Begin typing your search above and press return to search.

ఉద్యోగులకు మద్దతుగా రంగంలోకి చంద్రబాబు.. జగన్ పై ఫైర్

By:  Tupaki Desk   |   3 Feb 2022 11:31 AM GMT
ఉద్యోగులకు మద్దతుగా రంగంలోకి చంద్రబాబు.. జగన్ పై ఫైర్
X
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఫైట్ ఉప్పెనలా సాగింది. పీఆర్సీ జీవోలు రద్దు చేయాలంటూ పీఆర్సీ సాధన సమితి చేపట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతమైంది.గురువారం రాష్ట్రం నలుమూలల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ జీతాలు పెంచాలని.. కొత్త పీఆర్సీని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు భారీగా తరలిరావడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి తమకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

ఇక ఉద్యోగుల పీఆర్సీ ఉద్యమానికి మద్దతుగా ప్రతిపక్ష నేత చంద్రబాబు రంగంలోకి దిగారు. ఈ మేరకు విజయవాడలో ఉద్యోగుల నిరసనలపై జగన్ ప్రభుత్వ నియంతృత్వ తీరును ఖండిస్తున్నట్టు ఆయన తెలిపారు.

ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్ట్ లు చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీప్రభుత్వం రివర్స్ పీఆర్సీని వెనక్కి తీసుకోవాలని.. నియంతృత్వం వీడి పరిష్కారం చూపాలని కోరారు.

లక్షల మంది సమస్యపై అహంకారంతో కాకుండా ఆలోచనతో స్పందించాలన్నారు. ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా? ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో భాగస్వాముు కాదా? అని చంద్రబాబు నిలదీశారు. రాజకీయ పక్షాలపై పెట్టినట్లు ఉద్యోగులపై గృహ నిర్బంధాలు సీఎం జగన్ వైఖరిని స్పష్టం చేస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు.

పోలీసు పహారా పెట్టి ఉపాధ్యాయులను నిర్బంధించడం..విద్యార్థుల ముందు టీచర్లను అవమానించడమేనన్నారు. మాయ మాటలతో ప్రజలను, ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్.. ఇప్పుడు అంకెల గారడీతో జీతాలు తగ్గించలేదని మళ్లీ మోసం చేస్తున్నారని చంద్రబాబు నిప్పులు చెరిగారు.

ఉద్యోగులను అగౌరపరిచే.. ఆత్మ గౌరవం దెబ్బతీసే విధానాన్ని జగన్ ఇప్పటికైనా వీడాలని విజ్ఞప్తి చేశారు. తాము రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తమ ప్రభుత్వం 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. సీఎం జగన్ మాదిరిగా ఐఆర్ కంటే తక్కువ ఫిట్ మెంట్ ఇచ్చి జీతాలు రికవరీ చేయడం దేశంలోనే ఇప్పటివరకూ జరగలేదని విమర్శించారు. ప్రభుత్వం భేషజాలు పక్కనపెట్టి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.