Begin typing your search above and press return to search.

అమిత్ షా కొడుకును ట‌చ్ చేసిన బాబు!

By:  Tupaki Desk   |   26 March 2018 10:29 AM GMT
అమిత్ షా కొడుకును ట‌చ్ చేసిన బాబు!
X
తెర వెనుక ఏం జ‌రిగింద‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. తెర ముందు మాత్రం బీజేపీ.. బాబుల మ‌ధ్య వార్ అంత‌కంత‌కూ ముదురుతోంది. హోదా మీద ర‌గ‌డ మొద‌లైన‌ట్లుగా క‌నిపించినా.. దాని వెనుక అస‌లు క‌థ వేర‌న్న మాట బ‌లంగా వినిపి్స్తోంది. నిన్న‌టి వ‌ర‌కూ మిత్రులుగా ఉన్న‌ప్ప‌టికీ.. కింది స్థాయిలో ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌టం.. పెద్ద‌లు సీన్లోకి వ‌చ్చి గ‌ద‌మాయించ‌టం టీడీపీ.. బీజేపీల‌కు అల‌వాటే.

నాలుగేళ్ల మిత్ర‌త్వంలో ఇప్పుడు కొత్త అంకం ఏమిటంటే.. అధినేత‌లే ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకునే వ‌ర‌కూ శ‌త్రుత్వం పెరిగిన వైనం ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీసిన‌ట్లైంది. రాష్ట్రానికి కేటాయించిన నిధుల విష‌యంలో బాబు స‌ర్కారు త‌ప్పు చేసింద‌న్న‌ట్లుగా అమిత్ షా లేఖ రాయ‌టం తెలిసిందే. దీనికి కౌంట‌ర్ ఇచ్చిన వైనం మీడియాలో వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా త‌న పార్టీ స‌మావేశంలో అమిత్ షా కొడుకు ప్ర‌స్తావ‌న తెచ్చారంటూ వ‌స్తున్న వార్త‌లు ఇప్పుడు రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని మ‌రింత వేడెక్కించేలా మారాయి.

ఇటీవ‌ల పార్టీ ఆవిర్భావ స‌భ‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబు కుమారుడు క‌మ్ మంత్రి లోకేశ్ అవినీతి మీ దృష్టికి వ‌చ్చిందా? అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావించిన వేళ‌.. ఆ అంశంపై బీజేపీ దృష్టి సారించిన‌ట్లుగా తెలుస్తోంది. బాబును దెబ్బ తీసే ప‌నిలో భాగంగా చిన‌బాబు మీద ఫోక‌స్ పెట్టిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇలాంటి వేళ‌..చంద్ర‌బాబు నోటి నుంచి అమిత్ షా కొడుకు మాట రావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఏదో మాట వ‌రుస‌కు కాకుండా.. అమిత్ షా కొడుకు అవినీతి వ్య‌వ‌హారాన్ని చంద్ర‌బాబు ప్ర‌స్తావించ‌టం వెనుక‌.. త‌న కొడుకు మీద అవినీతి ప్ర‌స్తావ‌న తీసుకురాకుండా ఉండేందుకే ఎదురుదాడి అన్న మాట వినిపిస్తోంది. త‌న కొడుకు అవినీతి చేసిన‌ట్లుగా ప్ర‌శ్నించాల‌నుకుంటే ముందు త‌న కొడుకు మీద వ‌చ్చిన ఆరోప‌ణ‌ల మీద అమిత్ షా స్పందించాల‌న్న మాట‌ను త‌మ్ముళ్ల ద‌గ్గ‌ర ప్ర‌స్తావించిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే.. నీ కొడుకు ముచ్చ‌ట నేను ట‌చ్ చేయ‌కుండా ఉండాలంటే నా కొడుకు ముచ్చ‌ట నువ్వు తేవ‌ద్ద‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లుంద‌న్న మాట వినిపిస్తోంది. లోగుట్టుగా జ‌రుగుతుంద‌ని చెబుతున్న ఈ వ్య‌వ‌హారంపై ఇద్ద‌రు ముఖ్య‌నేత‌ల్లో ఎవ‌రు ముందు ఓపెన్ అవుతారో చూడాలి. ఏమైనా.. షా కొడుకు ప్ర‌స్తావ‌న తేవ‌టం ద్వారా బాబుకు తిప్ప‌లు త‌ప్ప‌వ‌న్న మాట వినిపిస్తోంది.