Begin typing your search above and press return to search.

బాబు కేబినెట్ 2 గంట‌ల్లోనే ముగిసింది

By:  Tupaki Desk   |   7 July 2018 5:08 AM GMT
బాబు కేబినెట్ 2 గంట‌ల్లోనే ముగిసింది
X
భిన్న ధ్రువాలుగా క‌నిపించే ఇద్ద‌రు చంద్రుళ్లు.. కొన్ని విషయాల్లో మాత్రం ఒకేర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఒక‌ప్ప‌టికి గురుశిష్యులైన చంద్రుళ్ల‌కు సంబంధించి కామ‌న్ గా క‌నిపించే అంశాల్లో ముఖ్య‌మైంది సుదీర్ఘంగా భేటీలు నిర్వ‌హించ‌టం. కేబినెట్ మీటింగ్ మొద‌లుకొని స‌మీక్షా స‌మావేశాల వ‌ర‌కూ ఏదైనా స‌రే.. ఇరువురు చంద్రుళ్ల‌కు మార‌థాన్ మీటింగ్ లంటే మ‌హా ఇష్టం. అదే పనిగా గంట‌ల త‌ర‌బ‌డి స‌మావేశాలు నిర్వ‌హించే వీరి పుణ్య‌మా అని.. వారితో భేటీ కోసం వెయిట్ చేసే వారు ఎక్కువ‌సేపు నీర‌క్షిస్తుంటారు.

కామ‌న్ గా ఉన్న‌ప్ప‌టికీ ఇద్ద‌రు చంద్రుళ్లో తేడా అంశం ఒక‌టుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎప్పుడో కానీ స‌మీక్షా స‌మావేశాల్ని నిర్వ‌హించ‌రు. కానీ.. ఏపీ ముఖ్య‌మంత్రి వ్య‌వ‌హారం అలా ఉండ‌దు. ఆయ‌న అదే ప‌నిగా స‌మావేశాల మీద స‌మావేశాలు నిర్వ‌హిస్తుంటారు. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు ప‌డుకునే వ‌ర‌కూ మీటింగ్ ల కోసం గంట‌ల కొద్దీ స‌మ‌యాన్ని వెచ్చిస్తుండ‌టం క‌నిపిస్తుంది. ఇదే విష‌యాన్ని టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి అయితే.. ఓపెన్ గా మీటింగ్ ల్ని కాస్త తగ్గించాల‌న్న మాట‌ను బాబు ముఖం మీద‌నే చెప్పేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా నిర్వ‌హించిన ఏపీ మంత్రివ‌ర్గ స‌మావేశం రోటీన్ కు భిన్నంగా కేవ‌లం రెండు గంట‌ల్లోనే ముగియ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. కేబినెట్ మీటింగ్ అంటే మినిమం ఐదారు గంట‌ల‌కు త‌క్కువ కాకుండా ఉంటుంది. అందుకు భిన్నంగా త‌క్కువ వ్య‌వ‌ధిలోనే మీటింగ్ ముగియ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం మూడింటికి స్టార్ట్ అయిన మీటింగ్ సాయంత్రం ఐదు గంట‌ల‌కు ముగిసింది.

స‌మావేశం ఎక్క‌డా ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా.. కేవ‌లం ఎజెండాలో పేర్కొన్న అంశాల్ని మాత్ర‌మే చ‌ర్చించ‌టంతో త‌క్కువ వ్య‌వ‌ధిలో స‌మావేశాన్ని పూర్తి చేశార‌ని చెప్పాలి. ఇంత త్వ‌ర‌గా స‌మావేశాన్ని ముగించ‌టానికి కార‌ణం లేక‌పోలేదు. ఉమ్మ‌డి హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ రాధాకృష్ణ‌న్ నియ‌మితుడు కావ‌టం.. ఆయ‌న్నుమ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసేందుకు బాబు హైద‌రాబాద్ వెళ్లాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో కేబినెట్ ను త్వ‌ర‌గా ముగించిన‌ట్లు చెబుతున్నారు. మ‌రోవైపు.. ఉమ్మ‌డి హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి శ‌నివారం ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు. అయితే.. బాబు సింగ‌పూర్ ట్రిప్ ఉన్న నేప‌థ్యంలో మంత్రివ‌ర్గ స‌మావేశాన్ని త్వ‌ర‌త్వ‌ర‌గా పూర్తి చేసిన‌ట్లుగా తెలుస్తోంది. బాబుకు ఎప్పుడూ ఇదే త‌ర‌హా ముఖ్య‌మైన మీటింగ్స్ ఉంటే బాగుండ‌న్న మాట కొంద‌రు మంత్రుల నోట వినిపించ‌టం గ‌మ‌నార్హం.