Begin typing your search above and press return to search.

మాట‌ల‌తో మోడీకి చుక్క‌లు చూపిస్తున్న బాబు

By:  Tupaki Desk   |   13 March 2018 3:49 AM GMT
మాట‌ల‌తో మోడీకి చుక్క‌లు చూపిస్తున్న బాబు
X
సెంటిమెంట్ అస్త్రం చిక్కాలే కానీ దాన్ని వాడుకోని రాజ‌కీయ నాయ‌కుడు ఉండ‌దు. తాజాగా అలాంటి వ్యూహాన్నే అమ‌లు చేస్తున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. కేంద్రంలోని త‌మ నేత‌ల చేత కేంద్ర‌మంత్రి ప‌ద‌వుల్ని ఉప‌స‌హ‌రించుకునేలా చేసిన ఆయ‌న‌.. మోడీ స‌ర్కారులో భాగ‌స్వామిగా ఉంటూనే.. భారీ విమ‌ర్శ‌నాస్త్రాల్ని సంధించారు. ఏపీ శాస‌న మండ‌లిని వేదిక‌గా తీసుకొని ఆయ‌న మోడీ స‌ర్కారుపై నిప్పులు చెరిగారు.

ఈ మ‌ధ్య‌న తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ద‌క్షిణాది.. ఉత్త‌రాది అంటూ వేరు చేసి మాట్లాడిన దానికి కొన‌సాగింపుగా బాబు తాజా ప్ర‌సంగం ఉండ‌టం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ద‌క్షిణాది రాష్ట్రాల ప‌న్నుల‌తో ఉత్త‌రాది రాష్ట్రాల‌ను అభివృద్ధి చేస్తున్న వైనాన్ని తెర పైకి తీసుకొచ్చారు. ద‌క్షిణాది నుంచి ప‌న్నుల రూపంలో డ‌బ్బులు కేంద్రానికి ఎక్కువ వ‌స్తాయ‌ని.. కేంద్రం మాత్రం ఆ నిధుల్ని ఉత్త‌ర భార‌తానికి ఎక్కువ ఖ‌ర్చు చేస్తుంద‌ని చెప్పారు. మీరు అభివృద్ధి చెందుతున్నారంటూ రాష్ట్రానికి సాయం చేయ‌క‌పోవ‌టం అన్యాయం అన్న‌ది బాబు వాద‌న‌. ఏపీ విభ‌జ‌న జ‌రిగిన తీరు బాధాకార‌మ‌ని.. విభ‌జ‌న కార‌ణంగా భారీగా న‌ష్ట‌పోయిన రాష్ట్రంపై చిన్న‌చూపు చూడ‌టం మ‌రింత బాధ క‌లుగుతుంద‌న్న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. తాజాగా చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు చూస్తే.. కేంద్రంపై ఏపీ ప్ర‌జ‌ల్లో మ‌రింత మంట పుట్టేలా చేస్తున్నార‌ని చెప్పాలి. వాస్త‌వాలే చెప్పిన‌ప్ప‌టికీ.. బాబు టోన్ లో గ‌తంలో మాదిరి సాఫ్ట్ గా లేక‌పోవ‌ట‌మే కాదు.. కేంద్రం తీరును త‌ప్పు ప‌ట్టేలా.. ప్ర‌జ‌ల సెంటిమెంట్స్ ను ట‌చ్ చేసేలా ఉండ‌టం గ‌మ‌నార్హం.

కేంద్రం తీరును తీవ్ర‌స్థాయిలో త‌ప్పు ప‌ట్టిన చంద్ర‌బాబు.. శాస‌న మండ‌లిలో ఆయ‌న చేసిన ప్ర‌సంగంలోని కొన్ని కీల‌క వ్యాఖ్య‌ల్ని చూస్తే..

+ జాతీయ పార్టీలు ప్రజల మనోభావాలతో ఆడుకోరాదు. జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి. సూచించారు. బీజేపీ కూడా కాంగ్రెస్ లా చేస్తే ఏమాత్రం మంచిది కాదు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన 18 హామీలను అమలు చేయాల్సిందే.

+ హక్కుల కోసం పోరాడతాం. రాజీ పడేది లేదు. ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలో పేర్కొన్నవన్నీ సాధించేదాకా వెనక్కి తిరిగి చూసేది లేదు. ఎంతదాకానైనా వెళతాం.

+ తెలంగాణకు.. ఇతర రాష్ట్రాలకు ఉన్నట్లుగా నవ్యాంధ్రకు కూడా ఒక రాజధాని నగరం కావాలి. రాజధానికి రూ.1500 కోట్లు ఎలా సరిపోతాయి? ఏపీకి రాజధాని అవసరం లేదా? హైదరాబాద్‌, బెంగుళూరులో ఎన్నో పరిశోధన సంస్థలున్నాయి. అదే విధంగా ఏపీకి ఉదారంగా కేంద్ర సంస్థలు ఎందుకు మంజూరు చేయరు? ఏపీ భారతదేశంలో భాగం కాదా?

+ కేంద్రం ఇచ్చిన నిధులకు యూసీలు పంపలేదనడం సరికాదు. రాజధాని నిధులపై యూసీలు పంపాం. దీనిని నీతి ఆయోగ్‌ ధ్రువీకరించింది. ఒక అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మాణం చేస్తాం. అవసరమైతే శ్రమదానం చేసైనా, త్యాగాలు చేసైనా ఒక ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తాం. తెలుగు వారంటే ఏమిటో నిరూపిస్తాం. ఏపీ ప్రజలు కష్టపడతారు. మా కష్టం ఎక్కడికీ పోదు. ప్రధాని మోదీ తిరుపతి సభలో... కాంగ్రెస్‌ పార్టీ తల్లిని చంపి బిడను బతికించిందని అన్నారు. తల్లిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

+ సెంటిమెంట్‌ తో నిధులు రావని అరుణ్‌ జైట్లీ వ్యాఖ్యానించారు. ఏం... తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ కోసం రాష్ట్రాన్ని విభజించలేదా? ప్రత్యేక హోదా ఏపీ హక్కు. అది రాష్ట్రానికి ఇచ్చి తీరాల్సిందే.

+ ప్రత్యేక హోదా - రాయితీలు ఇవ్వలేమని జైట్లీ నిర్మొహమాటంగా ప్రకటించారు. హోదా ఉన్న రాష్ట్రాలకు పారిశ్రామిక రాయితీలు పొడిగించారు. అలాగే ఏపీకి పారిశ్రామిక రాయితీలు ఎందుకు ఇవ్వరు? ప్రత్యేక హోదా ఇవ్వకూడదని తాము చెప్పలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యుడు గోవిందరావు స్పష్టం చేశారు. కేంద్రం చట్టాన్ని గౌరవించాలి.

+ హామీలను నిలబెట్టుకోవాలి. రాష్ట్రాన్ని అహేతుకంగా విభజించారు కాబట్టి... హోదా అనేది ఒక హక్కు! హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిన బీజేపీ ఇప్పుడు ఎదురుదాడి చేయడం సరికాదు. కేంద్రం ఏపీని ఆదుకోవాల్సింది పోయి ఇప్పటికీ మాటలే చెబుతోంది.

+ బీజేపీ నేతలు హామీలు నెరవేర్చకుండా ఎదురుదాడి చేస్తున్నారు. సిమెంటు రోడ్లకు ‘మా డబ్బులు ఇచ్చాం’ అంటున్నారు. మా డబ్బులు, మీ డబ్బులు అని ఏవీ ఉండవని గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడి ప్రజలు పన్నులు కడితే 42 శాతం వాటా రాష్ట్రానికి ఇస్తారు. కేంద్రం 58 శాతం పెట్టుకుంటుంది. దక్షిణాది నుంచి వసూలయ్యే పన్నులే ఎక్కువ. కేంద్రం మాత్రం ఉత్తర భారతదేశంలో ఎక్కువ నిధులు ఖర్చు చేస్తోంది.

+ ఏపీలో జాతీయ రహదారులు వేస్తున్నామని కేంద్ర మంత్రి గడ్కరీ చెబుతున్నారు. కానీ... అవన్నీ పీపీపీ పద్ధతిలో వస్తున్నవేనని ఆయన ఎందుకు చెప్పరు? కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరితే వెక్కిరిస్తున్నారు. కాంగ్రెస్‌ చేసిన తప్పునే బీజేపీ కూడా చేస్తాననడం సరికాదు. విభజన చట్టంలోని లోపాల వల్ల ఎంతో నష్టపోతున్నాం. రాష్ట్రంలో ఉన్న పలు పరిశ్రమల నుంచి రావాల్సిన ఆదాయం కూడా తెలంగాణకు వెళ్తోంది. కృష్ణపట్నంపోర్టు వల్ల ఆదాయమూ కోల్పోతున్నాం.

+ కేంద్రం వల్లే 24 గంటల కరెంటు వస్తోందని బీజేపీ చెబుతోంది. దేశంలో విద్యుత్‌ సంస్కరణలు తెచ్చిందే ఏపీ. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ అమలు చేస్తున్న తొలిరాష్ట్రమూ ఏపీనే. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇస్తామన్నారు. అది ఏమైంది? ఇప్పుడు... ఏపీని బిహార్‌, యూపీలతో పోల్చుతున్నారు. ఇదేం పద్ధతి? రాష్ట్రానికి రూ.16,700 కోట్లు లోటుంటే రూ.4వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. లోటునూ వివాదం చేశారు. విశాఖ రైల్వేజోన్‌ ఎందుకు ఇవ్వడంలేదు? రిఫైనరీ - పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఊసే లేదు. జాతీయ విద్యాసంస్థలకు నాలుగేళ్లలో ఇచ్చింది రూ.400 కోట్లే. ప్రైవేట్‌ వ్యక్తులకు భూములిస్తే ఆరు నెలల్లో పనులు ప్రారంభించారు. కేంద్రం మాత్రం భూములిచ్చినా పనులు మొదలు పెట్టలేదు. చట్టంలో ఉన్నా అసెంబ్లీ సీట్లు పెంచడం లేదు. విజయవాడ - విశాఖ మెట్రోరైలు సాధ్యం కాదన్నారు. కడప ఉక్కు కర్మాగారాన్ని పట్టించుకోలేదు. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా కేంద్రం చేపడుతుందని చెప్పింది. ఇప్పటి వరకూ రూ.5349 కోట్లు ఇచ్చారు. చేసిన ఖర్చులన్నింటికీ యూసీలు ఇచ్చాం.