Begin typing your search above and press return to search.

పోలవరం, రాజధాని.. తతిమ్మా గాలికొదిలేద్దాం!

By:  Tupaki Desk   |   18 Sep 2016 4:54 AM GMT
పోలవరం, రాజధాని.. తతిమ్మా గాలికొదిలేద్దాం!
X
చంద్రబాబునాయుడు ఇప్పుడు కొత్త స్ట్రాటజీని ఎత్తుకున్నారని అమరావతి రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రజల్లో తమ పార్టీ వెలుగులు క్రమంగా మసకబారిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ శ్రేణులు భయపడుతున్న వేళ.. చంద్రబాబునాయుడు.. తతిమ్మా ప్రభుత్వ విషయాలన్నీ గాలికొదిలేసి అయినా.. ఒక కొత్త వ్యూహం ద్వారా సర్కారు ఏదో చేసేస్తున్నదనే భావన ప్రజలకు కలిగించాలనేది వ్యూహంగా వారు ఎంచుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం రెండున్నరేళ్లలో ఏం సాధించింది.. ప్రజలకు ఏం చేసింది? అంటే చెప్పుకోవడానికి తమ వద్దే సమాచారం ఏమీ లేదనేది పార్టీ వర్గాల వాదన. ఈ విషయం ప్రజల్లో తమ పరువు పోయేలా చేస్తున్నదని పార్టీ వర్గాల్లో ఒక చర్చ చాలా కాలంగా నడుస్తున్నది. ప్రభుత్వం అన్ని వ్యవహారాల మీద దృష్టి పెడుతున్నప్పటికీ.. పెద్దగా పనులు చేపట్టడానికి తగిన నిధులు కూడా లేని నేపథ్యంలో ప్రజల దృష్టిలో పరువు పోవడం తప్ప మరేమీ దక్కడం లేదని పార్టీలోని జనం అనుకుంటున్నారు.

అయితే జనంలో తమ అచేతనత్వం వలన పరువుపోకుండా ఉండేందుకు చంద్రబాబునాయుడు ఓ విరుగుడు మందు కనుక్కున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమ ప్రభుత్వం ద్వారా ప్రజలకు ప్రోగ్రెస్‌ చూపించడం ఒక్కటే విరుగుడు అవుతుంది. ఆ మాటకొస్తే అన్ని రంగాల్లో ప్రోగ్రెస్‌ చూపించడం రాష్ట్ర ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సాధ్యం కాదు కాబట్టి.. కేవలం పోలవరం - అమరావతి రెండు అంశాల మీదనే దృష్టి పెట్టాలని చంద్రబాబు అనుకుంటున్నారట. ఎటూ ఈ రెండు అంశాలకు కేంద్రంనుంచి కొరత లేకుండా నిధులు వచ్చే అవకాశం ఉన్నందున.. వీలైనంత మేర ఈ పనుల మీదనే పూర్తి దృష్టి పెడుతూ.. వీటిలో ఒక అంగుళం ప్రోగ్రెస్‌ వచ్చినా సరే.. దాన్ని ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకువెళుతూ.. వారిని ఆ రెండింటి మాయలో ఉంచాలని.. రాష్ట్రంలోని తతిమ్మా వ్యవహారాల మీద వారి దృష్టి వెళ్లకుండా చూడాలని చంద్రబాబు అనుకుంటున్నారట.

ప్రతిసోమవారం, 'పోలవారం' అని ప్రకటించినట్లే... విజయదశమికి వెలగపూడిలో తాత్కాలిక సచివాలయంలోని తన కార్యాలయానికి వెళ్లిపోయిన తర్వాత.. ఇక చంద్రబాబునాయుడు అమరావతి నిర్మాణం మీదనే ఫోకస్‌ పెంచుతారని.. ఆరెండు విషయాల గురించి పదేపదే అంతా జరిగిపోతూ ఉన్నట్లుగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా ప్రభుత్వం కీర్తి చెడకుండా జాగ్రత్త పడతారని పార్టీ వర్గాలే అంటున్నాయి.