Begin typing your search above and press return to search.

బాబు వాళ్ల‌కు వాటా ఇస్తున్నారా?

By:  Tupaki Desk   |   28 Sep 2015 9:29 AM GMT
బాబు వాళ్ల‌కు వాటా ఇస్తున్నారా?
X
ఏపీ రాజ‌ధాని అమ‌రావతి కోసం 33వేల ఎక‌రాల్ని స‌మీక‌రిస్తున్న ఏపీ స‌ర్కారు.. అంత భూమిని ఏం చేయ‌నుంది? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌. దీనికి స‌రైన స‌మాధానం రాక ముందే.. అమ‌రావ‌తి మాస్ట‌ర్‌ ప్లాన్ ఇచ్చిన సింగ‌పూర్ కు ఎలాంటి ల‌బ్థి చేకూర‌నుంద‌న్న సందేహాలు తెర‌పైకి వ‌చ్చాయి. దీనికి సైతం స‌మాధానం రాని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య‌న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట్లాడుతూ.. తాము వ్యాపారం చేసి సంపాదిస్తామ‌న్న వ్యాఖ్య చేశారు. ఆర్థిక‌లోటు ఉన్న రాష్ట్రం నిధుల స‌మీక‌ర‌ణ ఎలా చేప‌డుతుంది? రాజ‌ధాని నిర్మాణం కోసం అవ‌స‌ర‌మైన నిధుల్ని ఏ విధంగా సేక‌రిస్తార‌న్న ప్ర‌శ్న‌ల‌కు బాబు నోట బిజినెస్ మాట రావ‌టంతో.. స‌ద‌రు బిజినెస్ ఏమిట‌న్న‌ది ఆస‌క్తి రేకెత్తించింది. తాజాగా దీనికి సంబంధించిన వాద‌న ఒక‌టి షురూ అయ్యింది.

దీని ప్ర‌కారం.. ఏబాబు చేసే బిజినెస్ లో పార్ట‌న‌ర్ గా సింగ‌పూర్ దేశాన్ని చేరుస్తార‌ని చెబుతున్నారు. సింగ‌పూర్ ప్ర‌భుత్వంతో చేసే బిజినెస్ కోస‌మే ప్ర‌త్యేకంగా ఒక కార్పొరేష‌న్ ను ఏర్పాటు చేస్తున్నారు. పార్ట‌న‌ర్‌ షిప్ గురించి ఇంత‌వ‌ర‌కూ ప్ర‌స్తావించ‌ని చంద్ర‌బాబు.. కార్పొరేష‌న్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు చెప్ప‌టం తెలిసిందే.

అమ‌రావ‌తి అభివృద్ధి కార్పొరేష‌న్ పేరిట ఏర్పాటు చేసే ఈ సంస్థ‌లో ఏపీ స‌ర్కారుతో పాటు.. సింగ‌పూర్ దేశానికి వాటా ఇస్తార‌ని చెబుతున్నారు. స‌ద‌రు కార్పొరేష‌న్ లో సింగ‌పూర్ ప్ర‌భుత్వ కంపెనీలు పెట్టుబ‌డులు పెడ‌తాయి. ఇందుకుగాను ఈ సంస్థ‌ల‌కు మూడు వేల ఎక‌రాల భూమిని అప్ప‌గిస్తారు. దాన్ని అభివృద్ధి చేసి.. ప‌రిశ్ర‌మ‌ల‌కు కేటాయించ‌టం ద్వారా వ‌చ్చే లాభాల్లో ఏపీ.. సింగ‌పూర్ దేశాలు పంచుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. మ‌రి..స‌ద‌రు సింగ‌పూర్ సంస్థ‌లు అభివృద్ధి చేసే ప్రాంతాల్లో ఎలాంటి కంపెనీలు ఏర్పాటు చేస్తార‌న్న‌ది ఒక ప్ర‌శ్న‌.

ఇప్ప‌టికే భూముల్ని పెద్ద ఎత్తున సేక‌రించ‌టంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్న ప‌రిస్థితి. ఇలాంటి నేప‌థ్యంలో.. సింగ‌పూర్ ప్ర‌భుత్వానికి వాటా ఇచ్చి చేసే వ్యాపారం బాబు స‌ర్కారుకు భారంగా మారుతుందా? లేక‌.. లాభాలు తీసుకుస్తుందో చూడాలి. బాబు చేద్దామనుకుంటున్న బిజినెస్ బాబు స‌ర్కారును ఏ ద‌రికి చేరుస్తుందో చూడాలి.