Begin typing your search above and press return to search.

అసలు బుద్ధి బయట పెట్టిన చంద్రబాబు

By:  Tupaki Desk   |   11 April 2018 12:22 PM GMT
అసలు బుద్ధి బయట పెట్టిన చంద్రబాబు
X
ఇన్నాళ్లుగా కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగిందనే ఆవేదనతోనే చంద్రబాబునాయుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారేమో.... కేంద్రంలోని తమ మంత్రులతో రాజీనామాలు చేయించారని ప్రజలంతా అనుకుంటున్నారు. కానీ ఇవాళ ఆయన అసలు విషయం బయట పెట్టారు. ఫక్తు రాజకీయ వ్యూహంతోనే ఆయన ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లుగా ఆయన స్పష్టత ఇస్తున్నారు.

రాష్ట్రంలో అసలు బీజేపీ ఎక్కడుందని.... పక్క పార్టీల అండ చూసుకుని బీజేపీ ఎగిరెగిరి పడుతోందని చంద్రబాబు ఎద్దేవా చేస్తున్నారు. చూడబోతే... రాష్ట్రంలో బీజేపీకి ఠికానా లేదని... వారికంటూ ఓట్లేమీ లేవని అర్ధం కాగానే ఇక వారితో స్నేహబంధపు బరువును వదిలించుకోవడానికి చంద్రబాబు నాయుడు ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది. సరిగ్గా... బీజేపీతో అవసరం తీరిపోయిందని ఆయన భావించే సమయానికి బడ్జెట్లో అన్యాయం జరగడమూ... ఆ సాకు చూపించి చంద్రబాబు తిరుగుబాటు స్వరాన్ని వినిపించడమూ జరిగి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తరువాత ఏ చిన్న సందర్భం వచ్చినా సరే చంద్రబాబు ఆ పార్టీని విపరీతంగా దుమ్మెత్తి పోస్తున్నారు. బుధవారం నాడు ఫూలే జయంతి సందర్భాన్ని కూడా బాబు విడిచిపెట్టలేదు. రాష్ట్రంలో బీజేపీకి అసలు ఉనికి లేదంటూ విరుచుకుపడ్డారు. ఈ రకంగా అన్యాయం చేసిన బీజేపీకి రాష్ట్రంలో అసలు ఎవరైనా ఓట్లేస్తారా అని కూడా బాబు నిలదీస్తున్నారు.

ప్యాకేజీకి ఒప్పుకున్న తన పాపాన్ని ప్రజలు ఛీత్కరించుకోకుండా, ఎందుకు ఒప్పుకున్నానో అంటూ పాచిపోయిన పాత రికార్డును మళ్ళీ వినిపించిన చంద్రబాబు నాయుడు.... వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన త్యాగాన్ని కూడా నాటకంగా అభివర్ణిస్తూ తమ పోరాటం ఒక్కటే నికార్సయినదని సొంత డబ్బా కొట్టుకోవడం విశేషం.