Begin typing your search above and press return to search.

పోల‌వ‌రానికి రూ.39వేల కోట్లు కావాల‌న్న బాబు

By:  Tupaki Desk   |   19 Sep 2017 11:30 AM GMT
పోల‌వ‌రానికి రూ.39వేల కోట్లు కావాల‌న్న బాబు
X
త‌న‌కు మాలిన ధ‌ర్మం ఏ మాత్రం మంచిది కాద‌న్న విష‌యాన్ని బాబు అదే ప‌నిగా మ‌ర్చిపోతుంటారు. విభ‌జ‌న నేప‌థ్యంలో పోల‌వ‌రం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించ‌ట‌మే కాదు.. దాన్ని పూర్తి చేసే బాధ్య‌త‌ను కేంద్రం త‌న భుజాన వేసుకుంది. అయితే.. త‌గదున‌మ్మా అంటూ పోల‌వ‌రం ప్రాజెక్టును తాము క‌ట్టేస్తామంటూ క‌ట్టే బాధ్య‌త‌ను అడిగి మ‌రీ తీసుకున్నారు చంద్ర‌బాబు.

కేంద్రంలో కూర్చున్నది ఏ వాజ్ పేయ్ అయితే ఓకే. కానీ.. అక్క‌డున్న‌ది న‌రేంద్ర‌మోడీ. ఇవ్వాల్సిన రూపాయి ఇచ్చేందుకే చుక్క‌లు చూపించే మోడీ తీరుకు.. రూపాయిని పావ‌లా మాదిరి ఖ‌ర్చుచేసే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు లెక్క‌లు తేల‌టం అంత తేలికైన ప‌ని కాదు. అదే జ‌రిగితే.. పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన ఏదో ఒక భారం ఏపీ మీద ప‌డ‌టం ఖాయం.

పెద్ద‌న్న లాంటి కేంద్రంతో పెట్టుకోవ‌టం లేనిపోని చికాకులే. అయిన‌ప్ప‌టికీ పోల‌వ‌రం నిర్మాణ బాధ్య‌త‌లు చేప‌ట్టిన బాబు 2019 ఎన్నిక‌ల నాటికి ఎట్టిప‌రిస్థితుల్లో పూర్తి చేయాల‌న్న ల‌క్ష్యంతో ఉన్నారు. ఆయ‌న ప్ర‌తి సోమ‌వారం రివ్యూ చేసినప్ప‌టికీ ప‌నులు వేగంగా న‌డ‌వ‌ని ప‌రిస్థితి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప్రాజెక్టును అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేయ‌టం అంత తేలికైన ప‌ని కాదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మ‌రో కొత్త స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేయ‌టానికి మ‌రో రూ.39వేల కోట్లు అవుస‌ర‌మ‌వుతాయ‌న్న‌ది బాబు లెక్క‌. ఇప్ప‌టివ‌ర‌కూ నిర్వాసితుల‌కు ప‌రిహారాన్ని అంద‌జేసిన‌ట్లు చెప్పిన బాబు.. పోల‌వ‌రం స్పిల్ వే.. కాంక్రీట్ వ‌ర్క్‌.. మ‌ట్టి ప‌నుల కోసం నిర్దిష్ట ప్ర‌ణాళిక‌ను రూపొందించాల‌ని.. డ‌యా ఫ్రం వాల్.. కాఫ‌ర్ డ్యాం.. ప్ర‌ధాన డ్యాం ప‌నుల‌కు సంబంధించి వేర్వేరుప్లాన్లు సిద్ధం చేయాల‌ని కోరుతున్నారు. ఇప్ప‌టిదాకా 70 శాతం మ‌ట్టి ప‌నులు పూర్తి అయ్యాయ‌ని.. త్వ‌ర‌లోనే పవ‌ర్ హౌస్ నిర్మాణానికి టెండ‌ర్లు పిలుస్తామ‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. అనుకున్న‌ట్లే 2019 నాటికి పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు పూర్తి అవుతాయా? అంటే కాద‌నే మాటే బ‌లంగా వినిపిస్తోంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ 2019 నాటికి ప్రాజెక్టు ప‌నుల్ని పూర్తి చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో బాబు ఉన్న‌ప్ప‌టికీ నిధుల కొర‌త ఇబ్బంది పెట్టే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. సాపేక్షంగా చూస్తే.. బాబు మాట‌ల ప్ర‌కార‌మే ఇంకా రూ.39వేల కోట్లు అవ‌స‌రం ప్రాజెక్టుకు ఉంది. నిధుల ల‌భ్య‌త సంగ‌తిని కాసేపు ప‌క్క‌న పెట్టినా 15 నెల‌ల వ్య‌వ‌ధిలో ఇంత భారీ మొత్తాన్ని ఖ‌ర్చు చేయ‌టం ప్రాక్టిక‌ల్ గా సాధ్య‌మేనా? అంటే కాద‌నే మాట బ‌లంగా వినిపిస్తోంది.

చంద్ర‌బాబు ప్ర‌తి సోమ‌వారం రివ్యూ చేసినంత‌నే ప్రాజెక్టు పూర్తి కాదంటున్నారు. దేశంలోనే అతి పెద్ద‌దైన‌..క్లిష్ట‌మైన స‌ర్దార్ స‌రోవ‌ర్ డ్యామ్ (న‌ర్మ‌ద న‌ది మీద నిర్మించింది) ను పూర్తి చేయ‌టానికి దాదాపుగా మూడు ద‌శాబ్దాల స‌మ‌యం ప‌ట్టింది. ఈ లెక్క‌న పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తికి మ‌రో ప‌దేళ్లు ప‌ట్టినా ఆశ్చ‌ర్యం లేద‌న్న మాట వినిపిస్తోంది. బాబు అనుకున్న సమ‌యానికి ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాద‌న్న విష‌యాన్ని మ‌రో లెక్క‌లో కూడా చెప్పొచ్చు. అదేమంటే.. ఇప్ప‌టివ‌ర‌కూ ప్రాజెక్టుకు ఖ‌ర్చు చేసింది రూ.13వేల కోట్లు. ఇప్పుడు మ‌రో రూ.39వేల కోట్లు కావాలి. ఇంత భారీ మొత్తాన్ని తీసుకురావ‌టం ఒక ఎత్తు అయితే.. దాన్ని ఖ‌ర్చు చేయ‌టం అంత తేలికైన ముచ్చ‌ట కాద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. మారిన ప్రాజెక్టు అంచ‌నాల‌పై కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న‌ది కూడా ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.