Begin typing your search above and press return to search.

వామ్మో.... ఎలా బయటపడాలి

By:  Tupaki Desk   |   5 Oct 2018 5:11 PM GMT
వామ్మో.... ఎలా బయటపడాలి
X
నలభై ఏళ్ల రాజకీయానుభవం. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిత్వం. అన్నే సంవత్సరాలు ఓ రాజకీయ పార్టీకి అధ్యక్ష బాధ్యతలు. ఇవన్నీ సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అర్హతలు. కాదు... కాదు.... ఆయనకున్న అనుభవాలు. అన్నీ ఉన్నా అల్లుడి గారి నోట్లో ఏదో ఉంది అన్నట్లు ఉన్నాయి ఈ రోజులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి గడచిన నాలుగు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీతో హానీమూన్‌ లాగే గడిచింది. కేంద్రంలో ఆయన ఆడింది ఆట... పాడింది పాటగానే సాగింది. నాలుగున్నరేళ్ల ఈ బంధానికి బ్రేక్ పడింది.అంతే చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఎదుర్కోని పరిణామాలను ఎదుర్కొంటున్నారంటున్నారు రాజకీయ పండితులు. స్నేహంగా నటించడం.... నమ్మబలకడం... ఆ తర్వాత ముంచేయడం రాజకీయ పార్టీలు - రాజకీయ నాయకులకు అలవాటైన అంశాలు. అయితే అవే తమ మీద వేరొకరు ప్రయోగిస్తే మాత్రం వారు తట్టుకోలేరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పరిస్థితి ఇలాగే ఉంది. ఎన్నికల ముందు కలిసిన భారతీయ జనతా పార్టీ సరిగ్గా నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడికి ఝలక్ ఇచ్చింది.దాన్నించి తప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు పడుతున్న పాట్లు ఆయన రాజకీయ అనుభవాన్ని కూడా తలదన్నేలా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఓ సీనియర్ రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు తానే అన్నీ చేశానని ప్రకటించుకుంటారు.హైదరాబాద్ ఈ రోజు ఇలా ఉండడానికి తాను చేసిన అభివృద్దే కారణమంటూ ప్రకటనలూ చేస్తూంటారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మాత్రం ఆయనకు మింగుడు పడడం లేదు. ఓ వైపు తన వారిపై సంధిస్తున్న విమర్శలు - వాటికి తన పార్టీ నాయకుల నుంచి సరైన స్పందన రాకపోవడం వంటివి చంద్రబాబు నాయుడికి మింగుడు పడడం లేదని అంటున్నారు. ఎలాంటి వారినైనా తన రాజకీయ చతురతతో ఎదుర్కోగలనన్న చంద్రబాబు నాయుడి ఆత్మ విశ్వాసానికి కమలనాథులు పెద్ద పరీక్ష పెట్టారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దీని నుంచి బయటపడడం చంద్రబాబు నాయుడికి సాధ్యం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి - అటు ఆంధ్రప్రదేశ్‌ లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ. ఇటు తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ తెలుగుదేశానికి నిద్ర లేకుండా చేయడం ఖాయమని అంటున్నారు రాజకీయ పండితులు. కేంద్రంలో అధికార భారతీయ జనతా పార్టీ - తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి - ఆంధ్రప్రదేశ్‌ లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీల చక్రబంధం నుంచి ఎలా బయట పడాలో తెలియక చంద్రబాబు నాయుడు సతమతమవుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.