Begin typing your search above and press return to search.

చంద్రబాబు కామెంట్లతో 'కుల'కలం

By:  Tupaki Desk   |   9 Feb 2016 4:58 AM GMT
చంద్రబాబు కామెంట్లతో కులకలం
X
కాపులకు రిజర్వేషన్లు - ముద్రగడ పద్మనాభం దీక్ష విరమణ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన పలు వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాపుల రిజర్వేషన్ పై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిస్తున్న క్రమంలో కులాల గురించి మాట్లాడుతూ ఆయన అన్న మాటపై విమర్శలు వస్తున్నాయి. అయితే... ఆయన యథాలాపంగా అన్న మాటలే కానీ, ఉద్దేశపూర్వకంగా ఏ కులాన్నీ కించపరిచేందుకు అన్న మాటలు కావని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

కులాలు మనం గీసు కున్న గీత.. ఎవరూ తమ కోరిక మేర తాము పుట్టరు... అలా అయితే ఎవరు మాత్రం ఎస్‌ సి కులంలో పుట్టాలని కోరుకుంటారు అని చంద్రబాబు అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పలువర్గాలు విమర్శలు చేస్తున్నాయి.

అంతేకాదు... కులాలతో ఎవరూ ఎన్నికల్లో గెలవరని చంద్రబాబు అంటూ... కుల ఉద్యమాలకు మీడియా విపరీతమైన ప్రచారం కల్పించడాన్ని ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఆయన ''కులంతో ఎవరూ గెలవరు... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ది ఏ కులం? ఆయన కులంతో గెలిచారా? ప్రధాని మోదీది ఏ కులం? ఆయన కులం ప్రాతిపదికన గెలిచారా? బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ - ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ లవి ఏ కులాలు?'' అని చంద్రబాబు ప్రశ్నించారు. కుల ఉద్యమం చేసిన మాదిగ దండోరా నేత మంద కృష్ణ మాదిగ పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయని ప్రశ్నించారు. కాపులకు కోటాను వ్యతిరేకిస్తున్న బీసీ నేత, తమ పార్టీ తెలంగాణ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య పేరు కూడా ప్రస్తావించారు. ఆర్‌.కృష్ణయ్యను పోటీకి పెట్టడంవల్లే ఆ స్థానంలో (ఎల్బీ నగర్‌) తమకు మెజారిటీ తగ్గిందని వ్యాఖ్యానించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో విడిపోతే సమస్యలు వస్తాయన్నారు.