Begin typing your search above and press return to search.

అన్నిటికీ అక్టోబరు 3 ముహూర్తం

By:  Tupaki Desk   |   17 Sep 2016 4:50 AM GMT
అన్నిటికీ అక్టోబరు 3 ముహూర్తం
X
సొంతింటి నుంచి పాలనను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న ఏపీ సర్కారు.. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేస్తోంది. విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని (పాలనా పరంగా మాత్రమే)గా హైదరాబాద్ మహానగరం ఉంది. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా వినియోగించుకునే వీలున్నప్పటికీ.. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం అందుకు సిద్దంగా లేరు. వీలైనంత త్వరగా హైదరాబాద్ నుంచి బయటకు వచ్చేసి.. ఏపీ నుంచే తమ పాలనను నిర్వహించాలని తపిస్తున్నారు. ఇందులో భాగంగానే యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించారు. అసెంబ్లీని నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధమైన ఏపీ సచివాలయానికి హైదరాబాద్ నుంచి వివిధ శాఖల్ని తరలించారు. ఇంకా.. తరలించాల్సిన శాఖలున్నాయి.

ఇదిలా ఉంటే.. వచ్చే నెల (అక్టోబరు) 3 నుంచి ఏపీ రాజధాని అమరావతిలోని ఏపీ సచివాలయం నుంచి పూర్తి స్థాయి పాలనను షురూ చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది. ఇందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా ఎస్పీఎఫ్ భద్రతను తాత్కాలిక సచివాలయానికి పెట్టారు. 90 మంది సిబ్బందితో వెలగపూడికి చేరుకొని వారు ఆయుధ పూజ నిర్వహించారు.

ఇప్పటికీ వెలగపూడికి పూర్తిగా తరలివెళ్లని పలు శాఖలు ఇప్పుడా పనిని పూర్తి చేసే పనిలో పడ్డాయి. దసరాకు ముందే వచ్చే నెల 3 నుంచి వెలగపూడి సచివాలయం నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలన్న ఆలోచనలో సీఎం ఉన్నారు. ఇప్పటివరకూ పాలనాపరంగా భవనాల్ని ఏర్పాటు చేయటం.. కార్యాలయాల్ని హైదరాబాద్ నుంచి వెలగపూడికి మార్చటం పైన దృష్టి పెట్టిన ప్రభుత్వం.. తాజాగా వెలగపూడికి వచ్చిన ఉద్యోగుల సంక్షేమం మీద దృష్టి పెట్టింది.

తాత్కాలిక సచివాలయంలో ఉద్యోగుల వసతులు - సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ఇందుకోసం బ్యాంకులు.. రిక్రియేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇకపై సచివాలయంలోకి అడుగుపెట్టే ప్రతిఒక్కరి వివరాల్ని సేకరించి.. వారు ఎవరినైతే కలవాలని భావిస్తున్నారో.. వారిని సంప్రదించి.. ఓకే అన్న తర్వాతే లోపలికి అనుమతించాలని నిర్ణయించారు. ఇక.. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం కూడా వచ్చే నెల 3 నుంచి స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే మరో రెండు వారాల్లో ఏపీ పాలనకు వెలగపూడి కేరాఫ్ అడ్రస్ గా మారనుంది.