Begin typing your search above and press return to search.

చార్టెడ్ ఫ్లైట్‌ తో టూర్ల పెట్టుబడుల లెక్క‌లేవి బాబు?

By:  Tupaki Desk   |   20 Oct 2017 4:40 PM GMT
చార్టెడ్ ఫ్లైట్‌ తో టూర్ల పెట్టుబడుల లెక్క‌లేవి బాబు?
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు విదేశీ ప‌ర్య‌ట‌న‌ - పెట్టుబ‌డుల వెల్లువ అనే ప్ర‌చారంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సందేహాలు వ్య‌క్తం చేశారు. సీఎంగా చంద్ర‌బాబు ప్రమాణస్వీకారం చేసిన దగ్గర్నుంచి జపాన్ - చైనా - అమెరికా - సింగపూర్ - మలేషియా - కోలంబో అంటూ దేశాలన్నీ తిరుగుతున్నారే తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. సొంత వ్యాపారాలు చక్కబెట్టుకునేందుకే బాబు పెట్టుబడుల సాకుతో విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుబారా చేస్తూ చార్టర్డ్ ఫ్లైట్ లో తిరగడం ఎంతవరకు సమంజసమని బాబును ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బొత్స మీడియాతో మాట్లాడుతూ....ఎన్ని పెట్టుబడులు తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

విదేశాలకు వెళుతున్నప్పడు ఎరైనా అక్కడి వారితో అపాయింట్ మెంట్ ఫిక్స్ చేసుకొని వెళతారని, కానీ అలా కాకుండా బాబు తన టీంతో కలిసి అక్కడున్న తెలుగు వాళ్లతో మీటింగ్స్ పెడుతూ ప్ర‌జ‌ల ధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని బొత్స స‌త్యనారాయ‌ణ‌ మండిప‌డ్డారు. చంద్రబాబు తన ఆర్భాటం కోసం రాష్ట్రం పరువు తీస్తున్నాడని బొత్స ఫైర్ అయ్యారు. కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుబారా చేస్తూ చార్టర్డ్ ఫ్లైట్ లో తిరగడం ఎంతవరకు సమంజసమని బాబును ప్రశ్నించారు. చంద్రబాబు మూడున్నరేళ్ల పాలనలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని బొత్స దుయ్యబట్టారు.

సొంత పార్టీకి చెందిన నేత‌ - రాష్ట్ర కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడిగా ఉన్న వ్య‌క్తి అయిన రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ల‌పై ఎందుకు స్పందించ‌డం లేద‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌శ్నించారు. ఆర్థికమంత్రి యనమలకు కేసీఆర్ రూ.2వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చాడని - మరో ఇద్దరు వ్యక్తుల మద్యం వ్యాపారనికి లైసెన్స్ ఇచ్చారన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు చంద్రబాబు - మంత్రులు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో దొరికిపోవడం వల్లే పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ని వదిలి అమరావతికి వచ్చాడన్నారు. హైదరాబాద్ చంద్రబాబు - మంత్రులు టీఆర్ ఎస్ సర్కార్ తో లోపాయికారి ఒప్పందం చేసుకొని...అక్కడ కోట్లాది రూపాయలు కాంట్రాక్టులు తీసుకొని వ్యాపారాలు చేసుకుంటూ ఏమీ తెలియని నంగనాచిలాగా ఇక్కడకు వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.మీరు అక్కడ వ్యాపార సంబంధాలు పెట్టుకోవచ్చు, సామాన్యుడు మాత్రం బతకకూడదా అని ప్రశ్నించారు.