Begin typing your search above and press return to search.

సీరియ‌స్‌ గా తీసుకోమంటున్న బాబు

By:  Tupaki Desk   |   15 Oct 2016 1:39 PM GMT
సీరియ‌స్‌ గా తీసుకోమంటున్న బాబు
X
"సీరియస్ గా తీసుకోండి - పక్కా ప్రణాళికతో పనిచేయండి - ఆర్గనైజ్డ్ స్కిల్స్ చూపండి - గెలుపు తథ్యం!" ఈ త‌ర‌హా మార్గదర్శకం చేసింది ఐఈఎల్‌ టీఎస్ - గేట్‌ - నీట్‌ - ఎంసెట్ లాంటి పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌య్యే విద్యార్థుల‌కు సంబంధిత లెక్చ‌ర‌ర్లు కాదు. ఏపీ ముఖ్య‌మంత్రి - టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు! అలా హిత‌బోధ చేసింది తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌కు. రాబోయే మార్చిలో జరగనున్న పట్టభద్రులు - ఉపాధ్యాయ నియోజకవర్గాల కౌన్సిల్ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులే గెలుపొందాలని చంద్రబాబు నాయుడు స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు - ఇన్ ఛార్జి మంత్రులు - జిల్లాపార్టీ అధ్యక్షులు - ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు - రాష్ట్ర- కేంద్ర పార్టీ బాధ్యులు - మండల - గ్రామ పార్టీ అధ్యక్షులు - అనుబంధ విభాగాల ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా బాబు ఈ విధంగా పార్టీ శ్రేణుల్లో ఆత్మ‌విశ్వాసాన్ని నూరిపోశారు. ఈ సంద‌ర్భంగా గ‌తంలో జ‌రిగిన పొర‌పాట్ల‌ను చేయ‌వ‌ద్దంటూ వివ‌రించారు.

ఈ టెలీ కాన్ఫ‌రెన్స్‌ లో చంద్ర‌బాబు మాట్లాడుతూ... 13 జిల్లాలలో 4 మినహా మిగిలిన జిల్లాలలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. ఓటర్ల నమోదులో ఇప్పటికే 15 రోజులు గడిచి పోయాయంటూ, ఇంకా 40 రోజుల గడువు మాత్రమే ఉందని చెప్పారు. జిల్లా పార్టీ అధ్యక్షులు - ఇన్ ఛార్జి మంత్రులు - రాష్ట్రపార్టీ ప్రధాన కార్యదర్శులు ఈనెల 17 తేదీ వ‌ర‌కు జిల్లా సమన్వయ కమిటీ సమావేశాలను నిర్వహించి పూర్తిస్థాయి ఎన్ రోల్ మెంట్ జరిగేలా చూడాలన్నారు, అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయించడంలో ఆయా ప్రాంతాల నాయకులు ఉత్సాహంగా కృషి చేయాలన్నారు, గతంలో నమోదు చేసుకున్న ఓటర్లను తీసివేసి పూర్తిగా కొత్త ఓటర్ల లిస్టు తయారీ కార్యక్రమం చేపట్టినందున పట్టభద్రులు - ఉపాధ్యాయులు అందరూ కొత్తగా ఓటు నమోదు చేసుకునేలా చూడాలని స్ప‌ష్టం చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో చూపే శ్రద్ద పరోక్ష ఎన్నికల్లో చూపకపోవడం వల్లే గత ఎన్నికల్లో మనం వెనుకబడ్డామంటూ చంద్ర‌బాబు విశ్లేషించారు. ఈ దఫా ఆ లోపాలను సవరించుకుని అందరూ కలిసికట్టుగా, సమన్వయంగా పనిచేయాలని స్ప‌ష్టం చేశారు. ఇది నా ఎన్నిక కాదనే నిర్లిప్తత ఎవరిలో ఉండకూడదని హెచ్చరిస్తూ... ఎవరికివారు ఇది తమ ఎన్నిక అనే భావంతో సమష్టిగా పనిచేసి విజయం సాధించాలని చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు.

నవంబర్ వరకు జరిగే ఓటర్ల నమోదులో ప్రతి నాయకుడు - కార్యకర్త ఉత్సాహంగా పాల్గొనాలని చంద్రబాబు ఆదేశించారు, ప్రత్యక్ష ఎన్నికలు - పరోక్ష ఎన్నికలు - అన్నింటిలో తెలుగుదేశం పార్టీదే పైచేయి కావాలన్నారు. సరైన ప్రణాళిక, సంస్థాగత నైపుణ్యం ఉంటే పరోక్ష ఎన్నికల్లో కూడా గెలుపు తథ్యం అని భ‌రోసా ఇచ్చారు. ఇటీవ‌ల విజయవాడలో నిర్వ‌హించిన వర్క్ షాప్ విజయవంతం చేసిన ఉత్సాహం - స్ఫూర్తిని కౌన్సిల్ ఎన్నికల్లో కూడా చూపించాలన్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కౌన్సిల్ ఎన్నికలు ఒక వేదికగా చేసుకుని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి - సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బాబు వివ‌రించారు. రాష్ట్రంలో ప్రతిపక్షానికి చోటు లేకుండా చేయాలని అందుకు అన్నివర్గాల ప్రజలను మెప్పించాలని కోరారు. కౌన్సిల్ ఎన్నికల ప్రచారం - జనచైతన్య యాత్రలు - పార్టీ సభ్యత్వ నమోదులో అందరు నేతలు - కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనాలని, ప్రజలతో అనునిత్యం మమేకం కావాలని సూచించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/