Begin typing your search above and press return to search.

చంద్రబాబు నాయుడు భాష ఏంటి..అలా!

By:  Tupaki Desk   |   26 Aug 2019 12:45 PM GMT
చంద్రబాబు నాయుడు భాష ఏంటి..అలా!
X
ఆశా వర్కర్లకు మద్దతుగా చంద్రబాబు నాయుడు ఏవో ట్వీట్లు పెట్టారు. వాటిల్లో ఆశా వర్కర్ల తరఫున చంద్రబాబు నాయుడు మాట్లాడి ఉంటే అందులో తప్పుపట్టడానికి ఏమీ లేదు. ఇంత పెద్ద వ్యవస్థలో ఎవరికైనా నష్టం జరిగి ఉండక మానదు. అలాంటి వారి తరఫున చంద్రబాబు నాయుడు మాట్లాడాలి కూడా.ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యత అది. అయితే అలా మాట్లాడటంలో చంద్రబాబు నాయుడి పదప్రయోగం మాత్రం చిత్రంగా ఉంది. ఆశా వర్కర్ల గురించి మాట్లాడాల్సిన చంద్రబాబునాయుడు ..పెయిడ్ బ్యాచ్ - పేటియం బ్యాచ్ అంటూ మాట్లాడటం మాత్రం విడ్డూరంగా ఉంది.

ఇంతకీ చంద్రబాబు నాయుడు ట్విటర్లో ఏమన్నారంటే..

''ప్రభుత్వ ప్రతి ఆలోచనలో ప్రజలను మోసం చేసే కుట్ర ఉండాల్సిందేనా! ఆశా వర్కర్లకు రూ.10 వేల జీతం పెంచేసాం అంటూ ఫోటోలకు ఫోజులా? మరో పక్క ఏకంగా ఉద్యోగంలోంచి తీసేసే జీవో ఇస్తారా? వాళ్ళ కష్టానికి గ్రేడ్ లు ఏంటి? చిన్న చిన్న ఉద్యోగులపై ఇలాంటి థర్డ్ గ్రేడ్ కుట్రలు ఎలా చేయగలుగుతున్నారు?

ఒక్కో ఆశా కార్యకర్త పనితీరుపై పదిమంది తీర్పు ఇవ్వాలా? అంటే వాళ్ళను మీ ఇష్టానుసారం వేధించాలనేగా? ఇలాంటి దుర్మార్గపు జీవోలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆశా కార్యకర్తలకు హామీ ఇచ్చినట్టుగా నెలకు రూ.10 వేల జీతం ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలి.

ఒక వేళ మీకు ఇవ్వాలని లేకపోతే మీ ఆయుధం సిద్ధంగానే ఉందిగా, ఇంకా ఆలస్యం ఎందుకు? ఒక్క ఫోన్ కొట్టండి మీ వైసీపీ పేటీఎం బ్యాచ్ కి. ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలను కూడా పెయిడ్ ఆర్టిస్టులే అని ఏదో ఒక మార్ఫింగ్ కథ సృష్టిస్తారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలోకి వచ్చినా మీకిది మామూలే కదా!''

అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. మొదటి రెండు పేరాలూ ఓకే. అయితే మార్ఫింగ్, పేటీయం అంటూ చంద్రబాబు నాయుడు ఎందుకు ట్వీట్ చేశారో అర్థం కాని పరిస్థితి. ఇది ఆయనే దేన్నో గుర్తు చేస్తున్నట్టుగా ఉంది. తెలుగుదేశం పార్టీ జూనియర్ ఆర్టిస్ట్ ఒకరు తాజాగా అరెస్ట్ అయ్యారు.

రైతు వేషం వేసుకుని ఆయన మంత్రిని కులం పేరుతో దూషించడం వివాదంగా మారింది. అందుకు సంబంధించి విచారణ సాగుతూ ఉంది. ఇంతలోనే చంద్రబాబు నాయుడు ట్వీట్ చేస్తూ ఆ విషయాన్ని తనే గుర్తు చేస్తున్నారు. ఆశావర్కర్లలో ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు వారికి మద్దతు పలకడం ఓకే కానీ, అదే సమయంలో మార్ఫింగ్ - జూనియర్ ఆర్టిస్టులు అంటూ తెలుగుదేశం ఘన కార్యాలనే ఆయన గుర్తు చేయడం విడ్డూరంగా ఉందని రీట్వీట్లే వస్తుండటం గమనార్హం!