Begin typing your search above and press return to search.

ప్యాకేజీపై ఎంపీల‌కు బాబు స్పెష‌ల్ క్లాస్‌

By:  Tupaki Desk   |   22 Oct 2016 4:57 AM GMT
ప్యాకేజీపై ఎంపీల‌కు బాబు స్పెష‌ల్ క్లాస్‌
X
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఏపీ ముఖ్య‌మంత్రి నారాచంద్ర‌బాబు నాయుడు త‌న పార్టీ ఎంపీల‌కు మ‌రోమారు హిత‌ బోధచేశారు. పార్టీ పొలిట్ బ్యూరో స‌మావేశం సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్రదేశ్‌ కు ప్ర‌త్యేక హోదా మొద‌లుకొని పార్టీ బ‌లోపేతం, తెలంగాణ‌లోని రాజ‌కీయ‌- ప‌రిపాల‌న మార్పులు, కేంద్రంలోని ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు స‌వివ‌రంగా చ‌ర్చించారు.

కేంద్ర ప్ర‌భుత్వం ఆంధ్రప్రదేశ్ ప‌ట్ల సానుకూల దృక్ప‌థంతో ఉన్న‌ప్ప‌టికీ వివిధ కార‌ణాల కార‌ణంగా ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేక‌పోయింద‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. అందుకే ప్యాకేజీ ప్ర‌క‌టించింద‌ని అయితే అంత‌టితోనే నాయ‌కులుగా మ‌నం సంతృప్తి చెంద‌వ‌ద్ద‌ని సూచించారు. ప్యాకేజీకి చ‌ట్ట‌బ‌ద్ద‌త ద‌క్కేవ‌ర‌కు ప్ర‌య‌త్నం కొన‌సాగించాల‌ని బాబు స్ప‌ష్టం చేశారు. కేంద్రమంత్రి హోదాలో ఉన్న సుజ‌నా చౌద‌రి ఈ విష‌యంలో ప్ర‌ధాన పాత్ర పోషించాల‌ని ఈ సంద‌ర్భంగా బాబు తేల్చిచెప్పారు.

మ‌రోవైపు నేత‌ల‌కు పార్టీప‌రంగా చేప‌ట్టాల్సిన అంశాల గురించి చంద్ర‌బాబు సుదీర్ఘంగా వివ‌రించారు. న‌వంబరు 1 నుంచి జనచైతన్య యాత్రలు - పార్టీ సభ్యత్వ నమోదు తదితర విష‌యాల్లో పార్టీ నేత‌లు చురుగ్గా పాల్గొనాల‌ని బాబు ఆదేశించారు. పార్టీశ్రేణుల‌తో క‌లిసి ప్ర‌జ‌ల్లోకి వెళితేనే మ‌న‌కున్న ఆద‌ర‌ణ ఏమిట‌నేది తెలుస్తుంద‌ని చెప్పారు .అంతేకాకుండా పార్టీ ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల్లో త‌ప్ప‌నిస‌రిగా పాల్గొనాల‌ని ఆయ‌న ఆదేశించారు. ఈసంద‌ర్భంగా తెలంగాణ‌లోని ప‌రిణామాల ప‌ట్ల చంద్ర‌బాబు చ‌ర్చించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున‌ల్ తీర్పు - స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించాల‌నే తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాల‌ను టీడీపీ నేత‌లు మోత్కుప‌ల్లి న‌ర్సింహులు - రేవంత్ రెడ్డి వివ‌రించారు. దీనిపై బాబు స్పందిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ సైతం త‌గురీతిలో చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని తెలిపారు. తెలంగాణ‌లో కొత్తక‌మిటీల ఏర్పాటు పార్టీ బ‌లోపేతానికి తీసుకోవాల్సిన నిర్ణ‌యాల గురించి ఈ సంద‌ర్భంగా వారు చ‌ర్చించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/