడుతుండగా చంద్రబాబు కూడా బీజేపీని బెదిరించేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రేతో ఫోన్ లో మాట్లాడారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న శివసేన - ఇటీవల బీజేపీకి దూరమవుతుండగా, ఆ పార్టీ చీఫ్ తో టీడీపీ అధినేత చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేసి చంద్రబాబుతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏం చేస్తారన్నది సమావేశం అనంతరం మాత్రమే తెలియనుంది.. రాజీ పడతారా.. రాజీనామాలు చేయిస్తారా.. లేదంటే ఏకంగా తెగతెంపులే చేసుకుంటారో చూడాలి.