Begin typing your search above and press return to search.

ఇక తప్పదు.. ఎన్డీయే నుంచి బయటకు!

By:  Tupaki Desk   |   15 March 2018 2:43 PM GMT
ఇక తప్పదు.. ఎన్డీయే నుంచి బయటకు!
X
బహుశా చంద్రబాబునాయుడు నలభయ్యేళ్ల రాజకీయ జీవిత చరిత్రలో తన సొంత వ్యూహం ప్రకారం కాకుండా.. బయటినుంచి ఉన్న రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు సాగుతూ వెళ్లే పరిస్థితి బహుశా ఇదొక్క సందర్భంలోనే వచ్చిందేమో అని ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబునాయుడు తొలిసారిగా రకరనకాలుగా తన ప్రమేయం లేకుండానే తన వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తున్నది. అలాగే ఇప్పుడు వైకాపా అవిశ్వాసానికి మద్దతు ఇస్తాం అని కూడా ప్రకటించిన తర్వాత.. ఆయన అనివార్యంగా ఎన్డీయే కూటమినుంచి బయటకు రావాల్సిన అగత్యం ఏర్పడుతోంది. శుక్రవారం నాడే ఎన్డీయేనుంచి తెలుగుదేశం బయటకు వస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వెలువడవచ్చునని రాజకీయ ఊహాగానాలు సాగుతున్నాయి.

చంద్రబాబునాయుడు రెండు రోజులుగా వరుస పార్టీ సమావేశాల్లోనే తీరిక లేకుండా గడుపుతున్నారు. శరవేగంగా మారుతున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి నష్టం జరగకుండా.. పరిణామాలను ఎలా సర్దుబాటు చేయాలో ఆయన కసరత్తు చేస్తున్నారు. అవిశ్వాసంలో భాగం పంచుకోవడం ఖరారైపోయింది. ఇప్పడిక ఇంకా ఎన్డీయే లో భాగస్వామిగా కొనసాగితే.. కామెడీగా ఉంటుందని ఆయనకే అనిపించినట్లుంది.

శుక్రవారం నాడు సాయంత్రం చంద్రబాబు పాలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. పార్టీలోని అభిజ్ఞ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చే నిర్ణయం ప్రకటిస్తారని అనుకుంటున్నారు.

పాలిట్ బ్యూరో భేటీలో మంచి చెడులు చర్చించిన పిమ్మట ఢిల్లీలో ఉన్న పార్టీ నాయకులకు సమాచారం ఇస్తారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న అశోక్ గజపతి - సుజనా చౌదరిలను తెదేపా ఉపసంహరించుకుని.. అదే పోరాటం కింద ప్రకటించింది. ఎన్డీయేలో కొనసాగడంపై పలు విమర్శలు వచ్చాయి. రాష్ట్రం కోసమే అంటూ ఏదో మాటలు చెప్పారు. తీరా ఇప్పుడు బయటకు వచ్చే నిర్ణయం తీసుకున్నట్లే తెలుస్తోంది.