Begin typing your search above and press return to search.

డిప్యూటీ సీఎంకు ప‌రాభ‌వం..బాబు మార్క్ ముగింపు

By:  Tupaki Desk   |   30 Dec 2017 2:34 AM GMT
డిప్యూటీ సీఎంకు ప‌రాభ‌వం..బాబు మార్క్ ముగింపు
X
ఆయన ఈ రాష్ట్రానికి హోం మంత్రి. పైగా ఉప ముఖ్యమంత్రి కూడా. అన్నింటికీ మించి పోలీసు బాసు. పోలీసు శాఖకు సంబంధించిన ఫొరెన్సిక్ ల్యాబ్‌ కు శంకుస్థాపన జరుగుతుంటే ఆయనకు అందిన మర్యాద అంతంతమాత్రం. పోలీసు ఉన్నతాధికారులు కూడా తమ బాసుకు మర్యాద ఇవ్వకుండా - సీఎంకే సలాము కొట్టి అత్యుత్సాహం ప్రదర్శించడంతో మనస్తాపం చెందిన ఆయన రాజీనామాకు సిద్ధపడిన వైనం మీడియాలో క‌ల‌క‌లం రేకెత్తించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌నే ఏపీ ఉప ముఖ్య‌మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌.

తుళ్లూరులో ఫొరెన్సిక్ ల్యాబ్ కేంద్రానికి శంకుస్థాపన జరగడం..దానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరుకాగా - పోలీసు ఉన్నతాధికారులూ వచ్చారు. ఈ కార్యక్రమం ముందుగానే ఖరారయింది. అయితే, సంబంధిత హోం శాఖ మంత్రి - ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్పకు మాత్రం ప్రభుత్వ శాఖ లేదా డీజీపీ కార్యాలయం నుంచి కాకుండా - ఒక సాధారణ కానిస్టేబుల్ ద్వారా పోలీసు శాఖ నుంచి ఆహ్వానం అందడంపై ఆయన మనస్తాపం చెందారు. ఈ విషయం న్యూస్ చానెళ్లలో ప్రముఖంగా రావడం చర్చనీయాంశమయింది. సహజంగా సాత్వికుడు - వివాదరహితుడు - అజాతశత్రువుగా పేరున్న రాజప్ప ఈ విషయంలో జరిగిన అగౌరవం - అమర్యాదకు నొచ్చుకున్నారు. దానితో అక్కడికి వెళ్లకుండా తిరుపతికి వెళ్లిపోవడం ద్వారా ప్రభుత్వానికి తన నిరసన సంకేతం పంపించారు.

అయితే..ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను బుజ్జగించేందుకు సీఎం స్వయంగా రంగంలోకి దిగారు. ఫోరెన్సిక్ ల్యాబ్ శంకుస్థాపనకు ఆయనకు ఆహ్వానం అందని విషయంపై సీఎం ఆరా తీశారు. చినరాజప్పకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇకపై ఇలాంటివి జరక్కుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అధికారుల పట్ల మెతక వైఖరి ఉండొద్దని సలహా ఇచ్చారు. ఏ అధికారి మాట వినకపోయినా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. మీ శాఖలో మీరే సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని రాజప్పను ముఖ్యమంత్రి ఆదేశించారు . మీ శాఖ కార్యక్రమానికి మీరే సీఎంను పిలవాలని - అలిగితే ఎలాగని రాజప్పకు సర్దిచెప్పారు. ఈ నేపథ్యంలో ఆహ్వానం విషయంలో జరిగిన పరిణామాల్ని సీఎంకు వివరించారు.

మ‌రోవైపు ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గాంధీ ఈ విషయంలో జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పారు. త‌ను ఉద్దేశ‌పూర్వ‌కంగా ఇలా చేయ‌లేద‌ని పేర్కొంటూ...ఉప ముఖ్య‌మంత్రి, హోంమంత్రి మ‌న‌సు నొప్పించినందుకు చింతిస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. కాగా, ఈ ఎపిసోడ్ కంటే ముందు తనకు జరిగిన అవమానానికి మనస్తాపం చెందిన ఆయన తన పదవికి రాజీనామా చేయడానికీ డిప్యూటీ సీఎం సిద్ధపడినట్లు సమాచారం. తన కింద పనిచేసే వారే తనకు విలువ ఇవ్వనప్పుడు తాను ఆ పదవిలో ఉండటం అనవసరమని ఆయన స్వయంగా ముఖ్యమంత్రికే స్పష్టం చేయగా - సీఎం చంద్రబాబు ఆయనను వారించి తాను పోలీసులతో మాట్లాడతానని నచ్చచెప్పారు. అయినప్పటికీ, రాజప్ప తిరుపతికి వెళ్లిపోయారు.