Begin typing your search above and press return to search.

అమరావతిని ఎలా కడతారో బాబు చెప్పేశారు

By:  Tupaki Desk   |   24 Jun 2016 12:26 PM GMT
అమరావతిని ఎలా కడతారో బాబు చెప్పేశారు
X
ఏపీ రాజధాని అమరావతిని ఎలా నిర్మిస్తారన్న ప్రశ్నపై ఇక ఊహాగానాలు లేనట్లే. ఎందుకంటే.. ఏపీ సర్కారు దీనికి సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దాదాపు నాలుగు గంటలకు పైనే సాగిన ఏపీ మంత్రి వర్గ సమావేశంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అమరావతి నిర్మాణానికి వీలుగా స్విస్ ఛాలెంజ్ పద్ధతిని ఓకే చేసినట్లుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించాలన్న ఆలోచనలకు తగ్గట్లుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చంద్రబాబు చెప్పారు.

సింగపూర్ ప్రభుత్వ సంస్థలైన అసెండా సింగ్ బ్రిడ్జ్.. సెమ్ కార్ట్ లు స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో అమరావతి నిర్మాణంలో పాలు పంచుకునేందుకు ముందుకు వచ్చిందని వెల్లడించారు. అమరావతి డెవలప్ మెంట్ కంపెనీ.. రెండు సింగపూర్ కంపెనీల కన్సార్టియంతో కలిసి అమరావతిని నిర్మిస్తామన్న చంద్రబాబు.. జపాన్ సైతం ఏపీ రాజధానిలో పెట్టుబడులు పెట్టటానికి ముందకు వచ్చిన విషయాన్ని ప్రకటించారు. దీనిపై చర్చలు ఇంకా పూర్తి కాలేదన్న ఆయన.. మరో కీలక అంశాన్ని వెల్లడించారు.

అమరావతి నిర్మాణం కోసం అమరావతి డెవలప్ మెంట్ భాగస్వామికి 1691 ఎకరాల్ని దశల వారీగా అప్పజెప్పనున్నట్లుగా ప్రకటించారు. మొత్తం మూడు విడతల్లో ఈ భారీ మొత్తంలో భూమిని అప్పచెబుతామన్న ఆయన.. ఫేజ్ 1లో 200 ఎకరాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతికి ఓకే చెప్పిన ఏపీ సర్కారు నిర్ణయంపై రాజకీయ దుమారం ఎంత రేగుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు.