Begin typing your search above and press return to search.

బాబుతో బంధుత్వాలు బేజార్...

By:  Tupaki Desk   |   1 Feb 2019 5:30 PM GMT
బాబుతో బంధుత్వాలు బేజార్...
X
" రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరు. మీ బంధుత్వాలను మీ ఇంటి దగ్గర పెట్టుకోండి. వాటిని పార్టీతో ముడి పెట్టకండి." ఈ మాటలు అన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. ఆయనకు అక్కడ బంధువులు ఉన్నారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగను ఆంధ్రప్రదేశ్ లో జరుపుకోవడం తలసానికి ఇష్టం. అయితే ఈసారి సంక్రాంతికి మాత్రం తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తమ పార్టీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇది చంద్రబాబునాయుడుకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన బంధుత్వాలకు - రాజకీయాలకు ముడిపెట్టవద్దని పార్టీ నాయకులను హెచ్చరించారు. అదే ఇప్పుడు పార్టీలో వివాదాస్పదమవుతోంది.

తెలుగుదేశం పార్టీలో వెలమలు - యాదవులు - అగ్రవర్ణాలకు చెందిన వారు ఉన్నారు. వీరంతా అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఇటు తెలంగాణలోనూ కూడా ఉన్నారు. వీరి మధ్య గడచిన మూడున్నర దశాబ్దాలుగా మంచి స్నేహం ఉంది. దీంతో ఒకరి పిల్లల్ని మరొకరి ఇంటికి అల్లుళ్ల గాను - కోడళ్లుగాను పంపించుకుని ఆ బంధాన్ని మరింత పెంచుకోవాలని తెలుగుదేశం నాయకులు భావించారు. అలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా చంద్రబాబు నాయుడు హెచ్చరికల అనంతరం ఉన్న స్నేహం, బంధుత్వం ఏమైపోతాయో అనే ఆందోళన తెలుగుదేశం నాయకులలో కనబడుతోంది. తమ వారసులకు తోటి రాజకీయ నాయకుల పిల్లలతో పెళ్లిళ్లు చేయడం - బంధుత్వాలు కలుపుకోవడం చాలా కాలంగానే ఉంది. కొత్తగా చంద్రబాబు నాయుడు పెట్టిన ఆంక్షల వల్ల ఈ ఆనవాయితీకి తూట్లు పడుతున్నాయని తెలుగుదేశం నాయకులు వాపోతున్నారు. రాబోయే మంచి రోజులలో తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులు పిల్లలకు - ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం నాయకుల పిల్లలకు మధ్య వివాహాలు జరగాల్సింది. అలాగ ఇతర పార్టీలకు చెందిన నాయకుల పిల్లలకు కూడా తెలుగుదేశం నాయకుల పిల్లలతో వివాహం జరగాల్సింది. చంద్రబాబు నాయుడు పెట్టిన షరతులతో ఈ వివాహాలు జరుగుతాయా.. లేదా అనే అనుమానం ఆయా నాయకుల కుటుంబాలలో ఆందోళన కలిగిస్తోంది. వ్యక్తిగత వ్యవహారాలకు బంధుత్వాలకు - రాజకీయాలకు ముడి పెట్టడం మంచిది కాదని వారంత లోలోపల మదన పడుతున్నట్లు సమాచారం. పిల్లనిచ్చిన మామనే పదవి నుంచి తప్పించిన చంద్రబాబు నాయుడకు ఆ కాలంలో బంధుత్వాలు గుర్తుకు రాలేదా అని కొందరు తెలుగుదేశం నాయకులు లోలోపలే చెవులు కొరుకుంటున్నట్లు సమాచారం.