Begin typing your search above and press return to search.

ఒలింపిక్సు అథ్లెట్లు ఫెయిల్.. బాబు సక్సెస్

By:  Tupaki Desk   |   12 Aug 2016 7:32 AM GMT
ఒలింపిక్సు అథ్లెట్లు ఫెయిల్.. బాబు సక్సెస్
X
ప్రపంచమంతా ఒలింపిక్ ఫీవర్ తో ఊగిపోతున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాల ఫీవర్ మొదలైంది. కృష్ణానది పుష్కరాలకు జనం పోటెత్తుతున్నారు. ఒలింపిక్సులో మన భారతీయ అథ్లెట్లు ఒక్కరొక్కరుగా బ్యాగులు సర్దుకుని వచ్చేస్తుండడంతో పతకాలపై ఆశ పూర్తిగా పోయింది.. కానీ, పుష్కరాల్లో మాత్రం పొలిటికల్ అథ్లెట్లు అదరగొట్టేస్తున్నారు. అదరగొట్టడమంటే మామూలుగా కాదు. రికార్డులు బద్ధలు గొట్టేస్తున్నారు. అవును... కృష్ణా పుష్కరాల వేళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు - దేవాదాయ శాఖ మంత్రి పైడికొండలరావులిద్దరూ రికార్డులు బ్రేక్ చేశారు. అవేంటో చూద్దామా మరి..

ఏడాది వ్యవధిలో రెండు పుష్కరాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. గోదావరి - కృష్ణా పుష్కరాలు రెండింటినీ ప్రారంభించిన ముఖ్యమంత్రిగా ఆయన కాసు బ్రహ్మానందరెడ్డి రికార్డును సమయం చేశారు. 1967 - 68 సంవత్సరాల్లో ఈ అవకాశం అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి దక్కగా, మళ్లీ మూడు పుష్కరాల అనంతరం ఈ అవకాశం చంద్రబాబుకు దక్కింది.

దేశంలోని 12 నదులకు ప్రతి 12 ఏళ్లకోసారి పుష్కరాలు వస్తాయి. అందులో రాష్ట్రంలో ప్రవహిస్తున్న గోదావరి - కృష్ణా నదులకు పుష్కరాలు ఏడాది వ్యవధిలో వస్తుంటాయి. ఏ నదికీ లేని విధంగా గోదావరి నదికి పుష్కరాలు పూర్తయిన ఏడాదికి అంత్య పుష్కరాలువస్తాయి. అవి ముగిసిన వెంటనే కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతాయి.

- భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొట్టమొదటిసారిగా 1955లో గోదావరి పుష్కరాలు వచ్చాయి. అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నారు.

- మరుసటి సంవత్సరం 1956లో కృష్ణా పుష్కరాల నాటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడి డాక్టర్ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు.

- 1967వ సంవత్సరంలో వచ్చిన గోదావరి పుష్కరాలకు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1968లో వచ్చిన కృష్ణా పుష్కరాలకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రెండు పుష్కరాలను ప్రారంభించిన తొలి ముఖ్యమంత్రిగా బ్రహ్మానందరెడ్డి రికార్డు సృష్టించారు.

- తాజాగా 2015 గోదావరి మహా పుష్కరాలను ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రారంభించారు. శుక్రవారం నుండి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలను కూడా చంద్రబాబు ప్రారంభించారు. అంటే కాసు బ్రహ్మానందరెడ్డి తర్వాత ఇలా రెండు పుష్కరాలను ప్రారంభించే అరుదైన ఘనత చంద్రబాబు సొంతమైంది. కాగా రెండుసార్లు గోదావరి పుష్కరాలను ప్రారంభించిన ఏకైక ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇప్పటికే రికార్డు సృష్టించారు.

మరోవైపు దేవాదాయ మంత్రి మాణిక్యాల రావు కూడా రికార్డులకెక్కారు. రెండు పుష్కరాలను చూసిన తొలి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా ప్రస్తుత మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. 2015 నాటి గోదావరి పుష్కరాలకు దేవాదాయ - ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న పైడికొండల మాణిక్యాలరావే శుక్రవారం నుండి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలకూ దేవాదాయ - ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇంతవరకు తెలుగు నేలపై ఏ మంత్రికీ ఆ ఛాన్సు రాలేదు.