Begin typing your search above and press return to search.

చౌదరిగారు ఐడియా లేకుండా మాట్లాడుతున్నారు

By:  Tupaki Desk   |   15 Aug 2015 9:08 AM GMT
చౌదరిగారు ఐడియా లేకుండా మాట్లాడుతున్నారు
X
పార్టీ సభ్యుల్ని తొందరపడి మాట అనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన వైఖరికి భిన్నంగా వ్యవహరించటం ఆసక్తికరంగా మారింది. ఓ పక్క రాష్ట్రంలో ప్రత్యేక హోదా మీద విపక్షాలతో పాటు.. సీమాంధ్రులు మండి పడుతున్న వేళ.. కేంద్రమంత్రి సుజనా చౌదరి.. ప్రత్యేక హోదా రాదన్నట్లుగా మాట్లాడుతూ.. అందుకు బదులు.. ప్రత్యేక ప్యాకేజీ ఖాయమన్నట్లుగా చేసిన వ్యాఖ్యల్ని చంద్రబాబు ఖండించటం విశేషం. సుజనా చౌదరిని ఉద్దేశించి వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ‘‘చౌదరిగారు ఐడియా లేకుండా మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి ప్యాకేజీ కాదు.. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే. ప్రధాని పిలుపు కోసం ఎదురు చూస్తున్నా. అన్నీ ఆయనతో మాట్లాడతా’’ అని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం.. పార్టీలు.. పార్లమెంటులో బిల్లు ఆమోదం అంశాలకు సంబంధించి వివరణ పత్రం విడుదల చేసిన సందర్భంగా బాబు మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశంపై ఏపీలో పెరుగుతున్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకొని.. వరుసగా వివరణ పత్రాలు విడుదల చేయాలని చంద్రబాబు భావించటం అందులో భాగంగా ఆయన తాజాగా ఒక పత్రాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి సుజనా చేసిన వ్యాఖ్య గురించి ప్రస్తావన రావటంతో..చంద్రబాబు.. ఆయనపై మండిపడినంత పని చేశారు. బాబుకు అత్యంత సన్నిహితంగా ఉంటారని పేరున్న సుజనా.. కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ.. పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యల విషయంలో ఎవరినీ ఉపేక్షించకూడదన్న రీతిలో బాబు మాటలు ఉండటం గమనార్హం.

ప్రత్యేక హోదా గురించి డిమాండ్ బలంగా వినిపిస్తున్న సమయంలో.. ప్రత్యేక హోదా కాదు.. ప్రత్యేక ప్యాకేజీ వస్తుందన్నట్లుగా సుజనా చౌదరి వ్యాఖ్యానించి.. ఆగస్టు నెలాఖరకు అదిరిపోయే ప్యాకేజీ రావటం ఖాయమన్న మాటను మీడియాకు చెప్పటం తెలిసిందే. ఇదే విషయాన్ని బాబు దృష్టికి మీడియా తీసుకురాగా.. ఆయన కాస్తంత అసహనం వ్యక్తం చేసి.. ఐడియా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఏన్డీయే హయాంలో మూడు రాష్ట్రాలు విభజన చేసినా.. రాని లొల్లి మొత్తం యూపీఏ హయాంలో చేసిన విభజన వల్ల మాత్రం నిత్యం గొడవలే నడుస్తున్నాయని.. ఇదంతా కూడా యూపీఏ సర్కారు అడ్డగోలుగా విభజన చేయటం వల్లే ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుందని బాబు విమర్శించారు. తన కొడుకును ప్రధానమంత్రి చేయాలన్న దురుద్దేశంతో రాష్ట్రాన్ని ఇష్టానికి తగినట్లుగా ముక్కలు చేశారని విమర్శించారు. మొత్తానికి తన పార్టీకి చెందిన ఒక కేంద్రమంత్రిని అందరి ముందు ఇలా మాట అనేయటం కాస్త చిత్రమైన విషయంగానే చెప్పాలి.