Begin typing your search above and press return to search.

నంద్యాల విజ‌యానికి అంత సీన్ ఉందా?

By:  Tupaki Desk   |   18 Sept 2017 3:43 PM IST
నంద్యాల విజ‌యానికి అంత సీన్ ఉందా?
X
నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం త‌ర్వాత చంద్ర‌బాబులో ఉత్సాహం ఉర‌క‌లు వేస్తోంది. ఎక్క‌డికి వెళ్లినా, ఏ స‌మావేశంలో పాల్లొన్నా ప‌దే ప‌దే అదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. ముస్లింలు - ఎస్సీ - ఎస్టీల‌తో పాటు దాదాపు అన్నికులాలు టీడీపీ పాల‌న‌పై సంతృప్తిగా ఉన్నాయ‌ని, నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌య‌మే అందుకు నిద‌ర్శ‌నంగా ఆయ‌న‌ చెబుతున్నారు. అంత‌టితో ఆగ‌కుండా ఇంటింటికీ టీడీపీ కార్య‌క్ర‌మంలో త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలపై విరివిగా ప్ర‌చారం చేయాల‌ని పార్టీ శ్రేణుల‌కు ఆదేశాలిస్తున్నారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే 2019 ఎన్నిక‌ల్లోనూ వంద శాతం విజ‌యం త‌మ‌దే అన్న‌ట్లుగా తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు. ఈ ఊపును ఇలానే కొన‌సాగించాల‌ని, వ‌చ్చే ఏడాది అంటే 2018 చివ‌ర్లోనే ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని శ్రేణుల‌ను స‌మాయాత్తం చేస్తున్నారు.

నంద్యాల ఎన్నిక‌లు ప్ర‌త్యేక ప‌రిస్తితుల్లో జ‌రిగాయి. నియోజ‌క‌వ‌ర్గం నుంచి భూమా నాగిరెడ్డి వైఎస్సార్ సీపీ త‌ర‌ఫున గెలుపొంది ఆ త‌ర్వాత టీడీపీలో చేరారు. అనంత‌రం ఆయ‌న అక‌స్మాత్తుగా మ‌ర‌ణించ‌డంతో ఎన్నిక‌లు అనివార్య‌మ‌య్యాయి. టీడీపీ త‌ర‌ఫున భూమా నాగిరెడ్డి సోద‌రుడి కుమారుడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి బ‌రిలో నిల‌వ‌గా.. వైఎస్సార్ సీపీ త‌ర‌ఫున శిల్పా మోహ‌న్‌ రెడ్డి పోటీ చేశారు. నంద్యాల ఉప ఎన్నిక‌లంటేనే మొద‌ట టీడీపీ భ‌య‌ప‌డిపోయింది. ఈ విష‌యం ఆ పార్టీ అధినేత మాట‌ల‌తోనే స్ప‌ష్ట‌మ‌వుతోంది. నా పింఛ‌న్‌ లు తీసుకుంటూ.. నేను వేసిన రో్డ్ల‌పైనే న‌డుస్తూ.. నాకే ఓటు వేయ‌రా.. అని చంద్ర‌బాబు ఓట‌ర్ల‌ను బెదిరించారు. అంత‌టితో అగ‌కుండా నేను త‌లుచుకుంటే ఓటుకు రూ.5 వేల‌యినా ఇవ్వ‌గ‌ల‌న‌ని ఓట‌ర్ల‌ను మ‌భ్య‌పెట్టే ప్రయ‌త్నం కూడా చేశారు. దీన్నిబ‌ట్టి ఉప ఎన్నిక‌ల్లో ఓట‌రు నాడి టీడీపీకి వ్య‌తిరేకంగా ఉంద‌ని గ్ర‌హించి త‌ద‌నంత‌ర కార్య‌క‌లాపాలు చ‌క్క‌బెట్టాల్సిందిగా శ్రేణుల‌కు ఆదేశాలిచ్చార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ మేర‌కు పార్టీ ఎమ్మెల్యేలు - మంత్రులు - నాయ‌కులు - చివ‌రికి అధికారులు - పోలీసులు కూడా స్వామి కార్యానికి శ‌క్తివంచ‌న లేకుండా స‌హ‌క‌రించార‌న్న వాద‌న లేక‌పోలేదు.

ఈ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు స‌రికొత్త సంప్ర‌దాయానికి తెర‌లేపారు. ప్ర‌తి వంద మంది ఓట‌ర్ల‌కు ఒక అధికారిని ఇన్‌ చార్జిగా నియ‌మించారు. త‌మ ప‌రిధిలోని ఓట‌ర్ల అవ‌స‌రాలు.. వారు ఏపార్టీ వైపు మొగ్గుచూపుతున్నారో స‌ర్వే చేయ‌ల్సిందిగా జ‌నంలోకి వ‌దిలారు. అధికారుల‌తో పాటు టీడీపీ నేత‌లు కూడా స‌ర్వే పేరుతో ఓట‌ర్ల‌ను బెదిరిస్తూ హ‌ల్‌ చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే. స‌ర్వే అనంత‌రం ఇక పంప‌కాలు మొద‌ల‌య్యాయి. ఓటుకు రెండు వేల రూపాయ‌ల నుంచి ఏడు వేలు.. చివ‌రికి ప‌దివేల రూపాయ‌లు కూడా ఇచ్చారంటేనే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు ఈ ఎన్నిక‌ల విజ‌యం కోసం బాబు ఎంత తాప‌త్ర‌య‌ప‌డుతున్నారో... ఓడితే ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఎక్క‌డ బ‌హిర్గ‌త‌మ‌వుతుందోన‌ని భ‌య‌ప‌డి కోట్లు కుమ్మ‌రించి నంద్యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు.

రానున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో నంద్యాల విజ‌య‌మే మ‌ళ్లీ రిపీట్ అవుతంద‌ని.. వైఎస్సార్ సీపీకి ఒక్క సీటుకూడా రాద‌ని చంద్ర‌బాబు - ఆయ‌న కుమారుడు మంత్రి లోకేశ్ తెగ ప్ర‌చారం చేసుకుంటున్నారు. నంద్యాలలో జ‌రిగింది ఉప ఎన్నిక‌లు మాత్ర‌మే. అధికార బ‌లం - అంగ‌బ‌లం - అర్థ‌బ‌లం పుష్క‌లంగా అందుబాటులో ఉండే అధికార పార్టీ గెల‌వ‌డం పెద్ద విష‌య‌మేమీ కాదన్న‌ది విశ్లేష‌కుల వాద‌న‌. అయినా విజ‌యం కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డి.. కోట్ల‌ది రూపాయ‌ల‌తో ఓట్లు కొనుగోలు చేయాల్సి వ‌చ్చిందన్న వాద‌న కూడా వినిపించింది. కానీ రానున్న సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఇది సాధ్య‌మ‌య్యే ప‌నేనా..?. నంద్యాలలో మోహ‌రించిన‌ట్లు రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో అంగ‌ - అర్థ‌బ‌లాన్ని రంగంలోకి దింప‌డం సాధ్య‌మా!?

చంద్ర‌బాబు క‌దిలితే టీడీపీ సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని పార్టీశ్రేణుల‌కు చెబుతున్నారు. అస‌లు అధికారంలోకి వ‌చ్చాక టీడీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాలు ఏవి.. అని ప్ర‌శ్నిస్తే.. స‌మాధానం దొర‌క‌దన్న మాట ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. చంద్ర‌బాబు మాత్రం పింఛ‌న్‌ - ఎన్టీఆర్ వైద్య సేవ‌ - రేష‌న్ బియ్యం - చంద్ర‌న్న బీమా - రైతు - డ్వాక్రా రుణ‌మాఫీ గురించి చెబుతున్నారు. అవ‌న్నీ ఎప్ప‌టి నుంచో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాలే. ఆరోగ్య శ్రీ‌కి మాత్రం ఎన్టీఆర్ ఆరోగ్య‌ సేవ అని పేరు మార్చారు. చంద్ర‌న్న బీమా ప‌థ‌కం మాత్రం మ‌నం చ‌నిపోయాక అమ‌ల్లోకి వ‌స్తుంది. ఇక రైతు రుణ‌మాఫీకి ప్ర‌భుత్వం ఇవ్వాల‌నుకున్న నిధులు రుణానికి వ‌డ్డీ క‌ట్ట‌డానికి కూడా స‌రిపోవు. ఇక డ్వాక్రారుణ మాఫీ సంగ‌తి గాలికొదిలి పెట్టుబ‌డి నిధి పేరుతో బాబు ద‌గా చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా లేక‌పోలేదు. చంద్ర‌బాబును ఇన్ని వైఫ‌ల్యాలు వెంటాడుతుండ‌గా కోట్లు ఖ‌ర్చుపెట్టి గెలిచిన నంద్యాల‌ - కాకినాడ కార్పొరేష‌న్ విజ‌యాల‌ను ముందుపెట్టి వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌నూ ఇప్పుడే గెలిచేసినంత‌గా ప్ర‌చారం చేసుకోవ‌డం చూసి రాజ‌కీయ ప‌రిశీల‌కులు ముక్కున వేలేసుకుంటున్నారు.