Begin typing your search above and press return to search.

ఈ బుల్లెట్ మాటల్ని వదిలి పెట్టవా బాబు?

By:  Tupaki Desk   |   20 July 2016 4:59 AM GMT
ఈ బుల్లెట్ మాటల్ని వదిలి పెట్టవా బాబు?
X
కొన్ని మాటలు కొన్ని సందర్భాల్లో బాగుంటాయి. కానీ.. ఒకసారి పేలింది కదా? అని అదే మాటను అన్ని సందర్భాల్లో వాడటం ఏ మాత్రం బాగోదు. ఆ విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ప్రతిపక్ష నేత తీరుపై విమర్శలు చేస్తూ.. తనపై ఎన్ని కుట్రలు.. కుయుక్తులు చేసినా తాను వాటిని లెక్క చేయనని.. బుల్లెట్ లా దూసుకెతానంటూ గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్య పలువురిని ఆకట్టుకుంది. ఆయన లాంటి వ్యక్తి.. ఇలాంటి మాస్ డైలాగ్ చెప్పటం ఏమిటన్న ఆశ్చర్యం కావొచ్చు.. ఈ మాటకు ఆదరణ లభించింది.

అంతే.. అప్పటి నుంచి అవకాశం వచ్చిన ప్రతిసారీ.. ప్రతి వేదిక మీదా ‘బుల్లెట్ లా దూసుకెళతా’ అన్న మాటను వాడటం చంద్రబాబుకు ఒక అలవాటుగా మారింది. చివరకు ఈ బుల్లెట్ మాట ఎక్కడి వరకూ వచ్చిందనంటూ.. గోదావరి.. కృష్ణా నదుల సంగం వరకూ వెళ్లింది. తాము మంచి ఉద్దేశంతో ప్రాజెక్టుల్ని చేపట్టినా.. విపక్షాలు మాత్రం దుర్మార్గంగా వ్యవహరిస్తూ.. తమ పనుల్ని తప్పుపడుతున్నట్లుగా బాబు చెబుతున్నారు. ఈ సందర్భంగా విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. తాను మాత్రం బుల్లెట్ మాదిరి దూసుకెళతానని ఆయన స్పష్టం చేస్తున్నారు.

అయితే.. విపక్షాల విమర్శల మీద బుల్లెట్ లా దూసుకెళ్లే సమయంలోనే.. ఏపీ అధికారుల నిర్లక్ష్యం మీదనా.. వారి అలసత్వం మీదన.. వారి తొందరపాటుతో తెర మీదకు వస్తున్న సమస్యల మీదా.. అధికారపార్టీ నేతల్లో కొందరి అవినీతి మీదా కూడా బాబు బుల్లెట్ మాదిరి దూసుకుపోవాల్సిన అవసరం ఉంది. లేదంటే.. బాబు మాటలు బడాయి కోసమే అన్న ముద్ర ప్రజల మనసుల్లో పడే అవకాశం ఉంది. బాగా పేలిన డైలాగుల్ని కాస్త దాచి పెట్టి.. పొదుపుగా వాడితే బాగుంటుందన్నసూచనను చంద్రబాబుకు ఇచ్చే వారెవరు..?