Begin typing your search above and press return to search.

చంద్రబాబు ప్రచార రూపం మార‌నుందా?

By:  Tupaki Desk   |   13 Jan 2016 9:46 AM GMT
చంద్రబాబు ప్రచార రూపం మార‌నుందా?
X
టీడీపీ జాతీయ అధ్యక్షుడు - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ లో ప్రచారం షురూ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల శంఖారావం పేరుతో ఎల్బీ స్టేడియంలో బ‌హిరంగ నిర్వ‌హించి లాంచ‌నంగా ప్ర‌చారం ప్రారంభించిన మిత్ర‌ప‌క్ష టీడీపీ బీజేపీలు పూర్తి స్థాయి ప్రచారానికి రూపం సిద్ధం చేస్తున్నాయి.

ఈనెల 19 నుంచి చంద్ర‌బాబు దావోస్ ప‌ర్య‌ట‌న ఉండ‌నున్న నేప‌థ్యంలో ఆయ‌న తిరిగి వ‌చ్చిన త‌ర్వాత ఎన్నిక‌ల ప్ర‌చారం చేప‌ట్టేలా ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. ఈ ద‌ఫా భారీ బ‌హిరంగ స‌భ కాకుండా రోడ్‌ షోలు అధికంగా ఏర్పాటు చేయనున్నారు. ఇదే క్ర‌మంలో ఆయా కాల‌నీల వారీగా నాలుగు నుంచి ఐదు కాల‌నీల నేత‌లతో క‌లిసి ఏదైనా ఉమ్మ‌డి వేదిక చూసి అక్కడ స‌మావేశం ఏర్పాటుచేయాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల నుంచి ప్ర‌శ్న‌లు కూడా ఆహ్వానిస్తార‌ని చెప్తున్నారు. అమెరికా, యూరోప్ త‌దిత‌ర దేశాల్లో నిర్వ‌హించే టౌన్‌ హాల్ త‌ర‌హా విధానంలో ఈ స‌మావేశాలు ఉండే అవ‌కాశం ఉంది.

గ్రేట‌ర్ ప్ర‌చారంలో చివ‌రి రోజులైన‌ 28, 29, 30 తేదీల్లో చంద్ర‌బాబు పర్యటించనున్నారు. ఈ ప్ర‌చారంలో భాగంగా ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎన్నికల ప్రచారం చేపడతారు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లతో పెద్ద ఎత్తున క‌లిసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అధికారమిస్తే వచ్చే ఐదేళ్ల కాలంలో హైదరాబాద్‌ నగరంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను అందులో వివరించే అవకాశం ఉంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉన్న కారణంగా, నగరాభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పడమే లక్ష్యంగా కనీస ఉమ్మడి కార్యక్రమం ఉంటుందని తెలిసింది. పార్టీ క్షేత్ర స్థాయి ప్ర‌చారంలో భాగంగా నగరాన్ని ప్లెక్సీలు, బ్యానర్లు, గోడరాతలతో నింపేయాలని టీటీడీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తంగా ఈ ద‌ఫా చంద్ర‌బాబు ప్ర‌చారం కొత్త త‌ర‌హాలో ఉండే అవ‌కాశం ఉంద‌ని చెప్తున్నారు.