Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఫ్రంట్‌ పై బాబేమ‌న్నారంటే?

By:  Tupaki Desk   |   25 May 2018 7:13 AM GMT
కేసీఆర్ ఫ్రంట్‌ పై బాబేమ‌న్నారంటే?
X
జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన తెలుగు నేల‌కు చెందిన రాజ‌కీయ నేత‌లు చాలా మందే ఉన్నారు. ఢిల్లీ న‌డి వీధుల్లో తెలుగు జాతికి జ‌రుగుతున్న అవ‌మానాన్ని చూసి త‌ట్టుకోలేకే... స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు తెలుగు దేశం పార్టీ పేరిట ఏకంగా ఓ రాజ‌కీయ పార్టీని పెట్టి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు ఆయ‌న చుక్క‌లు చూపారు. ఏడాది తిరిగేలోగానే తెలుగు నేల‌లో అధికారం చేప‌ట్టి తెలుగోడి స‌త్తా ఏమిటో చూపించారు. ఎన్టీఆర్ కంటే కాస్తంత ముందుగా నీలం సంజీవ‌రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని, నాడు ఆ పార్టీ అధినేత్రిగా ఉన్న ఇందిరా గాంధీని మూడు చెరువుల నీళ్లు తాగించిన వైనం కూడా మ‌నం మ‌రిచిపోలేనిదే. ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులుగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు, టీఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావులు జాతీయ రాజ‌కీయాల‌పై మ‌రింత‌గా ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టిన కేసీఆర్‌... జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌, బీజేపీ కూట‌ముల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయ‌నున్నాన‌ని ప్ర‌క‌టించిన విష‌యం కూడా తెలిసిందే. ప్ర‌క‌ట‌న‌తోనే స‌రిపెట్ట‌ని కేసీఆర్‌... ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు మద్దతు కూడ‌గ‌ట్టేందుకంటూ ప‌లు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లారు. ఈ ప‌ర్య‌ట‌న‌ల్లో మిశ్ర‌మ ఫ‌లితాలు వ‌చ్చినా... త‌న‌దైన దూకుడుతో కేసీఆర్ ముందుకు సాగుతూనే ఉన్నారు. మొత్తంగా ప్రాంతీయ పార్టీల స‌త్తా ఏమిటో చూపాల‌న్న క‌సి కేసీఆర్‌లో క‌నిపిస్తోంద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

ఇక ఏపీ సీఎంగా ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే... గ‌తంలో కేంద్రంలో పురుడుపోసుకున్న నేష‌న‌ల్ ఫ్రంట్‌, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు, కేంద్రంలో కొంత‌కాలం పాల‌న సాగించిన విష‌యం తెలిసిందే. నేష‌న‌ల్ ఫ్రంట్ ఏర్పాటు స‌మ‌యానికి చంద్ర‌బాబు రాజ‌కీయాల్లో ఉన్నా... జాతీయ స్థాయి అన్న మాటే లేదు. నాడు టీడీపీ అధ్య‌క్షుడిగా ఉన్న ఎన్టీఆర్ చొర‌వ‌తోనే నేష‌న‌ల్ ఫ్రంట్ ఏర్పాటైంది. నేష‌న‌ల్ ఫ్రంట్‌కు ఎన్టీఆరే అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఆ ఫ్రంట్ అధికారం చేప‌ట్ట‌గా... చంద్ర‌శేఖ‌ర్‌, వీపీ సింగ్ లు ప్ర‌ధానులుగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఆ త‌ర్వాత అదే ఫ్రంట్ నుంచి కొన్ని పార్టీలు బ‌య‌ట‌కు పోగా.. మ‌రికొన్ని పార్టీలు వ‌చ్చి చేర‌గా యునైటెడ్ ఫ్రంట్ గా పేరు మారింది. దానికి చంద్ర‌బాబు క‌న్వీన‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. నాడు అటు కాంగ్రెస్‌తో పాటు ఇటు బీజేపీ కూడా అధికారం చేప‌ట్ట‌లేని ప‌రిస్థితుల్లో యునైటెడ్ ఫ్రంట్ ప్ర‌భుత్వం కొలువుదీర‌గా... హెచ్‌డీ దేవేగౌడ‌, ఐకే గుజ్రాల్‌లు ప్ర‌ధాన మంత్రులుగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. మొత్తంగా జాతీయ రాజ‌కీయాల్లో తెలుగు నేత‌ల స‌త్తా ఏమిటో జాతీయ పార్టీల‌కు తెలిసి వ‌చ్చింది.

అదే క్ర‌మంలో ఇప్పుడు కూడా స‌త్తా చాటుదామ‌ని కేసీఆర్ నిజంగానే ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్ప‌టికే పశ్చిమ బెంగాల్‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు వెళ్లిన కేసీఆర్‌... అక్క‌డి పార్టీల‌తో భేటీ అయ్యారు. ఈ భేటీల్లో మిశ్ర‌మ ఫ‌లితాలు వ‌చ్చినా... కేసీఆర్ మాత్రం త‌న‌దైన శైలి య‌త్నాలు మాత్రం చేస్తూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో నిన్న టీడీపీ తెలంగాణ శాఖ నిర్వ‌హించిన మ‌హానాడుకు హాజ‌రైన చంద్ర‌బాబు... కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌పై సెటైరిక్ దాడి చేశారు. జాతీయ రాజ‌కీయాల్లో యాంటీ కాంగ్రెస్‌, యాంటీ బీజేపీ కూట‌మి ఏర్పాటూ ల‌క్ష్య‌మ‌ని ప్ర‌క‌టించిన కేసీఆర్ మాట‌ల‌ను ప‌రోక్షంగా ప్ర‌స్తావించిన చంద్ర‌బాబు... కొందరు నాయకులు ఇటీవల కాలంలో కాంగ్రెస్ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక కూటములు అంటూ చెబుతున్నారని, కానీ తాను ఎప్పుడో చేశానని సెటైర్లు సంధించారు. తాను 22 ఏళ్ల క్రితమే యాంటీ కాంగ్రెస్ - యాంటీ బీజేపీ కూటమిని ఏర్పాటు చేశాన‌ని, కేంద్రంలో నాడు ఆ మూడో కూటమి అధికారంలో కొనసాగిందని చంద్రబాబు త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేశారు. తాను ఎప్పుడో చేస్తే, ఇప్పుడు కొందరు నేతలు దాని గురించి మాట్లాడుతున్నారన్నార‌ని ప‌రోక్షంగా కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు. 2019 ఎన్నికలు అయ్యాక కేంద్రంలో చక్రం తిప్పుతామని కూడా చంద్ర‌బాబు చెప్ప‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా త‌న పార్టీ పండుగ‌క‌ని వెళ్లిన హైద‌రాబాదు వెళ్లిన చంద్ర‌బాబు... అక్క‌డ కేసీఆర్‌ ను టార్గెట్ చేసుకుని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మ‌రి ఈ వ్యాఖ్య‌ల‌పై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.