Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఫుల్లు బాటిల్ కథ తెలుసా?

By:  Tupaki Desk   |   6 Jun 2016 7:21 AM GMT
చంద్రబాబు ఫుల్లు బాటిల్ కథ తెలుసా?
X
జల సంరక్షణ - మొక్కల పెంపకం వంటి విషయాల్లో ప్రజల్లో మార్పు తేవాలన్న లక్ష్యంతో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దిశగా ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా మొక్కలు నాటడాన్ని అలవాటుగా చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. వివాహాలు - పుట్టినరోజు వంటి శుభసందర్భాల్లో ఇంకుడు గుంతలు తవ్వాలని సూచించిన ఆయన తాజాగా భార్యాభర్తలు గొడవ పడిన సందర్భాల్లో మొక్కలు నాటాలంటూ ఆసక్తికరమైన సూచన చేశారు. అంతేకాదు.. ఆ సూచన సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు.

విదేశాల్లో భార్యాభర్తలు గొడవ పడిన తరువాత తలో పెగ్గు వేసి పడుకుంటారు. కానీ, మన దగ్గర మాత్రం ఏకంగా ఒక ఫుల్లు బాటిలే ఖాళీ చేసేస్తారని అన్నారు. అలా మద్యం తాగడం వల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా ఆర్థికంగానూ దెబ్బతింటారని... మానసిక ప్రశాంతతకు మందు మద్యం కాదని.. మొక్కలని చెప్పారు. అందుకే భార్యాభర్తలు గొడవ పడితే వెంటనే ఒక మొక్క నాటాలని.. ఫుల్లు బాటిల్ ఎత్తేయకూడదని అన్నారు. అలా మొక్కలు నాటడం వల్ల పర్యావరణానికి - ప్రజారోగ్యానికి కూడా మంచిదని చెప్పారు.

ఏపీ ప్రజల్లో మద్యం అలవాటు పెరిగిపోతుందని... అది మానుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. పేకాట... పందేలు వంటివాటి జోలికి కూడా వెళ్లొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే.. ప్రజా సంక్షేమం కోసం చంద్రబాబు సూచనలు చేస్తూ.. దురలవాట్లు మానుకోవాలని పిలుపునిస్తుండగా విపక్షాలు మాత్రం దాన్ని కూడా భూతద్దంలో చూస్తున్నాయి. ఏపీ ప్రజలు మద్యం తాగుతారని చెబుతూ ముఖ్యమంత్రి జనాన్ని తాగుబోతులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.