Begin typing your search above and press return to search.

చంద్రబాబు తొడకొడితే వద్దన్నది ఎవ్వరు?

By:  Tupaki Desk   |   8 Feb 2018 4:14 AM GMT
చంద్రబాబు తొడకొడితే వద్దన్నది ఎవ్వరు?
X
ఇవాళ గురువారం రాష్ట్రవ్యాప్తంగా విపక్షాలు కలసికట్టుగా చేస్తున్న బంద్ జరగబోతోంది. బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలనే ప్రధాన డిమాండ్ తో విభజన హామీలను అన్నిటినీ కూడా నెరవేర్చాలని కోరుతూ వామపక్షాలు పిలుపు ఇచ్చిన ఈ రాష్ట్ర బంద్ కు ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం - భాజపా తప్ప అన్ని పార్టీలూ మద్దతు ప్రకటిస్తున్నాయి. ఆ పార్టీలన్నీ బంద్ లో పాల్గొంటున్నాయి. చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ ఉండే పవన్ కల్యాణ్ కూడా.. బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బంద్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వైఎస్సార్ కాంగ్రెస్ - కాంగ్రెస్ పార్టీలు అంతకుముందే బంద్ కు మద్దతు తెలిపాయి. అయితే ఇంత వంచన కేంద్రం తరఫునుంచి జరుగుతున్నప్పటికీ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికీ బంద్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక్కడ రాష్ట్రంలో ప్రజాజీవితాల్ని ఇబ్బంది పెట్టేలా బంద్ చేయడం కరెక్టు కాదు. ఏదైనా చేయదలచుకుంటే ఢిల్లీలో చేయాలి... అంటూ ఆయన పాత పాట పాడుతున్నారు.

అయినా ఇప్పుడు ప్రజలు లేవనెత్తుతున్న సందేహం ఒక్కటే. ఢిల్లీలోనే ఏదైనా ఆందోళన కార్యక్రమం చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని అనుకుంటే.. ఆ పని మీ పార్టీ ఆధ్వర్యంలోనే చేయవచ్చు కదా చంద్రబాబు గారూ అని వారు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో నిరసనకు మీరు పిలుపు ఇవ్వండి.. పార్టీలతో నిమిత్తం లేకుండా మేమంతా బేషరతుగా పాల్గొంటాం.. అని ప్రజలు అంటున్నారు. ఏదో ఒక పాయింట్ లో ప్రజాగ్రహాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పడానికి ఒక ప్రయత్నం జరుగుతోంటే.. ఇలా మోకాలడ్డడం సరికాదంటూ ప్రజలు చంద్రబాబు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తన ప్రభుత్వానికి కాక పుట్టించేలాగా ప్రతిపక్షాలు రాష్ట్రంలో బంద్ పాటిస్తే అసహనానికి గురౌతూ ఓర్వలేకపోతున్న చంద్రబాబునాయుడు ఇది ఢిల్లీలో పోరాడాల్సిన సమస్య అంటున్నారు. మరి కేవలం పార్లమెంటుకు మాత్రమే తమ ఎంపీలను ఎందుకు పరిమితం చేస్తున్నారో.. ఢిల్లీ గల్లీల్లో పోరాటానికి ఎందుకు వారిని పురమాయించడం లేదో మాత్రం అర్థం కావడం లేదు. శుక్రవారం నాడు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు తాత్కాలిక విరామం వచ్చినప్పటికీ.. తన పార్టీకి చెందిన ఎంపీలతో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగించడానికి చంద్రబాబునాయుడు ఉద్యుక్తులు అయితేనే కేంద్రం మీద ఇంకాస్త ఒత్తిడి పెరుగుతుందని, బంద్ చేస్తున్న వారిని తప్పుపట్టడం మానేసి.. అలాంటి పోరాటానికి తెదేపా నేతృత్వం వహిస్తే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.