Begin typing your search above and press return to search.

అమిత్‌ షా త‌న‌యుడి అవినీతి సంగ‌తేంటి?

By:  Tupaki Desk   |   25 March 2018 2:46 PM GMT
అమిత్‌ షా త‌న‌యుడి అవినీతి సంగ‌తేంటి?
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు బీజేపీపై మ‌రోమారు ఘాటుగా స్పందించారు. త‌న‌పై వ‌స్తున్న అవినీతి ఆరోప‌ణ‌ల‌పై మాట్లాడుతున్న వారు...బీజేపీ స‌హా ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడి అవినీతిపై ఎందుకు స్పందించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో టీడీపీ ఎంపీలు - మంత్రులు - పార్టీ ప్రచార సారథులు పాల్గొన్నారు. అమిత్ షా లేఖకు అసెంబ్లీలోనే సమాధానం ఇచ్చానన్న చంద్రబాబు.. ప్రజల మనోభావాలకు అనుగుణంగా అడగడం బీజేపీకి నచ్చడంలేదని అన్నారు. బీజేపీ ఆరోపణలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ఈఏపీలకు నిధులు ఇస్తామని చెప్పి.. కనీసం మెమో కూడా ఇవ్వలేదని చంద్రబాబు మండిపడ్డారు.

ఏపీ ప్రభుత్వంపై అవినీతి కేసులు పెడతారని జరుగుతున్న ప్రచారంపై చంద్ర‌బాబు మండిప‌డ్డారు. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌ షా కుమారుడిపై వచ్చిన ఆరోపణలు తేల్చాలన్నారు. వాటిపై అమిత్‌ షా సమాధానం చెప్పాలన్నారు. నీతులు చెప్పే బీజేపీ.. ఒక రాజ్యసభ సీటు కోసం యూపీలో ఎంతకు దిగజారిందో దేశమంతా చూసిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. గతంలో గుజరాత్‌లోను ఇలాగే చేశారని గుర్తుచేశారు. ఏపీలో టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలే తక్కువున్నా విలువల కోసం మూడో స్థానానికి పోటీ పెట్టలేదన్నారు. తొలి బడ్జెట్‌ లోనే గొడవపడితే రాజకీయం అంటారనే ఇన్నాళ్లు ఆగామని.. విధిలేని పరిస్థితుల్లోనే పోరాటమార్గం పట్టామని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులన్నింటికీ యూసీలు ఇచ్చామని చంద్రబాబు విష్పష్టంగా చెప్పారు. యూసీలు ఇవ్వలేదు కాబట్టే నిధులు ఆపామనడం పచ్చి అబద్దం - దుర్మార్గం అన్నారు. నాలుగేళ్లయ్యాక ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చేవన్నీ ఏపీకి ఇవ్వడం బీజేపీకి ఇష్టంలేదన్న బాబు.. తొలి బడ్జెట్‌ లోనే రెక్కలు విరిచి ఎగరమంటే ఎలా అని ప్రశ్నించారు.

వైసీపీ నాయకుల విషయంలో కేంద్రానివి తప్పుడు విధానాలంటూ చంద్రబాబు ఆరోపించారు. అప్పులు ఎగ్గొట్టిన విజయ్ మాల్యాకు ఓ న్యాయం.. జగన్ ఆస్తుల కేసులో ఏ2గా విజయ్‌ సాయి రెడ్డికి మరో న్యాయమా అంటూ సూటిగా ప్రశ్నించారు. విజయ్ మాల్యా విదేశాలకు పారిపోగా.. విజయసాయి పీఎంఓలో తిష్టవేశారని విమర్శించారు. రాష్ట్రంలోని పార్టీలు - వ్యక్తులు ఎవరివైపో డిసైడ్‌ చేసుకోవాలని చంద్రబాబు అన్నారు.