Begin typing your search above and press return to search.

ఈ కెలుకుడేంది చంద్ర‌బాబు..?

By:  Tupaki Desk   |   13 July 2018 4:59 AM GMT
ఈ కెలుకుడేంది చంద్ర‌బాబు..?
X
సంబంధాలు స‌రిగా లేన‌ప్పుడు మాట్లాడే మాట‌లు ఆచితూచి మాట్లాడాలి. క‌డుపు నిండిన మ‌హారాజులైతే.. ఏం మాట్లాడినా చెల్లుతుంది. నిత్యం కేంద్రం వైపు చూడాల్సిన వేళ‌.. కేంద్ర స‌హ‌కారం లేక‌పోతే ఏమీ చేయ‌లేని దుస్థితిలో ఉన్న రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు విష‌యాల మీద ఎంతో జాగురూక‌త‌తో ఉండాలి. రాజ‌కీయంగా పంచాయితీ ఉన్న‌ప్పుడు.. కొన్ని అంశాల్ని అన‌వ‌స‌రంగా కెల‌క‌కుండా ఉండ‌టం చాలా అవ‌స‌రం. కానీ.. అందుకు భిన్నంగా లేనిపోని కొత్త ఆలోచ‌న‌లు క‌లిగేలా కెలుకుడు ఏ మాత్రం మంచిది కాదు.

తాజాగా అలాంటి కెలుకుడు మాట‌లతో కొత్త త‌ల‌నొప్పులు తెచ్చుకునేలా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేంద్రంతో ఫైట్ చేస్తున్న ఆయ‌న‌.. మోడీ స‌ర్కారుపై గ‌డిచిన కొంత‌కాలంగా విమ‌ర్శ‌లు చేస్తున్న వైనం తెలిసిందే. తాజాగా కేంద్రంపై బాబు సంధించిన నిందాస్త్రంతో లాభం కంటే న‌ష్ట‌మే జ‌రిగే ప్ర‌మాదం ఉంద‌ని చెబుతున్నారు.

ఇటీవ‌ల ఈజ్ ఆఫ్ డూయింగ్ (ఈసారి దీనికి పేరు మార్చారనుకోండి) లో ఏపీ మొద‌టి స్థానంలో నిలిచిన‌ట్లుగా కేంద్రం ప్ర‌క‌టించింది. కేవ‌లం 0.09 శాతం మార్కుల తేడాతో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. అయితే.. మొద‌టి స్థానంలో ఏపీ నిల‌వ‌కుండా చేయ‌టానికి కేంద్రం చాలానే చేసిందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు చంద్ర‌బాబు. విధి లేని ప‌రిస్థితుల్లోనే ఇచ్చార‌ని.. అప్ప‌టికి కొన్ని అంశాల్ని తొల‌గించ‌టం ద్వారా.. మొద‌టి స్థానంలో ఏపీ రాకుండా ఉండేలా ప్లాన్ చేశార‌ని.. కానీ అడ్డుకోలేక‌పోయిన‌ట్లుగా చెప్పారు.

ఈ త‌ర‌హా మాట‌లు కొత్త త‌గువును తేవ‌ట‌మే కాదు.. ఏపీ అంటే మ‌రింత ఏవ‌గింపు క‌లిగేలా చేస్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఒక‌వేళ‌.. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏ ప‌దో స్థానంలో నిలిస్తే.. అప్పుడు ఈ త‌ర‌హా నింద‌లు వేసి.. దానికి త‌గ్గ ఆధారాలు తెర మీద‌కు తేవ‌టం బాగుంటుంది. అందుకు భిన్నంగా.. మొద‌టి ర్యాంకును ఏపీకి క‌ట్ట‌బెట్టిన త‌ర్వాత కూడా నింద‌లు వేయ‌టం ఏ మాత్రం స‌రికాద‌న్న వాద‌న వినిపిస్తోంది.

దేశంలో ఏ రాష్ట్ర స‌ర్కారుపై లేని న‌మ్మ‌కాన్ని పెట్టుబ‌డిదారులు ఏపీ మీద చూపించార‌న్న ఆయ‌న‌.. సుల‌భ‌త‌ర వాణిజ్యంలో రాష్ట్రానికి మొద‌టిస్థానం వ‌చ్చినా సొంత పార్టీ ఎమ్మెల్యేలు.. పార్టీ నేత‌లు తేలిగ్గా తీసుకుంటున్నారంటూ విమ‌ర్శలు చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. కర్నూల్ లో ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేయాల్సిందేన‌ని..కాదంటే కేంద్రం.. రాష్ట్రం రెండు క‌లిసి ఈ ప‌రిశ్ర‌మ‌ను నెల‌కొల్పుదామ‌న్నారు. కాదంటే.. రాష్ట్రమే ఏర్పాటు చేస్తుంద‌ని.. కాకుండే ప‌దేళ్లు ప‌న్ను రాయితీ ఇవ్వాల‌న్నారు. ఓప‌క్క మొద‌టి ర్యాంకు ఇచ్చిన కేంద్రాన్ని త‌ప్పు ప‌డుతూ.. కుట్ర చేశార‌ని కెలుకుతూనే.. మ‌రో వైపు కేంద్రాన్ని సాయం అడిగితే ఎవ‌రికి మాత్రం కాల‌కుండా ఉంటుంది.

రాజ‌కీయంగా మైలేజీ సాధించాలంటే చాలానే మార్గాలు ఉంటాయి. కానీ.. అవ‌స‌రం లేని అంశాలను ట‌చ్ చేసి మ‌రీ ప్ర‌యోజ‌నం పొందాల‌నుకోవ‌టం స‌రికాద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. మ‌రింత కీల‌క‌మైన అంశాన్ని బాబు ఎందుకు మిస్ అవుతున్న‌ట్లు..?