Begin typing your search above and press return to search.

కోడెల మృతిపై సీబీఐ విచార‌ణ‌కు చంద్ర‌బాబు డిమాండ్‌..!

By:  Tupaki Desk   |   17 Sep 2019 8:27 AM GMT
కోడెల మృతిపై సీబీఐ విచార‌ణ‌కు చంద్ర‌బాబు డిమాండ్‌..!
X
ప్ర‌భుత్వ వేధింపుల‌తోనే ఏపీ మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు మృతి చెందార‌ని ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కోడెల మృతిపై వెంట‌నే సీబీఐ విచార‌ణ జ‌రిపిస్తే అస‌లు నిజాలు బ‌య‌టికి వ‌స్తాయ‌ని - ప్ర‌భుత్వం వెంట‌నే సీబీఐచే విచార‌ణ జ‌రిపించాల‌ని బాబు డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం కేసుల పేరుతో వేధింపుల‌కు గురిచేయ‌డంతో కోడెల చ‌నిపోయార‌ని - ఇలాంటి ఆత్మ‌హ‌త్య జ‌రగ‌టం దేశ చ‌రిత్ర‌లోనే ఇదే మొద‌టిద‌ని చంద్ర‌బాబు అన్నారు. రూ.43వేల కోట్లు దోచుకుని 11కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్య‌క్తి కేవ‌లం ల‌క్ష రూపాయ‌ల ఫ‌ర్నిచ‌ర్ కోసం కేసులు పెట్టి వేధించ‌డంతోనే కోడెల ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని ఆరోపించాడు.

కోడెల లాంటి నేత‌ల‌ను ప్ర‌భుత్వం కేసుల పేరుతో వేధించ‌డం వల్లే ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని... ఇది ముమ్మాటికి వైసీపీ ప్ర‌భుత్వ హ‌త్యేన‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వ తీరును దుయ్య‌బ‌ట్టారు. వైసీపీ ప్ర‌భుత్వం టెర్ర‌రిస్టు ప్ర‌భుత్వం క‌న్నా ఎక్కువ‌ని బాబు మండిప‌డ్డాడు. కోడెల ఆత్మ‌హ‌త్య‌ను కుమారుడి - కూతురు వేధింపులే కార‌ణ‌మ‌ని అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని ఇది ఏమాత్రం త‌గ‌ద‌ని - కుమారుడు విదేశాల్లో ఉన్నాడు కానీ - లేకుంటే కోడెల‌ను త‌న కొడుకే చంపాడ‌ని ప్ర‌చారం చేసేవార‌ని మండిప‌డ్డాడు.

దేశంలో కోడెల లాంటి సీనియ‌ర్ రాజ‌కీయ‌ నేత ఎవ‌రు ఇలా అవ‌మాన‌క‌రంగా ఆత్మ‌హ‌త్య చేసుకోలేద‌ని - ఇది దారుణ‌మైన ప్ర‌భుత్వం అని - వైసీపీ నేత‌లంతా ఓ ప‌థ‌కం ప్ర‌కారం సోష‌ల్ మీడియాలో నిత్యం వేధించ‌డం వ‌ల‌నే కోడెల మ‌న‌స్థాపం చెంది ఆత్మ‌హ‌త్య చేసుకునేలా ప‌రిస్థితులు పురిగొల్పాయ‌ని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 40 ఏళ్ల‌ రాజ‌కీయ అనుభవం ఉన్న నేత ఆత్మ‌హ‌త్య చేసుకుంటే ఏమీ చేయ‌లేక పోతున్నామ‌ని అన్నారు. కోడెల మృతి చెందిన త‌రువాత తాను కూడా నిద్ర‌లేని రాత్రి గ‌డిపాన‌ని చంద్ర‌బాబు తెలిపారు.

కోడెల‌పై అనేక అస‌త్య‌ - త‌ప్పుడు కేసులు వేయించి వేధించార‌ని - అస‌లు సంబంధం లేని కేసులు పెట్ట‌డంతోనే త‌ట్టుకోలేక పోయాడ‌ని - పాత కేసులు తిర‌గ‌దోడారని - మ‌రో 19 కేసులు న‌మోదు చేశార‌ని గుర్తు చేశారు. త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి లేఖ రాస్తే కూడా ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌ని - ఏపీలో ఉన్న‌ది ఇంత నిరంకుశ ప్ర‌భుత్వ‌మా ? అని బాబు తూర్పార బట్టారు. ఏపీలో ఓ నిరంకుశ ప్ర‌భుత్వం రాజ్య‌మేలుతుంద‌ని... ఇది దుర్మార్గ‌మైన పాల‌న చేస్తుంద‌ని... ఇది దేశానికి మొత్తం తెల‌వాల్సిన అవ‌సరం ఉంద‌ని చంద్ర‌బాబు అన్నారు. ఓ సీనియ‌ర్ నేత ఇలా ఆత్య‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం చూస్తే ప్ర‌భుత్వం ఆడుతున్న ఓ దుర్మార్గ‌మైన హ‌త్యారాజ‌కీయాల‌ క్రీడ‌లా ఉంద‌ని బాబు ధ్వ‌జ‌మెత్తారు.