Begin typing your search above and press return to search.

మన్మోహన్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   21 Dec 2016 10:02 AM GMT
మన్మోహన్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
X
ప్రధానిగా పనిచేసినా - ముఖ్యమంత్రిగా పనిచేసినా ప్రతిఒక్కరిలోనూ నాయకత్వ లక్షణాలే చూడాలా లేక వారికి మాత్రమే ప్రత్యేకమైన సామర్ధ్యాలను చూడాలా అనేది అతిపెద్ద ప్రశ్నగా భావించేవారూ ఉంటారు.. అది చాలా చిన్న విషయం అని భావించేవారు ఉంటారు. ఆ సంగతులు కాసేపు పక్కనపెడితే... తాజాగా నాయకత్వ లక్షణాలు లేకపోవడానికి ఉదాహరణగా ఆర్థిక వేత్త - మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ని చూపించారట చంద్రబాబు.

టీడీపీ ఎంపీలు - ఎమ్మెల్సీలు - ఎమ్మెల్యేలు - నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ చార్జీలు - పార్టీ ముఖ్య‌నేత‌ల‌కు నిర్వ‌హించిన వ‌ర్క్ షాప్ సంద‌ర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారట. మన్మోహన్ సింగ్ పదేళ్లపాటు ప్రధానిగా పనిచేసినా ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఎప్పుడూ నిలవలేదని, దీంతో పాటు మన్మోహన్ సింగ్ లో నాయకత్వ లక్షణాలు లేవని తేల్చేశారట బాబు! అలాగే సూటు - బూటు వేసుకుని గ్రామాల్లోకి వెళ్తే ప్రజలకు దగ్గర కాలేరని వ్యాఖ్యానించారట. పదేళ్లు ప్రధానిగా పనిచేసినా - నాయకుడిగా మాత్రం మన్మోహన్ సింగ్ ముద్ర వేయలేకపోయారని చంద్రబాబు టీడీపీ నేతలతో చెప్పారని తెలుస్తోంది.

దీంతో.. ఇక్కడ నాయకత్వ లక్షణాలు లేకపోవడానికి ఉదాహరణగా మన్మోహన్ నే చూపించాలా అనేది కొందరి ప్రశ్న. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి అని ప్రధాని కాలేదనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే మన్మోహన్ ని నాయకుడిగా కన్నా ఓ ఆర్థికవేత్తగా భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కొనియాడుతుంటాయి. ఏది ఏమైనా... ఈ సమావేశంలో సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు - టీడీపీ నేతలకు నాయకత్వ లక్షణాలపై ప్రత్యేకంగా వివరించే క్రమంలో మన్మోహన్ ప్రస్తావన తీసుకొచ్చి ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/