Begin typing your search above and press return to search.

ఢిల్లీలో బాబు ర‌క్తి క‌ట్టించేశారు!

By:  Tupaki Desk   |   3 April 2018 11:12 AM GMT
ఢిల్లీలో బాబు ర‌క్తి క‌ట్టించేశారు!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌నపై నాలుగేళ్ల పాటు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రించిన టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... మొన్న‌టి కేంద్ర బ‌డ్జెట్ తర్వాత ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసుకున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసి ప్ర‌జ‌ల ముందుకు వెళ్లిన చంద్ర‌బాబు... విభ‌జ‌న‌తో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి న్యాయం జ‌ర‌గాలంటే టీడీపీ, బీజేపీ కూట‌మికి ఓటేయాలంటూ త‌న‌దైన శైలిలో ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. స‌రే ఎలాగూ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది క‌దా... బాబుకు ఓటేస్తే రాష్ట్రానికి అంత‌కంటే ఏం కావాల‌న్న రీతిలో ప్ర‌జ‌లు కూడా ఆ ఎన్నిక‌ల్లో బాబుకు ఓటేశారు. అదికారం క‌ట్ట‌బెట్టారు. ఆ త‌ర్వాత సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన చంద్ర‌బాబు... తొలి ఏడాది మొత్తం చాలా నిర్లిప్తంగా పాలన సాగించార‌న్న విమ‌ర్శ‌లు వినిపించాయి. అయితే ఆ త‌ర్వాత చాలా కాలానికి నిద్ర లేచిన‌ట్లుగా ప్ర‌త్యేక హోదా ఫైలు ప‌ట్టుకుని వెళ్లిన చంద్ర‌బాబుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బిగ్ షాకిచ్చార‌నే చెప్పాలి. 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పిన మోదీ... దేశంలో ఇక‌పై ఏ ఒక్క రాష్ట్రానికి కూడా ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని, ప్ర‌త్యేక హోదా స్థానంలో ప్ర‌త్యేక ప్యాకేజీకి అంగీక‌రిస్తే... హోదా కంటే కూడా మ‌రింత మెరుగైన ల‌బ్ధి చేకూరుస్తామ‌ని చెప్పారు. దీనిపై రాష్ట్రంలోని విప‌క్షాల‌తో పాటు త‌న‌కు ఓట్లేసి గెలిపించిన ప్ర‌జ‌ల‌కు సింగిల్ మాట కూడా చెప్ప‌కుండానే ప్ర‌త్యేక హోదా ఫైలును అక్క‌డే గాల్లోకి విసిరేసిన చంద్ర‌బాబు... ప్ర‌త్యేక ప్యాకేజీ మంత్రాన్ని ప‌ఠించ‌డం మొద‌లెట్టారు.

ఈ క్ర‌మంలో ఎవ‌రైనా ప్ర‌త్యేక హోదా అంటే జైల్లో పెట్టేస్తామ‌ని కూడా చంద్ర‌బాబు వార్నింగులిచ్చిన వైనం మ‌న‌కు తెలియ‌ననిదేమీ కాదు. ఇక ఆ త‌ర్వాత ప్ర‌త్యేక ప్యాకేజీ నిబంధన‌లు రూపొందిస్తున్నామంటూ మాయ‌మాట‌లు చెప్పిన కేంద్రం మూడేళ్ల కాలాన్ని గ‌డిపేసింది. అయితే కేంద్రం కుయుక్తులు అర్థ‌మ‌వుతున్నా కూడా అర్థం కాన‌ట్టే న‌టించేసిన చంద్ర‌బాబు... మొత్తంగా నాలుగేళ్ల పాటు ప్ర‌త్యేక హోదాను ప‌క్క‌న‌పెట్టేశార‌నే రాష్ట్ర ప్ర‌జ‌లు భావిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఏడాదిన్న‌ర పాటు త‌న‌ను క‌లిసేందుకు ఢిల్లీకి వచ్చిన చంద్ర‌బాబుకు మోదీ క‌నీసం అపాయింట్ మెంటు కూడా ఇవ్వ‌లేదు. అయినా దాదాపుగా 29 సార్లు ఢిల్లీ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేసిన చంద్ర‌బాబు... రాష్ట్రానికి కేంద్రం నుంచి సింగిల్ పైసాను కూడా తీసుకురాలేక‌పోయార‌న్న విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. ఈ క్ర‌మంలో మొన్న‌టి కేంద్ర బ‌డ్జెట్ లో మోదీ స‌ర్కారు ఏపీ మాట‌ను ప్రస్తావించ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌క‌పోయిన వైనం ఏపీ ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు గురి చేసింద‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో అప్ప‌టిదాకా ప్ర‌త్యేక హోదా వ‌ద్దు... ప్ర‌త్యేక ప్యాకేజీ ముద్దు అంటూ చిలుక ప‌లుకులు ప‌లికిన చంద్ర‌బాబు అనివార్యంగా యూట‌ర్న్ తీసుకోక త‌ప్ప‌లేదన్న వాద‌న వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌రో మూడు రోజుల్లో పార్ల‌మెంటు స‌మావేశాలు ముగుస్తాయ‌న‌గా... చివ‌రి నిమిషంలో త‌మ‌కు జ‌రిగిన అన్యాయం తెలిసివ‌చ్చింద‌న్న కోణంలో క‌ల‌రింగ్ ఇచ్చిన చంద్ర‌బాబు నేటి ఉద‌యం ఢిల్లీలో ల్యాండ‌య్యారు.

ఫ్లైట్ దిగంగానే నేరుగా పార్ల‌మెంటుకు వెళ్లిన చంద్ర‌బాబుకు త‌న పార్టీ ఎంపీల నుంచి గ్రాండ్ వెల్ క‌మ్ ల‌భించిన‌ట్లుగానే క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇక అప్ప‌టికే ర‌చించుకున్న వ్యూహంలో భాగంగానే చంద్ర‌బాబు తొలుత పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లోని మ‌హాత్మా గాంధీ పాదాల‌కు న‌మ‌స్క‌రించి పార్ల‌మెంటు భ‌వ‌నం మెట్ల వ‌ద్ద‌కు చేరుకున్నారు. అక్క‌డ పార్టీ ఎంపీలంతా వ‌రుస‌గా నిల‌బ‌డ‌గా... అక్క‌డే కింద‌కు వంగిన చంద్ర‌బాబు పార్ల‌మెంటు మెట్ల‌కు మొక్కారు. ఈ సంద‌ర్భంగా ముంద‌స్తుగానే నిర్దేశించుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం మీడియా కెమెరాలు క్లిక్ మ‌న‌గానే చంద్ర‌బాబు మెట్ల‌కు దండాన్ని ముగించారు. ఈ క్ర‌మంలో అక్క‌డ క‌నిపించిన దృశ్యాల‌ను కాస్తంత నిశితంగా ప‌రిశీలించిన వారెవ‌రికైనా... చంద్ర‌బాబు నాట‌కాన్ని బాగానే ర‌క్తి క‌ట్టించార‌ని ఇట్టే అర్థం కాక మాన‌ద‌న్న‌ వాద‌న వినిపిస్తోంది. పార్ల‌మెంటు భ‌వ‌నం మెట్ల‌కు న‌మ‌స్కారం చేసేందుకు చంద్ర‌బాబు ఒంగ‌డం, మీడియా కెమెరాలు క్లిక్ మ‌న‌గానే కాస్తంత లేచిన‌ట్లుగా క‌నిపించిన చంద్ర‌బాబు మ‌రోమారు మెట్ల‌పై పూర్తి స్థాయిలో త‌న హ‌స్తాలు తాకేలా న‌మ‌స్క‌రించి... రికార్డింగ్ ముగిసిన‌ట్టే క‌దా అన్న‌ట్లుగా చంద్ర‌బాబు చూసిన ఓ చూపు నిజంగానే ఆసక్తిక‌రంగా ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది.