Begin typing your search above and press return to search.

అమరావతి నిర్మాణంలో అన్నీ తప్పుటడుగులేనా?

By:  Tupaki Desk   |   11 Sep 2016 7:10 AM GMT
అమరావతి నిర్మాణంలో అన్నీ తప్పుటడుగులేనా?
X
చంద్రబాబునాయుడు ఏ లగ్నాన అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారో గానీ అప్పటినుంచి అన్నీ అపశృతులే దొర్లుతున్నాయి. చంద్రబాబునాయుడు ఒకసారి శంకుస్థాపన చేసిన తర్వాత.. మళ్లీ శంకుస్థాపన చేయించడం శాస్త్ర సమ్మతం కాదని చాలా మంది ఘోషిస్తున్నా.. మోదీ తో మళ్లీ చేయించారు. అక్కడికి ఆయననేదో ప్రసన్నం చేసుకుంటారని అనుకున్నారు గానీ.. ఆయన మన నెత్తిన మట్టికొట్టిపోయారు.

తీరా స్విస్‌ చాలెంజ్‌ పద్ధతిలో నిర్మాణాలు చేయిస్తా అన్నారు. అయితే స్విస్‌ చాలెంజ్‌ అనే పద్దతి మొత్తం అత్యంత లోపభూయిష్టంగా - వివాదాస్పదంగా ఉన్నట్లు తేలుతోంది. ఎందుకంటే.. స్విస్‌ చాలెంజ్‌ లో అంతా రహస్యంగా కుట్రపూరితంగా టెండర్లు పిలిచారంటూ ఇప్పటికే కోర్టు కేసులు నడుస్తున్నాయి. కోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత.. నిబంధనలు మార్చారు గానీ.. మళ్లీ కోర్టు కేసులు అలాగే ఉన్నాయి. స్విస్‌ చాలెంజ్‌ వ్యవహారమే సందేహాస్పదంగా తయారైంది.

ఇప్పుడు భవనాల డిజైన్ల వ్యవహారం వచ్చింది. మన దేశంలోని ఆర్కిటెక్ట్‌ లకు అసలేమీ పని చేతకాదని, జపాన్‌ వాళ్లయితే యిరగదీస్తారని అంటూ.. చంద్రబాబునాయుడు కోర్‌ కేపిటల్‌ భవనాల రూపకల్పనను జపాన్‌ కంపెనీకి అప్పగించారు. వారు అత్యంత నికృష్టమైన అపభ్రంశపు డిజైన్లు ఇచ్చారు. తీరా వాటిని ఇప్పుడు వదిలించుకుంటున్నారట. రేటు తగ్గించుకుంటాం అని జపాన్‌ కంపెనీ మెట్టు దిగివచ్చినా కూడా.. అసలు మీరు వద్దనే వద్దంటూ కొత్తగా మన ముంబాయికి చెందిన హఫీజ్‌ కాంట్రాక్టర్‌ - అలాగే లండన్‌ లోని మరో ఆర్కిటెక్ట్‌ కు డిజైన్లు అప్పగించాలని చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి అమరావతి నిర్మాణం విషయంలో చంద్రబాబునాయుడు సర్కారు తొలినుంచి తీసుకుంటున్నవన్నీ.. అవకతవకల నిర్ణయాలే అని నెమ్మదిగా తేలుతున్నాయి.