Begin typing your search above and press return to search.

2019లో పులివెందుల టీడీపీదే

By:  Tupaki Desk   |   8 July 2016 11:57 AM GMT
2019లో పులివెందుల టీడీపీదే
X
ఇప్ప‌టికే టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కి క‌రెంటు షాక్ కొట్టిన కాకిలా కొట్టుకుంటున్న వైకాపా అధినేత జ‌గ‌న్‌ కు మ‌రింత గ‌ట్టి షాక్ ఇచ్చేందుకు సీఎం చంద్ర‌బాబు సిద్ధ‌మైన‌ట్టుగా క‌నిపిస్తోంది. రానున్న 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఇలాకా పులివెందుల‌లోనే టీడీపీ జెండా రెప‌రెప‌లాడించాల‌ని సీఎం చంద్ర‌బాబు ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకున్నారు. కొడితే కుంభ‌స్థ‌లాన్నే కొట్టాల‌న్న‌ట్టుగా ఉంది సీఎం ఆలోచ‌న‌. ఇదే జ‌రిగితే జ‌గ‌న్‌ కు చంద్ర‌బాబు దిమ్మ‌తిరిగేలా చేశార‌నే చెప్పొచ్చు.

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. పులివెందుల‌లో సైకిల్ స‌వారీ చేయాల‌ని చెప్పారు. దీనిపై ఆయ‌న క‌స‌ర‌త్తు కూడా చేయ‌డం గ‌మ‌నార్హం. పులివెందుల‌లో టీడీపీ హ‌వా ఎంతుంద‌నే విష‌యంపై సీఎం స‌మ‌గ్రంగా ఓ స‌ర్వే చేయించారు. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను ఆయ‌న ఈ స‌మావేశంలో వెల్ల‌డించారు. పులివెందులలో అరవై శాతం మంది వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు, ముప్పై శాతం మంది టీడీపీకి అనుకూలంగా ఉన్నారని, వచ్చే 2019 ఎన్నికల నాటికి అక్కడ కూడా టీడీపీ జెండా ఎగిరేలా కార్యక్రమం రూపొందించాలని ఈ స‌మావేశంలో బాబు అన్నారని సమాచారం.

ఇదే గ‌నుక జ‌రిగి.. పులివెందుల‌లో టీడీపీ జెండా ఎగిరితే రాష్ట్ర రాజ‌కీయాల్లో సుదీర్ఘంగా కొన‌సాగుతూ వ‌స్తున్న ఓ చ‌రిత్ర‌కు చంద్ర‌బాబు ముగింపు ప‌లికిన‌ట్టే. వైఎస్ ఉన్న‌ప్ప‌టి నుంచి ఈ నియోజ‌క‌వ‌ర్గం ఆయ‌న‌కు, ఆయ‌న కుటుంబానికే నీరాజ‌నం ప‌లుకుతోంది. ఇప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పాగా వేయాల‌ని భావిస్తున్న సీఎం ఆదిశ‌గా స‌ఫ‌లీకృతులైతే.. వైఎస్‌, ఆయ‌న కుటుంబ చ‌రిత్ర నిజంగానే పుస్త‌కాల్లో క‌లిసిపోవ‌డం ఖాయం. ఇక వైకాపా అధినేత జ‌గ‌న్‌ కు జీవితంలో రాజ‌కీయంగా అది స‌మాధే అవుతుంది.