Begin typing your search above and press return to search.

సైకిల్‌ రిపేర్‌ కు సై అంటున్న చంద్రబాబు!

By:  Tupaki Desk   |   14 Aug 2016 11:30 AM GMT
సైకిల్‌ రిపేర్‌ కు సై అంటున్న చంద్రబాబు!
X
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఆ పార్టీ అధినేత‌ చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల తరువాత పార్టీ నుండి పెద్ద ఎత్తున అధికార టీఆర్ ఎస్‌ లోకి వలసలు కొనసాగినప్పటికి చాలా నియోజకవర్గాలలో సీనియర్ నేతలతో పాటు క్యాడర్ కూడ పార్టీ వెంటే ఉన్నారని భావిస్తున్న ఆయన వచ్చే ఎన్నికల నాటికి పార్టీని తిరిగి నిలబెట్టాలని భావిస్తున్నారు.ఈ క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీలు - అధికార ప్ర‌తినిధుల నియామ‌కం చేప‌ట్టారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో టీఆర్ ఎస్‌ ను ఎదుర్కొనే సత్తా టీడీపీ నేతలకే ఉందని పసుపు దండు అంచనా వేస్తుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలు చేయడంలో విఫలమవుతుంది. పైగా పార్టీలో తీవ్ర విభేదాలు ఉండడంతో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రభుత్వం విద్యుత్ - ఆర్టిసి టికెట్‌ ల ధరలు పెంచిన నేపథ్యంలో టీడీపీ నేతలు చేసిన ఆందోళనలు ఆ పార్టీకి మంచి మైలేజిని సంపాదించి పెట్టాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు కనీసం పోరాడే సాహసం చేయక పోవడం టీడీపీకి సానుకూలంగా మారింది. రాష్ట్రంలో టీఆర్ ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతం కావడంతో టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని సగానికి పైగా నియోజక వర్గాలలో పార్టీకి ఇంఛార్జీలు లేకుండా పోయారు. దీంతో పార్టీని నమ్ముకుని పని చేస్తున్న క్యాడర్ అంతా చెల్లాచెదురు అయ్యారు. తిరిగి వారందరిని పార్టీ నీడ కిందకు తీసుకురావాలని నేతలు నిర్ణయించారు. బడుగు బలహీన వర్గాల ఎజెండాతో టీడీపీ నిలబడిందని గుర్తుచేసుకున్న నేతలు ఆ వర్గాలకు చెందిన నేతలకు నియోజకవర్గ ఇంఛార్జీలుగా అవకాశమివ్వాలనే యోచనతో ఉన్నారని సమాచారం. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలకు జిల్లా ఇంఛార్జీల బాధ్యతలు అప్పగించిన బాబు స్థానిక నేతలను ఇంఛార్జీలుగా నియమించి వారికి షెడ్యూలు అప్పగించాలని భావిస్తున్నట్టు సమాచారం. వారికి కావాల్సిన ఖర్చులతో పాటు సామాగ్రిని కూడ పార్టీ పెద్దలే అందించనున్నారు. దీంతో కాస్తో కూస్తో ప్రజా బలంఉన్న వారికి బాధ్యతలు అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలోను పార్టీ బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని దాదాపు 15 నియోజకవర్గాలలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓటర్లు గెలుపు ఓటమలును శాసించే స్థాయిలో ఉన్నారు. వారి సహయం తీసుకుంటూ ముందుకు పోవాలని చంద్రబాబు వ్యూహలు రచిస్తున్నారు. టీడీపీని లేకుండా చేయాలని కలలు కంటున్న టీఆర్ ఎస్ నేతలకు షాక్ ఇచ్చే విదంగా కార్యాచరణ ఉండాలని చంద్రబాబు ఉద్బోదిస్తున్నారు. తాను ఏపీ సీఎంగా ఉండడంతో ఎక్కువ సమయం ఆ రాష్ట్ర ప్రజల కోసం కేటాయిస్తానంటున్న ఆయన నెలలో ఒక్కరోజు తెలంగాణలో పార్టీని కాపాడేందుకు ప్రయత్నిస్తానని హమీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీని ఇన్నాళ్లు నడిపించిన యువనేత లోకేష్‌ ను ఆంధ్రప్రదేశ్‌ కు పరిమితంచేసి తెలంగాణకు చెందిన నాయకులకు పూర్తి స్థాయి లో బాధ్యతలు అప్పగించాలన్నది చంద్రబాబు ఆలోచన అని పార్టీ నేతలు అంటున్నారు. టీడీపీ అధినేత సీరియస్ గా ఉండడంతో నేతలు కూడ ఉత్సాహంతో ముందుకు కదిలే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.