Begin typing your search above and press return to search.

ఢిల్లీ టూర్ తో ఏం సాధిస్తారు సార్?

By:  Tupaki Desk   |   1 April 2018 7:25 AM GMT
ఢిల్లీ టూర్ తో ఏం సాధిస్తారు సార్?
X
ప్రత్యేకహోదా పేరుతో చంద్రబాబునాయుడు కొన్ని నెలలుగా నడిపిస్తున్న నాటకాలలో ఇప్పుడు సరికొత్త ఎపిసోడ్ కు శ్రీకారం చుడుతున్నట్లుగా ఉన్నదనే విమర్శలు ప్రజల్లో చాలా బలంగా వినిపిస్తున్నాయి. మొన్న మొన్నటి దాకా ఎంపీల ఉద్యమాలు, మంత్రుల రాజీనామాలు ఇలాంటి ప్రహసనాల్ని నడిపిస్తూ.. అఖిలపక్షం పేరుతో దారుణంగా పరువు పోగొట్టుకున్న చంద్రబాబునాయుడు.. ఆ మాటను వదిలేసి.. తానొక్కడే ఢిల్లీ వెళ్లి.. అక్కడ భాజపాను వ్యతిరేకించే అన్ని పార్టీల కీలక నాయకులతో భేటీ అయి.. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం వారికి వివరిస్తానని అంటున్నారు. ఇంతకూ అన్ని భాజపాయేతర పార్టీలకు ఆంధ్రప్రదేశ్ గోడును వినిపించడం ద్వారా.. ఏం సాధించాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారో కనీసం ఆయనకైనా క్లారిటీ ఉందా? అని ప్రజలు సందేహిస్తున్నారు. పైగా పార్లమెంటు సమావేశాలు ముగిసిపోతున్న గడువుతేదీకి ఒక్కరోజు ముందుగా ఢిల్లీ వెళ్లి ఇలాంటి ప్రయత్నం చేయడం అనేది.. కామెడీ ఎపిసోడ్ లాగా ఉన్నదనే విమర్శలు కూడా వినవస్తున్నాయి.

ఆ కోణంలోంచి చూసినప్పుడు.. చంద్రబాబునాయుడు ఇన్నాళ్లు సాగించిన.. 29 టూర్లు ఒక రకం.. ఇప్పుడు సాగిస్తున్న టూర్ మరో రకం! ఎందుకంటే.. గత 29 టూర్లను ఆయన అధికార పార్టీ నాయకులను మంత్రులను కలిసి వారికి శాలువాలు కప్పి ప్రసాదాలు అందజేసి.. వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలతోనే గడిచిపోయాయి. అయినా ఆయన సాధించింది... అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఈ 30వ టూర్ లో అధికారంలో లేని అన్ని పార్టీల కాళ్లు పట్టుకుని... వారిని బతిమాలి సాధిస్తా అని ఆయన అంటున్నారు. ఇలాంటి ఇలా ఇతర పార్టీలను కలవడం వల్ల కూడా.. రాష్ట్రానికి ఇప్పటికిప్పుడు జరిగే ప్రయోజనం.. విభజన చట్టం పరంగా జరిగే న్యాయం ఇసుమంతైనా ఉండదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

మహా అయితే.. రాష్ట్రం కోసం చంద్రబాబునాయుడు చాలా కష్టపడిపోతున్నట్లు.. దేశంలోని అన్ని పార్టీల నాయకులను కలిసి మద్దతు కూడగడుతున్నట్లు ఒక బిల్డప్ ఇచ్చుకోవడానికి మాత్రం ఇది ఉపకరిస్తుంది. అలాంటి బిల్డప్ వలన రాష్ట్రానికి ఏం ఒరుగుతుంది. అధికారంలో ఉన్న వారినుంచే రాష్ట్రానికి ఏమీ సాధించలేకపోయిన చంద్రబాబు... అధికారంలోలేని వారిని కలిసి ఏం సాధించగలరు? అని పలువురు దెప్పిపొడుస్తున్నారు. చంద్రబాబు కనీసం ఇలాంటి ప్రయత్నాన్ని పార్లమెంటు రెండో సెషన్ మొదలైన తొలిరోజుల్లో చేసి ఉండినా.. ఎంతో కొంత సభలో పోరాటానికి దన్నుగా ఉండేదని.. పార్లమెంటు ముగిసిపోతున్న తరుణంలో చేయడం వలన.. గత జల సేతుబంధనం అన్న సామెత చందంగా.. ఇది వృథా ప్రయత్నం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చాక.. ఎన్ని , ఎలాంటి కబుర్లు చెప్తారో చూడాలి.