Begin typing your search above and press return to search.

తమ్ముళ్లలో క్రమశిక్షణ తగ్గిందన్న బాబు

By:  Tupaki Desk   |   20 Dec 2016 10:30 PM GMT
తమ్ముళ్లలో క్రమశిక్షణ తగ్గిందన్న బాబు
X
క్రమశిక్షణతో బుద్ధిగా ఉంటే తెలుగు తమ్ముళ్లు కట్టు తప్పతున్నారు. పవర్ ఉన్నప్పుడు.. దాన్ని మరింత పెరిగేలా చేసుకోవాల్సింది పోయి.. అధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్న వ్యవహారశైలి తెలుగు తమ్ముళ్ల మధ్య కొత్త పంచాయితీలకు తెర తీస్తోంది. గతంలో తమ మధ్య ఉండే రచ్చ అధినేత వద్దకు వెళితే ఇబ్బందన్న భావన ఈ మధ్య తగ్గిపోవటం పెరిగింది.

ఇప్పటితో పోలిస్తే.. పవర్ లో లేని పదేళ్లలో తెలుగు తమ్ముళ్ల మధ్యనున్న అంతర్గత విభేదాల్ని చక్కదిద్దటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారన్న మాట పెరుగుతోంది. రోజురోజుకి పెరుగుతున్న పంచాయితీలతో తమ్ముళ్లలో క్రమశిక్షణ తగ్గిపోతుందన్న విషయం పార్టీలో బాహాటంగానే చర్చ సాగుతోంది. ఇదెంత ఎక్కువగా ఉందన్న విషయాన్ని టీడీపీ అధినేత స్వయంగా చెప్పేయటం చూస్తే.. తమ్ముళ్ల తోక జాడింపు ఏ స్థాయిలో ఉందన్నది ఇట్టే అర్థమవుతుంది.

విజయవాడలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. తమ్ముళ్ల తీరుపై తనలోని అసంతృప్తిని అస్సలు దాచుకోలేదు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న పార్టీలో.. గతంతో పోలిస్తే ఇప్పుడు క్రమశిక్షణ కాస్త తగ్గిందన్న మాట ఆయన నోటి నుంచి రావటం గమనార్హం. పార్టీయే లేకపోతే ప్రభుత్వమే లేదని.. సవాళ్లను అధిగమిస్తూ ముందుకు వెళ్లటమే తప్పించి వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్న బాబు మాటల్లో ధీమా కనిపించినప్పటికీ.. పవర్ లో ఉన్నప్పుడే తమ్ముళ్లను కంట్రోల్ చేయలేకపోతున్న తీరుపై బాబు తనతో తాను ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.

క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ అన్న పేరు ప్రఖ్యాతులన్నీ తన హయాంలోనే కొడిగట్టటంపై బాబు అలెర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది.ఒకనాటి తన శిష్యుడి నేతృత్వంలోని టీఆర్ ఎస్ పార్టీని ఎంత కట్టుదిట్టంగా నడుపుతున్నారన్న విషయాన్ని బాబు చూస్తే మంచిది. టీడీపీలో మాదిరే టీఆర్ ఎస్ లోనూ పాత కొత్త నేతలు ఉండటం.. వారి మధ్యన అంతర్గత విభేదాలు ఉన్నప్పటికి అధినేత అంటే వణికిపోతున్న తీరు.. తన పార్టీలో ఎందుకు మిస్ అవుతుందన్న విషయంపై బాబు కాసింత ఫోకస్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే.. నిర్లక్ష్యం పుట్ట పగిలితే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని బాబు మర్చిపోకూడదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/