Begin typing your search above and press return to search.

తండ్రీకొడుకుల ఎఫెక్ట్... విపక్ష నేతగా బాబు రికార్డు

By:  Tupaki Desk   |   29 May 2019 4:02 PM GMT
తండ్రీకొడుకుల ఎఫెక్ట్... విపక్ష నేతగా బాబు రికార్డు
X
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు... రికార్డుల మీద రికార్డులు కొట్టేస్తున్నారు. ఇప్పటికే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తనదైన శైలిలో రాణిస్తున్న చంద్రబాబు... సీఎంగా ఏకంగా 14 ఏళ్ల పాటు రికార్డు సృష్టించిన చంద్రబాబు... ఇప్పుడు కొత్తగా విపక్ష నేతగా అంతకంటే మెరుగైన రికార్డునే నమోదు చేయనున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభం పాలు కాగా... చంద్రబాబు విపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఈ ఐదేళ్ల పాటు చంద్రబాబు విపక్ష నేతగా కొనసాగితే... 15 ఏళ్ల పాటు విపక్ష నేతగా కొనసాగిన అరుదైన రికార్డును చంద్రబాబు నమోదు చేయనున్నారు. సీఎంగా 14 ఏళ్లు - విపక్ష నేతగా 15 ఏళ్ల పాటు కొనసాగిన నేతగా చంద్రబాబు అరుదైన రికార్డు నెలకొల్పిన వైనంలో ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది.

అదేంటంటే... విపక్ష నేత హోదాలోకి మారిన చంద్రబాబు... వైఎస్ ఫ్యామిలీ ఎఫెక్ట్ కారణంగా విపక్షంలోకి మారిపోయారు. 2004లో అప్పటిదాకా 9 ఏళ్ల పాటు సీఎంగా కొనసాగిన చంద్రబాబు.. మరోమారు సీఎంగా కొనసాగేందుకు ముందస్తు ఎన్నికలకు వెళితే... దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో ఒక్కసారిగా విపక్ష నేతగా మారిపోయారు. 2009లో అయినా గెలవాలన్న కాంక్షతో పలు పార్టీలను కలుపుకుని పోటీ చేసినా... వైఎస్ ను ఓడించలేక మరో ఐదేళ్ల పాటు ఆయన విపక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోగా... 113 జిల్లాలతో ఏర్పాటైన నవ్యాంధ్రకు చంద్రబాబు మరోమారు సీఎం అయ్యారు. అయితే ఇక్కడ కూడా వరుసగా రెండో పర్యాయం సీఎం కుర్చీలో కూర్చుందామని ప్లాన్ వేసిన చంద్రబాబు... వైఎస్ తనయుడు - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభంజనంలో కొట్టుకుపోయారు. వెరసి మరోమారు విపక్ష నేతగా మారిపోక తప్పలేదు.

అంటే... తొలుత విపక్ష నేతగా మారేందుకు కారణమైన వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్ చేతిలో ముచ్చటగా మూడో పర్యాయం విపక్ష నేతగా మారిపోక తప్పలేదు. అంటే వైఎస్ రాజశేఖరరెడ్డి - వైఎస్ జగన్... తండ్రీకొడుకుల చేతిలోనే చంద్రబాబు విపక్ష నేతగా కూర్చోవాల్సి వచ్చిందన్న మాట. ఇదిలా ఉంటే... సీఎంగా చంద్రబాబు కంటే చాలా మంది నేతలు అత్యధిక కాలం కొనసాగిన నేతలు దేశంలో చాలా మందే ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం చెందకుండా ఉండి ఉంటే... ఏకంగా వరుసగా పదేళ్ల పాటు సీఎంగా కొనసాగి చంద్రబాబు సీఎం రికార్డును బద్దలు కొట్టేవారు. అయితే ఈ టెర్మ్ తో విపక్ష నేతగా చంద్రబాబు పేరిట నమోదయ్యే విపక్ష నేత రికార్డును మాత్రం వేరే వాళ్లు బద్దలు కొట్టే అవకాశాలు కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. మొత్తంగా సీఎంగా కంటే కూడా విపక్ష నేతగానే చంద్రబాబు చెరగని రికార్డును నెలకొల్పుతున్నారన్న మాట.