Begin typing your search above and press return to search.

బాబు కోణం; వైఎస్ విగ్రహాల్లో అహంకారమా?

By:  Tupaki Desk   |   15 April 2016 7:04 AM GMT
బాబు కోణం; వైఎస్ విగ్రహాల్లో అహంకారమా?
X
వైఎస్ ఆకస్మిక మరణం తెలుగుప్రజల్ని ఎంతగా కలిచివేసిందో అందరికి తెలిసిన విషయం. వైఎస్ ను వ్యక్తిగతంగా.. సైద్ధాంతికంగా వ్యతిరేకించే వారు సైతం ఆయన మరణంపై విలవిలలాడిపోయిన వారే. ఆయన మరణించిన తీరు తెలుగువారిని అంతలా కలిచివేసింది. ఆయన మరణం తర్వాత ప్రతి ఊరిలో వైఎస్ విగ్రహాల ఏర్పాటు మీద ఆయన కుమారుడు వ్యూహాత్మకంగా వ్యవహరించటాన్ని మర్చిపోకూడదు.

ఒకదశలో వైఎస్ ను విపరీతంగా ఆరాధించిన వారు సైతం.. విగ్రహాల పేరిట జగన్ చేసిన రాజకీయాన్ని విసుగు చెందేవారు. తన ఎదుగుదల కోసం విగ్రహాల పేరిట జగన్ నడిపిన రాజకీయంపై వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదిలా ఉంటే.. ప్రతి ఊరులో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాల్లో ఒక కొత్త కోణాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. అయితే ఆయన చేసిన విమర్శ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఉండటం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆయన ఆవిష్కరించిన కోణం కొత్తగా ఉండటంతో పాటు లాజిక్ కు దగ్గరగా ఉండటం గమనార్హం.

అంబేడ్కర్ 125 జయంతి ఉత్సవాల సందర్భంగా విగ్రహాల పేరుతో పరోక్ష విమర్శలు చేసిన బాబు.. ఓటు బ్యాంకు కోసం ఊరు..వాడా విగ్రహాలు పెట్టారని.. అయితే.. ఆ విగ్రహాల ఎత్తు అంబేడ్కర్ విగ్రహాల కంటే ఎక్కువ ఎత్తులో పెట్టారని.. వాటిని పెట్టించటం ద్వారా తమ అహంకారాన్ని చాటుకున్నారని విమర్శలు చేశారు. బాబు వ్యాఖ్యలు వినేందుకు బాగానే ఉన్నా.. లాజిక్ సరిపోయినట్లు కనిపించి ఉన్నా అదెంత మాత్రం నిజం కాదన్న అభిప్రాయం జగన్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా పెట్టే విగ్రహాలు భారీగా ఉండటం సహజమని.. కానీ.. సంబంధం లేని రెండు అంశాల్ని ప్రస్తావిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్న మాటను చెబుతున్నారు. ప్రత్యర్థుల్ని దెబ్బ తీయటమే రాజకీయమైనప్పుడు.. మాటలు మాత్రం భిన్నంగా ఉంటాయా ఏమిటి..?