Begin typing your search above and press return to search.

కొణతాల డైలామా.. ఆనంద్ కే అనకాపల్లి

By:  Tupaki Desk   |   11 March 2019 6:20 AM GMT
కొణతాల డైలామా.. ఆనంద్ కే అనకాపల్లి
X
అనకాపల్లి తెలుగుదేశం పార్టీ ఎంపీ టికెట్ ఖాయమైంది. అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా విశాఖ డెయిరీ చైర్మన్ అడారి తులసీరావు కుమారుడు ఆనంద్ ను టీడీపీ ఖాయం చేసింది. కొద్దిరోజులుగా సీనియర్ నేత కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరితే అనకాపల్లి టికెట్ ఇస్తామని టీడీపీ అధినేత బాబు యోచిస్తున్నారు. కానీ ఆయన డైలామాలో ఉండిపోవడం.. టీడీపీ తలుపు తట్టకపోవడంతో ఇక చేసేందేం లేక చంద్రబాబు అనకాపల్లి టికెట్ కు ఆనంద్ ను ఖాయం చేశారు.

తాజాగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థి విషయంలో సమీక్ష జరిపిన చంద్రబాబుకు ఆ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా ఆనంద్ పేరునే ప్రతిపాదించడంతో టీడీపీ అధిష్టానం కూడా సరేనంది. ఒకవేళ కొణతాల రామకృష్ణ నోరువిప్పి టీడీపీలోకి వస్తే ఆయనకు అనకాపల్లి అసెంబ్లీ స్థానం ఇచ్చేందుకు చంద్రబాబు ఆ స్థానాన్ని ఖాళీగా పెట్టారు.

మరోవైపు కొణతాల ఈ ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన చేయడం లేదని సమాచారం. రాజ్యసభకు నామినేటెడ్ అభ్యర్థిగా వెళ్లాలని ఈమేరకు బాబుకు ప్రతిపాదన పెట్టి చేరాలని యోచిస్తున్నాడట..

కొణతాల వస్తే మాత్రం అనకాపల్లి అసెంబ్లీ టికెట్ ఇచ్చి అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద్ ను పక్కనపెట్టాలని చంద్రబాబు దాదాపు నిర్ణయానికి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీలా గోవింద్ పై అసమ్మతి.. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టు రిపోర్టు రావడంతో బాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఇక అనకపాల్లి పార్లమెంట్ పరిధిలోని పెందుర్తి - నర్సీపట్నం - ఎలమంచిలి అసెంబ్లీ సీట్లను కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు సత్యానారాయణమూర్తి - అయ్యన్నపాత్రుడు - రమేశ్ బాబులకే చంద్రబాబు కేటాయించారు.

పాయకరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే అనితపై వ్యతిరేకత ఉండడంతో ఇక్కడ చెంగల వెంకటరావు కుమార్తె విజయలక్ష్మి పేరును పరీశీలిస్తున్నారు. చోడవరం లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజుపై ఫిర్యాదులు వచ్చాయి.. కాపునేతకు అక్కడ అవకాశం ఇస్తారట.. మాడుగుల టికెట్ పై పోటీ నెలకొంది. పార్టీ మాడుగుల ఇన్ చార్జి రామానాయుడితోపాటు ప్రసాద్ రావు - ముత్యాల నాయుడు - పీఎస్ నాయుడు టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ సబ్బం హరి పేరును టీడీపీ పరిశీలిస్తోంది. ఈ మూడు స్థానాలపై ఈరోజు అమరావతిలో బాబు మూడు గంటలకు సమీక్ష నిర్వహిస్తున్నారు.రెండు రోజుల్లోనే తొలి జాబితాకు బాబు సిద్ధం చేస్తున్నారు.

ఇక విశాఖ ఎంపీ సీటు విషయంలోనూ బాబు సమాలోచనలు చేస్తున్నారు. విశాఖ జిల్లాలోని అనకాపల్లి సీటును బీసీలకు కేటాయించడంతో విశాఖ ఎంపీ సీటును కాపు సామాజికవర్గానికి ఇవ్వాలని బాబు ప్లాన్ చేస్తున్నారు. అయితే నారాలోకేష్ విశాఖ లేదా భీమిలి నుంచి పోటీచేస్తారని వార్తలొస్తున్నాయి. దీంతో మంత్రి గంటాను విశాఖ ఎంపీగా పంపాలా? అసెంబ్లీకి పంపాలా అన్నది పార్టీ అధిష్టానం ఆలోచిస్తోందట.. నారాలోకేష్ విశాఖ నార్త్ లేదా భీమిలి ఎంచుకుంటే గంటాను లోక్ సభకు పంపుతారట.. లేదంటే భీమిలి లేదా నార్త్ నుంచి గంటాను అసెంబ్లీ బరిలో దించుతారనే చర్చ సాగుతోంది. ఈ పీఠముడి రెండు మూడు రోజుల్లోనే తీలనుంది.