Begin typing your search above and press return to search.

నెల్లూరు టీడీపీ లిస్ట్ ఇదే!..అంద‌రికీ షాకింగేన‌ట‌!

By:  Tupaki Desk   |   9 Feb 2019 12:02 PM GMT
నెల్లూరు టీడీపీ లిస్ట్ ఇదే!..అంద‌రికీ షాకింగేన‌ట‌!
X
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కూడా గ‌డువు స‌మీపిస్తున్న తీరుణంలో ఏపీలో రాజ‌కీయ వేడి ఒక్క‌సారిగా హీటెక్కింద‌నే చెప్పాలి. అధికార పార్టీ టీడీపీతో పాటు విప‌క్ష వైసీపీ త‌మ అభ్య‌ర్థుల ఖ‌రారుపై క‌స‌ర‌త్తులు చేస్తున్నాయి. విప‌క్షం ప‌రిస్థితి ఎలా ఉన్నా... అధికార ప‌క్షం మాత్రం ఈ ఎన్నిక‌లను చావోరేవో అన్న‌ట్లుగా భావిస్తోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారం నిల‌బెట్టుకోవాల్సిందేన‌న్న భావ‌న‌తో ఇప్ప‌టికే భేటీల మీద భేటీలు నిర్వ‌హిస్తున్న టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఇప్పుడు ఎన్నిక‌ల‌కు చాలా ముందుగానే అభ్య‌ర్థ‌ల‌ను ఖ‌రారు చేసే కార్య‌క్ర‌మానికి తెర తీశారు. అయితే ఈ క‌స‌రత్తుపై సొంత పార్టీ నేత‌లే పెద‌వి విరుస్తున్న ప‌రిస్థితి కొట్టొచ్చిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఈ త‌ర‌హా ప‌రిస్థితి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో బాగానే బ‌య‌ట‌ప‌డిపోయింది. అస‌లు ఆయా నియోజ‌క‌వ‌ర్గాలు త‌మ‌వేన‌న్న ధీమాతో కొంద‌రు నేత‌లు ఇప్ప‌టికే తాము కోరుకున్న స్ధానాల్లో ప్ర‌చారం మొద‌లెట్టేసుకున్నారు.

అయితే వీరు, వీరి ప్ర‌చారంతో పాటు ఏమాత్రం ప‌ట్టించుకోకుండా చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణ‌యాల కార‌ణంగా అస‌లుకే ఎస‌రు వ‌స్తోంద‌న్న వాద‌న కూడా బాగానే వినిపిస్తోంది. వ‌రుస‌గా జిల్లాల స‌మీక్ష‌లు చేస్తున్న చంద్ర‌బాబు... నెల్లూరు జిల్లాకు సంబందించి చేసిన క‌స‌ర‌త్తులో కొంద‌రు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేశారు. బాబు ప్ర‌క‌టించిన జాబితాలో నెల్లూరు ఎంపీ టికెట్ ను బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి - నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి - కావలి నుంచి బీద మస్తాన్ రావు - సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి - ఆత్మకూరు నుంచి బొల్లినేని కృష్ణయ్యల‌ను ఖ‌రారు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ జాబితాలోని నేత‌లు ఒక స్థానం ఆశిస్తే.. ఆ స్థానం కాకుండా మ‌రో స్థానం ల‌భించింద‌ట‌. తొలుత వైసీపీ నుంచి టీడీపీలో చేరిన బొమ్మిరెడ్డి ప‌రిస్థితి చూస్తే చాలా చిత్రంగానే అనిపిస్తోంది. ఆత్మకూరు నుంచి పోటీ చేయాలనేది రాఘవేంద్రరెడ్డి కోరిక. వైసీపీలో ఆ టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతోనే ఆయన టీడీపీలో చేరారు. అయితే ఆత్మకూరును బొల్లినేని కృష్ణయ్యకు కేటాయించాలని డిసైడ్ చేసిన చంద్రబాబు... రాఘవేంద్ర రెడ్డిని నెల్లూరు ఎంపీగా పోటీచేయించాలని డిసైడ్ చేశారట.

అయితే కీల‌క‌మైన‌ నెల్లూరు ఎంపీ టికెట్ విషయంలో టీడీపీలో నువ్వా, నేనా అనే ప‌రిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీచేయాలని ఆదాలకు సోమిరెడ్డి గ‌తంలోనే సూచించారు. అయితే ఎంపీగా పోటీ చేసేంత స్థాయిలో తాము సంపాదించ‌లేద‌ని, అక్క‌డ పోటీ చేయాలంటే.. సోమిరెడ్డే క‌రెక్ట్ అని ఆదాల కూడా త‌న‌దైన శైలిలో స్పందించారు. అయితే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా వీరిద్ద‌రినీ వేరే సీట్ల‌కు కేటాయించేసిన చంద్ర‌బాబు... చివరకు రాఘవేంద్ర రెడ్డి వంటి చోటా నేతనే ఎంపీ బరిలోకి దించేందుకు నిర్ణ‌యించారు. మొత్తంగా నెల్లూరు ఎంపీ సీటుతో పాటు ఇప్పుడు ఖ‌రారైన జాబితాలోని ఏ ఒక్క నేత కూడా చంద్ర‌బాబు నిర్ణ‌యంతో అంత‌గా సంతృప్తిగా లేర‌ని స‌మాచారం. కోరి కోరి ఓడే చోటు కేటాయిస్తే ఎలాగంటూ... వీరంతా బాబు నిర్ణ‌యంపై మింగ‌లేక క‌క్క‌లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ట‌.