Begin typing your search above and press return to search.

నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానన్న చంద్రబాబు

By:  Tupaki Desk   |   10 Dec 2019 10:56 AM GMT
నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానన్న చంద్రబాబు
X
ఏపీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. తొలిరోజు నుంచే ఉల్లి ఘాటు అసెంబ్లీని తాకింది. దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నా.. అదంతా ఏపీలోని జగన్ సర్కారు వైఫ్యలమన్నట్లుగా విపక్ష నేత చంద్రబాబు చేస్తున్న హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ఉల్లి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వం ఉల్లి కౌంటర్లను ఏర్పాటు చేసి కేజీ రూ.25 చొప్పున విక్రయిస్తోంది. ఈ అంశంపై అధికార.. ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ అధికారపక్ష నేతలు ఒక అడుగు ముందుకేసి బాబుకు చెందిన హెరిటేజ్ సంస్థలో కిలో ఉల్లి రూ.135కు అమ్ముతున్నారని.. ప్రభుత్వం మాత్రం కిలో పాతికకే అమ్ముతున్నట్లుగా చెప్పారు.

గుడివాడ ఉల్లి పంపిణీ క్యూలైన్లో ఒక వ్యక్తి మరణించారంటూ బాబు చెప్పిన వేళ.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గుడికి వెళ్లిన ఆయన.. ఇంటికి వెళ్లే క్రమంలో ఉల్లి కేంద్రం వద్దకు వచ్చారని.. గుండెపోటుతో మరణిస్తే.. దాన్ని లొల్లి చేస్తున్నట్లు మండిపడ్డారు. ఈ సందర్భంగా హెరిటేజ్ ప్రస్తావన వచ్చింది.

హెరిటేజ్ తమది కాదని.. దాన్ని ఫ్యూచర్ గ్రూప్ నకు విక్రయించినట్లుగా బాబు చెప్పారు. హెరిటేజ్ సంస్థ తమదని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. లేదంటే సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. బాబు మాటతో సభ కాస్తా వేడెక్కింది. .

దీనిపై స్పందించిన మంత్రి బుగ్గన.. హెరిటేజ్‌తో సంబంధం లేదని చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని.. ఫ్యూచర్ గ్రూపులో హెరిటేజ్‌కు వాటాలు ఉన్నాయో లేవో చెప్పాలని చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. అయితే.. దానికి టీడీపీ అధినేత కానీ పార్టీ ఎమ్మెల్యేలు కానీ సూటిగా సమాధానం చెప్పకపోవటం గమనార్హం. హెరిటేజ్ తో తమకు సంబంధం లేదన్న బాబు.. ఫ్యూచర్ గ్రూపులో షేర్లు ఉన్నాయో? లేదో? కాస్త క్లారిటీ ఇచ్చేస్తే సరిపోయేది కదా?