Begin typing your search above and press return to search.

బాబు ఓటుహక్కు మారిపోతుందట

By:  Tupaki Desk   |   13 July 2016 4:44 AM GMT
బాబు ఓటుహక్కు మారిపోతుందట
X
వినటానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. పేరుకు ఏపీ ముఖ్యమంత్రి అయినా.. ఆయన అడ్రస్ ప్రకారం ఆయన కేరాఫ్ హైదరాబాద్ గానే ఉండేది. తాజాగా ఇప్పుడా కేరాఫ్ అడ్రస్ మారింది. మరే రాష్ట్ర ముఖ్యమంత్రికి లేని ఒక విచిత్ర పరిస్థితి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉంది. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన ఆధార్.. ఓటరు కార్డులు మాత్రం హైదరాబాద్ చిరునామాతో ఉన్న పరిస్థితి. రాష్ట్ర విభజన కారణంగా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. వాస్తవానికి విభజన తర్వాత కానీ.. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాతైనా తన ఆధార్.. ఓటరు కార్డులను మార్చుకుంటే బాగుండేది. కానీ.. చంద్రబాబు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకున్నది లేదు.

చూసేందుకు చిన్న విషయంగా కనిపించినా.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధార్ కార్డు.. ఓటరుకార్డు వేరే రాష్ట్రంలో ఉండటం ఇబ్బంది కలిగించే అంశమే.ఇక.. ఏపీ ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టాలనుకునేవారికి ఇదో మంచి అయుధంగా మారింది. బాబుపై విమర్శలు చేసే సమయంలో.. ఆయన ఓటరు.. ఆధార్ కార్డు మీద వస్తున్న విమర్శలకు సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి.

విబజన జరిగి రెండేళ్లు పూర్తి అయినా.. తన ఆధార్.. ఓటరు కార్డు మార్చుకునే విషయంపై దృష్టి పెట్టని ముఖ్యమంత్రి తాజాగా ఆ పనికి శ్రీకారం చుట్టారు. తన ఆధార్ కార్డులోని చిరునామాను హైదరాబాద్ నుంచి ఉండవల్లికి మార్చాలని ఆదేశించారు. దీంతో.. అధికారులు ఆయన చిరునామాను హైదరాబాద్ నుంచి ఉండవల్లికి మారుస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు పూర్తి అయ్యిందనే చెప్పాలి. ఇక.. ఓటరుకార్డునూ ఉండవల్లికి మార్చాలంటూ బాబు ఆదేశించటంతో.. అధికారులు ఆ పని మీద ఉన్నారు. ఎన్నాకెన్నాళ్లకు అన్నట్లు.. ఇంతకాలానికి బాబు ఆధార్.. ఓటరుకార్డు మారనుందన్న మాట.