Begin typing your search above and press return to search.

బాబును వెంటాడుతున్న ఎన్ ఐఏ భ‌యం!

By:  Tupaki Desk   |   17 Jan 2019 7:29 AM GMT
బాబును వెంటాడుతున్న ఎన్ ఐఏ భ‌యం!
X
వైఎస్సార్ సీపీ అధ్య‌క్షుడు - ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్ పై విశాఖ విమానాశ్ర‌యంలో జ‌రిగిన హ‌త్యాయ‌త్నం కేసును జాతీయ ద‌ర్యాప్తు సంస్థ - ఎన్ ఐఏకు కేంద్ర‌ప్ర‌భుత్వం అప్ప‌గించడాన్ని సీఎం చంద్ర‌బాబునాయుడు మ‌రోసారి త‌ప్పుప‌ట్టారు. రాష్ట్ర హ‌క్కుల‌ను కేంద్రం లాక్కుంటోందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీకి ఎన్ ఐఏ రావ‌డానికి వీల్లేదని ఉద్ఘాటించారు.

చంద్ర‌బాబు త‌న స్వ‌గ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సోమ‌ - మంగ‌ళ‌వారాల్లో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి సంక్రాంతి ప‌ర్వ‌దినం సంబ‌రాలు జ‌రుపుకున్నారు. మంగ‌ళ‌వారం తిరిగి అమ‌రాతికి ప్ర‌యాణ‌మైన సంద‌ర్భంగా విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడారు. జ‌గ‌న్ పై దాడి కేసును కేంద్రం ఎన్ ఐఏకు అప్ప‌గించ‌డాన్ని విమ‌ర్శించారు. రాష్ట్రంలోకి ఎన్ ఐఏ రాకూడదన్నారు. రాష్ట్ర హక్కులను కేంద్రం లాక్కుంటోందని ఆరోపించారు. త‌మ హక్కుల కోసం పోరాడుతామన్నారు.

సినీ హీరో ప్ర‌భాస్ తో సంబంధ‌ముందంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల తెలంగాణ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డాన్ని కూడా చంద్ర‌బాబు త‌ప్పుప‌ట్టారు. ఆమెకు ఏపీ పోలీసుల‌పై న‌మ్మ‌కం లేదా అని ప్ర‌శ్నించారు. నాడు విశాఖ విమానాశ్ర‌యంలో దాడి జ‌రిగిన‌ప్పుడు కూడా జ‌గ‌న్ న‌గ‌రంలోని ఆస్ప‌త్రికి వెళ్ల‌కుండా హైద‌రాబాద్ వెళ్లి చికిత్స చేయించుకున్న సంగ‌తిని గుర్తుచేశారు. ఏపీ పోలీసుల ద‌ర్యాప్తుపై త‌న‌కు విశ్వాసం లేదంటూ జ‌గ‌న్ కూడా గ‌తంలో వ్యాఖ్యానించ‌డాన్ని చంద్రబాబు ప్ర‌స్తావించారు. సొంత రాష్ట్ర వైద్యులు - పోలీసుల‌పై ప్ర‌తిప‌క్ష నేత ఫ్యామిలీకి ఎందుకింద చిన్న‌చూపు అని ప్ర‌శ్నించారు.

నాలుగున్న‌రేళ్లుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ అన్ని రంగాల్లో అద్భుత ప్ర‌గ‌తి సాధించింద‌ని చంద్ర‌బాబు అన్నారు. ధ‌నిక రాష్ట్రమైన తెలంగాణ‌లో జ‌ర‌గ‌ని అభివృద్ధి కూడా ఇక్క‌డ చోటుచేసుకుంద‌న్నారు. ఏపీలో వందశాతం అభివృద్ధి చేశామని - సమస్యలన్నీ పరిష్కరించామని తెలిపారు. మిగిలి ఉన్నవి కేవ‌లం వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లేన‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కేసీఆర్‌ తో కలిసి ప్రత్యేక హోదా తీసుకొస్తామని వైఎస్‌ జగన్‌ చెబుతున్నారని - మరి ప్రధాని నరేంద్ర మోదీని హోదాపై ఆయ‌న ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. పొత్తుల‌పై విలేక‌ర్లు అడిగిన ప్ర‌శ్న‌కు చంద్ర‌బాబు స్పందిస్తూ.. ‘కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని విభజించిందని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. ఇప్పుడు బీజేపీ విభజన హామీలను అమలు చేయలేదు. అందుకే కాంగ్రెస్‌ తో కలిశాం’ అని స్పష్టం చేశారు.