Begin typing your search above and press return to search.

రద్దుపై బాబు టోన్ ఎంతగా మారిందంటే..

By:  Tupaki Desk   |   21 Dec 2016 5:58 AM GMT
రద్దుపై బాబు టోన్ ఎంతగా మారిందంటే..
X
కొన్ని విషయాల్లో అట్టే తొందరపడకూడదు. కాస్త దూరం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. విశేష రాజకీయ అనుభవం ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి వారు సైతం మరీ ఇంత తొందరపడతారా? అన్న సందేహం కలిగేలా వ్యవహరించటం ఆసక్తికరమైన అంశమే. పెద్దనోట్లను రద్దు చేయాలంటే.. దేశంలో మరే ముఖ్యమంత్రికి రాని ఐడియా చంద్రబాబుకు వచ్చిందనటంలో సందేహం లేదు.

కలలో కూడా ఊహించని అంశాన్ని తెర మీదకు తీసుకురావటమే కాదు.. అదే పనిగా బాబు నోటి నుంచి పెద్దనోట్లను రద్దు చేయాలని.. అదే అవినీతికి.. నల్లధనానికి చెక్ పెట్టేస్తుందంటూ మాట్లాడుతుంటే.. సమయం.. సందర్భం లేకుండా ఇలాంటి విషయాల్ని బాబు మాట్లాడుతున్నారే అని అనుకున్న వారూ ఉన్నారు. బాబు నోటి నుంచి పెద్దనోట్ల రద్దు డిమాండ్ వచ్చిన కొద్దిరోజులకే.. పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ సంచలన నిర్ణయాన్ని ప్రకటించటంతో యావత్ దేశం అవాక్కైంది.

ఈ షాక్ నుంచి తేరుకునే లోపే.. పెద్దనోట్ల రద్దు క్రెడిట్ తనదేనంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అదే పనిగా చెప్పుకోవటం కనిపించింది. బాబు తీరుపై పలువురు విమర్శలు చేసినా.. బాబు మేధావితనంతో వ్యవహరించారని సరిపెట్టుకున్నోళ్లు ఉన్నారు. పెద్దనోట్ల రద్దుపై ఎవరూ ఆలోచించని టైంలో ఆలోచించి.. ఆ దిశగా నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పిన పెద్దమనిషి.. మోడీ ఆ నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే.. తనకు రావాల్సిన క్రెడిట్ కోసం తహతహలాడిన ఆయన.. ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడటం గమనార్హం.

పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై తాజాగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటమే కాదు.. ‘‘నోట్ల రద్దు మనం కోరుకున్నది కాదు’’ అంటూ భారీ వ్యాఖ్యనే చేశారు. అంతే కాదు.. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్న కేంద్రం కారణంగా లెక్కలేనన్ని సమస్యలు ఎదురవుతున్నాయన్న ఆయన.. హుధూధ్ తుపానుతో విశాఖకు తీవ్ర నష్టం వాటిల్లితే ఎనిమిది రోజుల్లో తాను సెట్ చేశానని.. ఆగస్టు సంక్షోభాన్ని సమర్థంగా అధిగమించానని.. అలాంటి తానే నోట్ల రద్దుతో కలుగుతున్న కష్టాల్ని మాత్రం అధిగమించలేకపోతున్నానని వ్యాఖ్యానించటం గమనార్హం.

రోజుకు రెండు.. మూడు గంటలు బ్యాంకర్లతో సమావేశాలు జరుపుతున్నా ప్రయోజనం లేకుండా పోతుందని.. రద్దు నిర్ణయం కారణంగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందని.. డిసెంబరులో పింఛన్లు అందించలేకపోయినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. నోట్ల మార్పిడి ప్రయత్నంలో భాగంగా వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్న వైనం తనను బాధకు గురి చేస్తుందని చెప్పుకొచ్చారు. ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడే చంద్రబాబు.. పెద్దనోట్లను రద్దు చేయాలంటూ చెప్పినప్పుడు.. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న అవగాహన ఎందుకు లేనట్లు? ఒక పెద్ద నిర్ణయంపై తన వైఖరిని స్పష్టం చేసేటప్పుడు.. కనీస కసరత్తు చేయకుండానే బాబు మాట్లాడతారా? అన్న సందేహం కలగట్లేదు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/