Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల సంపాదనపై బాబు షాకింగ్ కామెంట్లు

By:  Tupaki Desk   |   12 Oct 2016 6:57 AM GMT
ఎమ్మెల్యేల సంపాదనపై బాబు షాకింగ్ కామెంట్లు
X
ఆచితూచి మాట్లాడుతారని పేరున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కాలంలో తరచూ నిజాలు మాట్లాడేస్తున్నారు. తాజాగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం వెలగపూడిలోని సీఎం చాంబర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజలకు ప్రభుత్వం చేసే సంక్షేమం గుర్తుండటం లేదన్నారు. అంతేకాదు... ఎమ్మెల్యేలు డబ్బులు సంపాదించడంలో పోటీ పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటుకు 500 ఇస్తున్నారని… తిరిగి సంపాదించుకునేందుకు ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారని చెప్పారు. ఇక విలువలెక్కడ ఉన్నాయని ప్రశ్నించారు.

వెలగపూడితో తన చాంబర్ ప్రారంభించిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు… కొన్ని పత్రికలను చూస్తే భయమేస్తోందన్నారు. మనసు పాడవతోందన్నారు. ఐదేళ్ల పాటు నెలకు 1000 రూపాయల పెన్షన్ ఇచ్చి - 5 కేజీల బియ్యమిచ్చి, ఎవరైనా చనిపోతే ఐదు లక్షలిచ్చి, ఊర్లలో నీరు లేకపోతే నీళ్లిచ్చి - కరెంటు లేకపోతే కరెంటిచ్చి - గ్యాస్ లేకపోతే గ్యాస్ ఇచ్చి... వాళ్లకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో అన్నీ పెట్టిన తరువాత - లాస్టులో 500 రూపాయలు ఇస్తే... అతను డబ్బిచ్చిన వాళ్లకే ఓటేస్తాడు. ఇదెక్కడి న్యాయం? ఆ ఐదొందలకు - వెయ్యికి... ఇప్పుడు ఎమ్మెల్యేల పోటీ. నా దగ్గర డబ్బులేదు కాబట్టి - రేపు ఎలక్షన్లలో పోటీ చేయాలి కాబట్టి - ఇప్పటి నుంచే డబ్బు దాచుకోవాలని ఎమ్మెల్యేలు చూస్తున్నారు. వేరీజ్ వాల్యూస్?" అని అన్నారు.

దేశంలో - రాష్ట్రంలో ఏ పార్టీకైనా సొంతంగా పేపర్లు ఉన్నాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. పత్రిక - టీవీ ఉన్నంత మాత్రాన అధికారంలోకి రావడం జరగదన్నారు. ఉదయం లేవగానే ప్రత్యర్థులను ఇరిటేట్ చేయడానికి పత్రికలు పనికొస్తాయన్నారు. నల్లధనం సంపాదించుకునే వారికి రాజకీయాలు అడ్డాగా మారాయన్నారు. రాయలసీమకు నీరిచ్చి కాపాడామన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. తనకు ఎలాంటి స్వార్థం లేదన్నారు. సమస్యలు సృష్టిస్తే అభివృద్ధి ఆగిపోతుందన్నారు. చైనాలోనూ వృద్ధి క్షీణిస్తోందన్నారు. డ్వాక్రా సంఘాలను ప్రారంభించింది తానేనని చెప్పారు చంద్రబాబు. అయితే ముఖ్యమంత్రే స్వయంగా ఎమ్మెల్యేలు సంపాదనలో పోటీ పడుతున్నారని చెప్పడం ఆశ్చర్యంగానే ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/